చిలీని కాల్చేస్తున్న కార్చిర్చు.. 51 మంది మృతి
దావానంలా వ్యాపిస్తున్న మంటల్లో ఇప్పటివరకు కనీసం 51 మంది మృతిచెందినట్లు సమాచారం.
దక్షిణ అమెరికా దేశమైన చిలీని కార్చిచ్చు కాల్చేస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెలరేగిన కార్చిచ్చు గంటలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. దావానంలా వ్యాపిస్తున్న మంటల్లో ఇప్పటివరకు కనీసం 51 మంది మృతిచెందినట్లు సమాచారం.
గతేడాది కంటే తక్కువ విస్తీర్ణంలో కార్చిచ్చు చెలరేగినా.. ప్రాణ నష్టం మాత్రం ఈసారి అధికంగా ఉంది.వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దాదాపు 1,100 ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా చెలరేగిన మంటల కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ విజ్ఞప్తి చేశారు.
వేగంగా విస్తరిస్తున్న మంటలను అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు.అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు కార్చిచ్చు చెలరేగగా.. 43 వేల హెక్టార్లలో అడవులు ప్రభావితమైనట్టు మంత్రి చిలీ అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తొహా చెప్పారు.
వాల్పరైజో రీజియన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో ఈ ప్రాంతం నుంచి వేలాది మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారంతా పునరావాస కేంద్రాల్లో తలదాంచుకుంటున్నారని తెలిపారు. గత దశాబ్ద కాలంలో దేశంలో చెలరేగిన కార్చిచ్చుల్లో అత్యంత దారుణమైనది ఇదేనని చిలీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తెలిపింది.