విమానంలో కొట్టుకుని.. కిటికీ పగలగొట్టారు..! - నలుగురి అరెస్ట్
గొడవ సద్దుమణిగిన తర్వాత తిరిగి విమానం టేకాఫ్ అయింది. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ వారు గొడవ మొదలుపెట్టారు. ఈసారి అది తారాస్థాయికి చేరింది.
గాల్లో విమానం ఎగురుతున్న వేళ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఏదో ఒక దుందుడుకు చర్యలు చేయడం ఇటీవల ఎక్కువైంది. ప్రయాణించే గంట లేదా రెండు గంటల సమయం కూడా పలువురు.. వివాదాలకు దూరంగా ఉండలేకపోతున్నారు. దీనివల్ల మిగిలిన ప్రయాణికులు అసౌకర్యానికి గురవడమే కాకుండా.. గాల్లో విమానం ఉన్న వేళ జరుగుతున్న ఈ ఘటనల వల్ల ఎలాంటి పరిణామాలు దారితీస్తాయోనని ఆందోళనకు గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ విమానంలో జరిగింది. దానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఆస్ట్రేలియాలోని క్యాన్జ్ నుంచి నార్త్ ఆస్ట్రేలియాకు వెళ్లే విమానంలో ముగ్గురు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. అది కాస్తా ముదిరి ఒక మహిళా ప్రయాణికురాలు మరో ప్రయాణికుడిపై గాజు సీసాతో దాడి చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకొని, తన్నుకున్నారు. సిబ్బంది ఆపే ప్రయత్నం చేసినా ఎవరూ ఆగలేదు. తోటి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవడంతో విమానాన్ని సమీపంలోని క్వీన్స్‌ల్యాండ్‌కు మళ్లించి అక్కడి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు.
గొడవ సద్దుమణిగిన తర్వాత తిరిగి విమానం టేకాఫ్ అయింది. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ వారు గొడవ మొదలుపెట్టారు. ఈసారి అది తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు దాడికి యత్నించడంతో విమానం కిటికీతో పాటు కొన్ని వస్తువులు కూడా విరిగిపోయాయి. ఈ క్రమంలో విమానాన్ని దించిన అనంతరం పోలీసులు నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. సందట్లో సడేమియాగా మరో ప్రయాణికుడు మాదక ద్రవ్యాలు తరలిస్తుండటాన్ని గుర్తించి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవలే తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన ఘటనలు చోటుచేసుకోవడం, విమానంలో తోటి ప్రయాణికులతోను, సిబ్బందితోనూ ఘర్షణలకు దిగడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఘటనలో ఏకంగా ప్రయాణికుల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.