వైమానిక విన్యాసాల్లో విషాదం.. - 2 విమానాలు ఢీకొని పైలట్ మృతి
పోర్చుగల్, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్ స్టార్స్’ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లావ్ యాక్–52 రకానికి చెందినవి.
వైమానిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా ఒక విమానం మరో విమానాన్ని ఢీకొనడంతో రెండూ కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒక పైలట్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. దక్షిణ పోర్చుగల్‌లోని బెజాలో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 6 విమానాలు విన్యాసాలు ప్రదర్శిస్తుండగా, ఒకటి వేగంగా పైకి దూసుకెళ్లి మరో దాన్ని ఢీకొనడంతో రెండూ ఒక్కసారిగా నేలకూలాయి.
కూలిన విమానాల్లో ఒకటి ఎయిర్‌బేస్‌కి అవతలి వైపు పడగా, మరోటి సమీపంలో కుప్పకూలింది. ఒక విమానం కుప్పకూలిన వెంటనే భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరణించిన పైలట్ స్పెయిన్‌కి చెందిన వ్యక్తి కాగా.. గాయపడిన పైలట్ పోర్చుగల్ పౌరుడు. ఈ ఘటనపై పోర్చుగల్ రక్షణ మంత్రి నునో మెలో స్పందిస్తూ.. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేపడతామని చెప్పారు. పోర్చుగల్, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్ స్టార్స్’ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లావ్ యాక్–52 రకానికి చెందినవి. ఒక వీక్షకుడు తన కెమెరాలో ఈ విన్యాసాలను చిత్రీకరిస్తుండగా.. ఈ ఘటన జరగగా.. ఆ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.