Telugu Global
International

మస్క్ బ్లూ టిక్ ప్లాన్‌తో ప్రముఖ సంస్థకు రూ.1.20 లక్షల కోట్ల నష్టం

ఇన్సులిన్‌ను ఇకపై ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఎల్లీ లిల్లీ పేరిట ఉన్న నకిలీ అకౌంట్‌లో ఒక ట్వీట్ ప‌డింది. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది.

మస్క్ బ్లూ టిక్ ప్లాన్‌తో ప్రముఖ సంస్థకు రూ.1.20 లక్షల కోట్ల నష్టం
X

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోంది. ట్విట్ట‌ర్‌‌ను కొనుగోలు చేసిన మీదట ఏం చేసినా ఎదురు తంతోంది. తాజాగా ట్విట్ట‌ర్‌ను లాభాల బాట పట్టించేందుకు డబ్బులిస్తే ఎవరికైనా బ్లూ టిక్ మార్క్ ఇచ్చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించడమే కాదు.. అమల్లో కూడా పెట్టేశారు. ఇదే ఓ ప్రముఖ కంపెనీ కొంపముంచింది. ఏకంగా ఆ సంస్థకు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.20 లక్షల కోట్లు) నష్టానికి ఈ బ్లూ టిక్ కారణమైంది.

డబ్బులు ఇస్తే చాలు ఎవరికైనా బ్లూ టిక్ ఇస్తుండటంతో అది మిస్ యూజ్ అయిపోయి అసలు సంస్థకు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. అమెరికాలో ప్రముఖ ఫార్మా దిగ్గజమైన 'ఎల్లీ లిల్లీ' ఇన్సులిన్ తయారు చేస్తోంది. ఈ సంస్థకు దేశ విదేశాల్లో 18 బ్రాంచ్‌లు ఉన్నాయి. గత శుక్రవారం ఒక ఫేక్ ట్వీట్ ఈ సంస్థ పేరిట వైరల్ అయ్యింది. ఇన్సులిన్‌ను ఇకపై ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఎల్లీ లిల్లీ పేరిట ఉన్న నకిలీ అకౌంట్‌లో ఒక ట్వీట్ ప‌డింది. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది. స్టాక్ మార్కెట్‌కి నిజానిజాలతో పని ఉండదు. ఎక్కడో ఎవడో కూర్చొని ఏదేని సంస్థ గురించి ఒక్క ట్వీట్ పెట్టేస్తే చాలు. ఇక ఆ సంస్థ పని గోవిందా.

'ఎల్లీ లిల్లీ గురించి పెట్టిన‌ ఫేక్ ట్వీట్‌తో సంస్థ షేర్ ధర ఏకంగా 4.37 శాతం మేర పడిపోయింది. అంటే.. ఒక్కరోజులో 'ఎల్లీ లిల్లీ' మార్కెట్ విలువలో సుమారు 15 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. నిజంగా ఉచితంగా ఇన్సులిన్ అందజేస్తుందని ఇన్వెస్టర్స్ భయపడటంతో సంస్థ షేర్ ధర నేలకు కరిచింది. విషయం తెలుసుకున్న 'ఎల్లి లిల్లీ' ట్విట్ట‌ర్ వేదికగా వివరణ ఇచ్చినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలైన అకౌంట్లకు మాత్రమే ఇచ్చే బ్లూటిక్‌ మార్క్‌ను మస్క్ అమ్మకానికి పెట్టడంతో.. బ్లూ టిక్ ఉన్న నకిలీ అకౌంట్లు ఇష్టానుసారంగా పెరిగాయి. ఇది గుర్తించిన ట్విట్ట‌ర్ ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ జారీని శుక్రవారమే నిలిపివేసింది. దాని స్థానంలో 'అఫీషియల్' బ్యాడ్జ్‌ను కొన్ని అకౌంట్లకు పునరుద్ధరించినప్పటికీ 'ఎల్లీ లిల్లీ' విషయంలో అప్పటికే నష్టం జరిగిపోయింది.

First Published:  14 Nov 2022 10:06 AM IST
Next Story