Telugu Global
International

బద్దలైన అగ్నిపర్వతం.. 11 మంది మృత్యువాత - మరో 12 మంది ఆచూకీ గల్లంతు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇండోనేషియాలోని మౌంట్‌ మరపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

బద్దలైన అగ్నిపర్వతం.. 11 మంది మృత్యువాత    - మరో 12 మంది ఆచూకీ గల్లంతు
X

ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో ఘోర దుర్ఘటన జరిగింది. ఓ అగ్ని పర్వతం బద్దలై 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైంది. ఆదివారం సుమత్రా దీవిలోని మౌంట్‌ మరపిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇండోనేషియాలోని మౌంట్‌ మరపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారాంతం కావడంతో పర్వతారోహకులు ట్రెక్కింగ్‌ చేసే సమయంలో అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్‌ మాలిక్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందని ఆయన చెప్పారు. వారిలో 49 మందిని కాపాడామని, 11 మంది మరణించారని తెలిపారు. మరో 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు. కాపాడిన వారిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వివరించారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని పడాంగ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్‌ మాలిక్‌ తెలిపారు.


First Published:  4 Dec 2023 9:13 AM GMT
Next Story