Telugu Global
International

మాల్దీవుల్లో భారీ అగ్ని ప్ర‌మాదం..9 మంది భార‌తీయులు స‌జీవ ద‌హ‌నం

మాల్దీవుల రాజధాని మాలేలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం పది మంది మృతి చెందారు.

మాల్దీవుల్లో భారీ అగ్ని ప్ర‌మాదం..9 మంది భార‌తీయులు స‌జీవ ద‌హ‌నం
X

మాల్దీవుల రాజధాని మాలేలోని ఒక గ్యారేజీలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం పది మంది మరణించ‌గా ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్టు అధికారులు తెలిపారు.

బాధితుల్లో పొరుగు దేశాలకు చెందిన కార్మికులు కూడా ఉన్నట్లు తెలిపారు. మృతుల‌ను గుర్తించేందుకు "మాల్దీవుల పోలీసు సర్వీస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని మాలేలోని ప్ర‌భుత్వ ఉన్నతాధికారి ఒక‌రు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది మృత‌దేహాల‌ను వెలికి తీశామ‌ని చెప్పారు. మృతుల్లో తొమ్మిది మంది భార‌తీయులు కాగా ఒక మృత‌దేహం బంగ్లా దేశీయుడిద‌ని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

మాలేలో వలస కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటారు. భార‌త్ తో పాటు బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకల నుంచి కార్మికులు వలస వ‌చ్చి ఇక్క‌డ జీవిస్తుంటారు. ప్రమాదం జ‌రిగిన భ‌వ‌నం కింది భాగంలో వాహ‌నాలు మ‌ర‌మ్మ‌తులు చేసే ఒక గ్యారేజీ ఉంది.

పైన ఉన్న చిన్న చిన్న గదుల్లో వ‌ల‌స కార్మికులు ఉంటున్నార‌ని అధికారులు తెలిపారు. భ‌వ‌నం మంట‌ల్లో చిక్కుకోవ‌డంతో వారు బ‌య‌టికి రాలేక‌పోయారు. ఆ గ‌దుల్లో నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 10 మృత‌దేహాల‌ను బ‌య‌టికి తెచ్చార‌న్నారు. మంట‌లు ఎగిసిప‌డుతుండ‌డంతో స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌కు ఆల‌శ్యం అవుతుంద‌న్నారు. మంట‌ల‌ను ఆర్పేందుకు దాదాపు తమకు నాలుగు గంటలు పట్టిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై పార్లమెంటరీ స్పీకర్, మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా, అగ్ని ప్రమాద ఘటనపై మాల్దీవులలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రమాదం దురదృష్టకరమని పేర్కొంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మాల్దీవుల అధికారులతో నిరంతరం టచ్ లో ఉంటున్నట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి సంబంధించి సాయం కోసం తమను సంప్రదించవచ్చని ట్విట్ట‌ర్ లో తెలిపింది.

First Published:  10 Nov 2022 2:47 PM IST
Next Story