Telugu Global
NEWS

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు దిగ్బ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు దిగ్బ్రాంతి
X

ఆంధ్రప్రదేశ్‌ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి కనుమరహదారిలో బస్సు, రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలమనేరు వైపు నుంచి ఐరన్‌ లోడుతో వస్తున్న లారీ .. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కనుమ రహదారిలో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అదుపు తప్పడంతో పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న బస్సు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‍ తో పాటు 8 మంది మరణించారు. మరో 30 మంది గాయపడగా.. క్షతగాత్రులను పలమనేరు ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 5గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ప్రమాదంపై చంద్రబాబు దిగ్బ్రాంతి

చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం.. సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

First Published:  13 Sept 2024 6:04 PM IST
Next Story