Hero Srikanth: ఇదేం ఖర్మ, ఈ ప్రచారమేంటి..? నటుడు శ్రీకాంత్ ఆవేదన
తన భార్య ఊహకు తాను విడాకులిస్తున్నట్టు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లలో తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు హీరో శ్రీకాంత్. ఈ ఫేక్ వార్తలు చూసి తన భార్య ఊహ ఆందోళనకు గురైందని చెప్పారాయన.
యూట్యూబ్ ఛానెళ్లకు థంబ్ నెయిల్ పెట్టుకోడానికి ఏదో ఒక వార్త కావాలి. మసాలా బాగా ఉన్నా కూడా ఇప్పుడెవరూ పట్టించుకోవట్లేదు. దీంతో ఫేక్ వార్తలతో వ్యూస్ కోసం తాపత్రయపడుతున్నారు. ఫలానా సీనియర్ నటుడు అకస్మాత్తుగా కన్నుమూశాడని వార్త పెడతారు, అది తప్పని తెలిసినా కూడా దాన్ని ఓపెన్ చేసి చూడకుండా ఉండలేరు కొంతమంది. ఆ బలహీనతను అడ్డు పెట్టుకుని ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక విడాకుల వార్తలకయితే లెక్కే లేదు. తాజాగా నిన్నటి తరం హీరో హీరోయిన్లు శ్రీకాంత్ - ఊహ జోడీ విడిపోతుందనే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపించింది. ఊహకు శ్రీకాంత్ విడాకులిస్తున్నారని, వ్యక్తిగత కారణాలతోనే వారు విడిపోతున్నారని వివరణ కూడా ఆ వార్తలో పొందుపరిచారు. కానీ అందులో నిజం లేదు. ఈ ఫేక్ వార్తపై హీరో శ్రీకాంత్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
తప్పుడు ప్రచారం..
తన భార్య ఊహకు తాను విడాకులిస్తున్నట్టు పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లలో తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు హీరో శ్రీకాంత్. ఈ ఫేక్ వార్తలు చూసి తన భార్య ఊహ ఆందోళనకు గురైందని చెప్పారాయన. ఆ ప్రచారంతో బంధువులు కూడా తమకు ఫోన్లు చేసి అడుగుతున్నారని, అసలిదంతా ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు శ్రీకాంత్.
టాలీవుడ్లో ఇటీవల విడాకుల కేసులు బాగా ఎక్కువయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నవారు, ఎంతో అన్యోన్యంగా ఉంటున్నవారు కూడా సడన్ గా ఓ రోజు ట్విట్టర్లో మేం విడిపోతున్నాం అని సందేశం పెడుతున్నారు. నాగచైతన్య - సమంత లాంటి జంటల వ్యవహారాలు ముందుగానే లీక్ అవుతున్నాయి. రజీనీకాంత్ కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్ వంటి కొన్ని జంటల విషయంలో సంచలన ప్రకటనలే బయటకొస్తున్నాయి. ఇంకొన్నిసార్లు విడాకులు తీసుకున్న తర్వాత సమాచారం బయటకొస్తోంది. ఈ దశలో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియదు. ఆ మధ్య దీపికా పదుకునే, రణ్వీర్సింగ్పై కూడా ఇలానే ప్రచారం చేశారు. ఇటీవల సానియా మీర్జా కాపురంలో కూడా కలతలున్నాయనే వార్తలు వినిపించాయి. ఇలాంటి వార్తల మధ్య శ్రీకాంత్ - ఊహలపై కూడా ఎవరో పుకార్లు మొదలుపెట్టారు. విడాకుల వార్తలతో అలజడి రేపారు. అయితే వెంటనే శ్రీకాంత్ తేరుకున్నారు. ఆ వార్తలను ఖండించారు, వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.