భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి రెండు గెజిట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అంతకుముందు ప్రధాని మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ (ఈసీ) పదవిని చేపట్టబోయే వ్యక్తులన పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హో మంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సీఈసీ, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటనలు వెలువడినాయి.
కేరళకు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అదికారి జ్ఞానేశ్ కుమార్ గత ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడలో జ్ఞానేశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంశాఖలో అప్పుడు ఆయన సంయుక్త కార్యదర్శి. ఆ తర్వాత సహకార శాఖ కార్యదర్శిగా 2024 జనవరిలో రిటైర్డ్ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. జ్ఞానేశ్ సీఈసీగా 2029 జనవరి 26 వరకు కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివర్లో బీహార్, వచ్చే ఏడాదిలో తమిళనాడు, పదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.