Telugu Global
NEWS

తెలంగాణలో కిరణ్ ఏమి చేయగలరు?

సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. కిరణ్ బీజేపీలో చేరటంలో ఆశ్చర్యమేమీలేదు. కాకపోతే తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించబోతున్నారన్న ప్రచారమే చాలా ఆశ్చర్యంగా ఉంది.

తెలంగాణలో కిరణ్ ఏమి చేయగలరు?
X

ఇప్పుడు ఈ విషయమే ఎవరికీ అర్థం కావటంలేదు. సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. కిరణ్ బీజేపీలో చేరటంలో ఆశ్చర్యమేమీలేదు. కాకపోతే తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించబోతున్నారన్న ప్రచారమే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఆశ్చర్యం ఎందుకంటే కిరణ్‌కు ఏపీ రాజకీయాల్లో ఏమాత్రం పట్టులేదు.

పుట్టింది, రాజకీయం చేసింది, ఎమ్మెల్యేగా గెలిచింది, స్పీకర్ గా పనిచేసింది అంతా ఏపీ రాజకీయాల వేదికగానే. చివరకు ముఖ్యమంత్రి అయింది కూడా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేగానే. అలాంటిది తెలంగాణ రాజకీయాల్లో కిరణ్ ఎలాంటి పాత్ర పోషించగలరు? తెలంగాణ రాజకీయాల్లో కిరణ్ ప్రభావం ఏముంటుందనేది ఎవరికీ అర్థంకావటంలేదు. పుట్టింది పీలేరులోనే అయినా చిన్పప్పటి నుండి పెరిగింది, చదువుకున్నదంతా హైదరాబాద్‌లోనే.

అంతమాత్రాన కిరణ్‌కు తెలంగాణతో సన్నిహిత సంబంధాలున్నట్లు కాదు కదా. నిజానికి ఏపీ కాంగ్రెస్‌లోనే కిరణ్ చెబితే వినేవాళ్ళు ఎవరూ లేరు. అందుకనే తన రాజకీయాన్ని పీలేరుకు మాత్రమే పరిమితం చేసేవారు. అలాంటి కిరణ్ అదృష్టం వల్ల ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో మూడున్నరేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారన్న మాటే కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కిరణ్ మాట చెల్లుబాటయ్యింది తక్కువే.

ఇలాంటి కిరణ్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. పార్టీ తరపున పోటీ చేసిన వాళ్ళకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. దాంతో కొంతకాలానికి మళ్ళీ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇంతకాలం ఎక్కడా చప్పుడు చేయని కిరణ్ హఠాత్తుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరబోవటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో బీజేపీని కిరణ్ ఏ విధంగా బలోపేతం చేస్తారో అగ్రనేతలకే తెలియాలి. ఏపీ రాజకీయాల్లోనే ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన ఈ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణలో ఏమి చేయగలరు? ఇవన్నీ ఆలోచించకుండానే పార్టీలోకి చేర్చుకుంటున్నారా? లేకపోతే ఓ మాజీ ముఖ్యమంత్రి బీజేపీలో చేరటం చాలా గొప్పని అగ్రనేతలు ఫీలయ్యారా?

First Published:  11 March 2023 12:56 PM IST
Next Story