Telugu Global
NEWS

ఇంటి పేరులో నేముంది..ఫేముంది.. న‌యా ట్రెండ్

త‌మ తండ్రులో, తాత‌లో, భ‌ర్త‌ల రాజ‌కీయ వార‌సులం అనిపించుకోవాలంటే పేరు ముందు ఆయా ప్ర‌ముఖుల ఇంటి పేరు త‌ప్ప‌నిస‌రి అని వీరు భావిస్తున్నారు.

ఇంటి పేరులో నేముంది..ఫేముంది.. న‌యా ట్రెండ్
X

అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని పేర్ల‌కి రిపేర్లు చేస్తున్న రోజులు. అద‌న‌పు అక్ష‌రాలు జోడించి త‌మ పేర్ల‌ను వికృతంగా మార్చుకుంటున్న సెంటిమెంట్లు. పేరు మారితే తీరు మారుతుందా..? అనేవి మూఢ‌న‌మ్మ‌కాలే అయినా బాగా చ‌దువుకున్న వాళ్లు సైతం న్యూమ‌రాల‌జీ, సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా పేర్లు మార్చుకుంటున్నారు. చాలా మంది త‌మ పేర్లు మార్చుకుంటుంటే, కొంద‌రు పేరు మార్చుకోవ‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌టంలేదు. అందులోనా ఇంటి పేరుని వ‌దులుకోవ‌డానికి మ‌హిళామ‌ణులు సుత‌రామూ ఒప్పుకోవ‌డంలేదు. క‌న్న‌వారి ఇంటి పేరు కోసం తెలుగు రాష్ట్రాల‌లో ఆడ‌బిడ్డ‌లు పోరాటం చేయాల్సి వ‌స్తోంది. రాజ‌కీయాల‌లో వార‌సులైన అబ్బాయిల‌కి పార్టీల‌లో అవ‌కాశాల‌తోపాటు తండ్రుల పేరు, ఇంటి పేరు సులువుగా బ‌దిలీ అయిపోతోంది. అమ్మాయిల‌కే ఇంటి పేరు స‌మ‌స్య‌గా మారుతోంది.

తాను తెలంగాణ కోడ‌లినంటూ రాజ‌కీయాలు నెర‌పుతున్న వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌, ఇంకా త‌న క‌న్న‌వారి ఇంటి పేరు వైఎస్ ని త‌న పేరు ముందుంచుకుంటోంది. ఎవ‌రైనా అడిగితే ఆడ‌పిల్ల అని ఎందుకంటారు, ఆడ‌పిల్ల‌గాబ‌ట్టి అంటూ తెలివైన స‌మాధానం ఇస్తారు. తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు కుమార్తె క‌విత కూడా కల్వ‌కుంట్ల క‌విత‌గానే కొన‌సాగుతున్నారు. నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె సుహాసిని అత్త‌వారింటి పేరు పెట్టుకోరు. నంద‌మూరి సుహాసినిగానే ఉండాల‌నుకుంటారు. వీర‌గంధం ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ ని వివాహం చేసుకున్నాక నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి అయ్యారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు గౌతు ల‌చ్చ‌న్న త‌న‌యుడు గౌతు శ్యాం సుంద‌ర్ శివాజీ రాజ‌కీయ వార‌స‌త్వం కోసం కుమార్తె యార్ల‌గ‌డ్డ వారింటి కోడ‌లు శిరీష పోటీప‌డుతోంది. అయితే ఆమె గౌతు శిరీష‌గానే ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతోంది.

త‌మ తండ్రులో, తాత‌లో, భ‌ర్త‌ల రాజ‌కీయ వార‌సులం అనిపించుకోవాలంటే పేరు ముందు ఆయా ప్ర‌ముఖుల ఇంటి పేరు త‌ప్ప‌నిస‌రి అని వీరు భావిస్తున్నారు. అత్తింటికి వెళ్లినా క‌న్న‌వారింటి పేరు ఉంచుకోవ‌డంలో త‌ప్పులేదు. ఆస్తుల‌తోపాటు రాజ‌కీయాల‌లోనూ త‌మ వాటాలు డిమాండ్ చేసే మ‌హిళ‌లకు ఇంటి పేరు ఓ బ్రాండ్ అని భావిస్తుండ‌డం వ‌ల్లే స‌ర్ నేమ్ అవ‌స‌రం ప‌డుతోంది. అందుకే ఇంటి పేరులో నేముంది, ఫేముంది మా క‌న్న‌వారింటి పేరే మాకు ముద్దు అంటున్నారు తెలుగు రాష్ట్రాల మ‌హిళా రాజ‌కీయ‌నేత‌లు. వీరి ప్ర‌త్య‌ర్థులు మాత్రం చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్ముకుంటున్నార‌ని, ప‌ద‌వుల‌పై ఆశ‌తో అత్తింటి పేరు కూడా తీసేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

First Published:  6 March 2023 7:47 AM IST
Next Story