Telugu Global
NEWS

గర్భనిరోధక మాత్రల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా..!

ఇప్పటికే ఊబకాయం, మధుమేహంతో బాధపడుతున్నవారు, ధూమపానం అలవాటున్న మహిళలు గర్భనిరోధక మాత్రలను అస్సలు ఉపయోగించకూడదు.

గర్భనిరోధక మాత్రల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా..!
X

మారుతున్న కాలంతోపాటు సంబంధాలు, పిల్లలను కనే విషయంలో జంటల ఆలోచనల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. గర్భం దాల్చ‌కుండా మహిళలకు చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో ఎక్కువ మంది గర్భనిరోధక మాత్రలు వినియోగిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల కంటే ఎక్కువ మంది మహిళలు గర్భ‌నిరోధక మాత్రలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.

గర్భనిరోధక మాత్రల్లో సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి. ఎథినిల్ ఈస్ట్రాడియాల్ ప్రతి నెల గర్భాశయంలో అండం పెరగకుండా ఆపుతుంది. అంతే కాదు ఇవి మహిళలకు పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం కాకుండా తగ్గిస్తాయి. అందుకే చాలా మంది మహిళలు, కొత్తగా పెళ్లైన వాళ్లు గర్భనిరోధక మాత్రలను వాడుతున్నారు. ఇవి ప్రతి మెడికల్ షాప్ లోనూ విరివిగా దొరకటం వల్ల డాక్టర్ల‌ను సంప్ర‌దించ‌కుండా వాడేస్తున్నారు. అయితే అలా వాడటం వల్ల మంచి మాటేమో గానీ, చెడు ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని వాడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. అంతేగాక హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుందని అంటున్నారు. గర్భనిరోధక మాత్రల విరివిగా వాడడం వల్ల వికారం, వాంతులు, రొమ్ము నొప్పి, పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడం, బరువు పెరగటం వంటివి జరుగుతాయి. అంతేకాదు మానసిక కల్లోలం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

ఈ విషయాలను క‌చ్చితంగా గుర్తు పెట్టుకోండి..

ఇప్పటికే ఊబకాయం, మధుమేహంతో బాధపడుతున్నవారు, ధూమపానం అలవాటున్న మహిళలు గర్భనిరోధక మాత్రలను అస్సలు ఉపయోగించకూడదు. 10 ఏండ్లకు పైగా వీటిని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 60 శాతం పెరుగుతుంది. గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల అంతర్గత రక్తస్రావం జరగవచ్చు. అంతే కాదు అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడే వారు కూడా వీటిని వాడరాదు. అన్నింటికంటే ముఖ్యమైనది ఈ మాత్రలు తీసుకునే ముందు వైద్యుడిని క‌చ్చితంగా సంప్రదించాలి.

First Published:  21 May 2024 12:09 PM GMT
Next Story