Telugu Global
NEWS

శాకాహార మాంసం గురించి తెలుసా?

సాధారణ మాంసం కంటే వెజ్ మీట్ లోనే ఎక్కువ పోషకాలుంటాయి. కావాలంటే తయారు చేసేటప్పుడే పోషకాల మోతాదు పెంచుకోవచ్చు కూడా. వ్యక్తుల ఆరోగ్యానికి, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు.

శాకాహార మాంసం గురించి తెలుసా?
X

మాంసాహారం మానేసి వెజిటేరియన్‌గా మారిపోవాలని అనుకుంటారు చాలామంది. కానీ నాన్‌వెజ్ మీద ఇష్టాన్ని చంపుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ కొత్తరకం మాంసం పుట్టుకొచ్చింది. దీన్ని 'వెజ్ మీట్' అంటున్నారు. ఇది అచ్చంగా చికెన్, మటన్ లాగానే ఉంటుంది. కానీ ఇది జంతువుల నుంచి వచ్చిన మాంసం కాదు.

ఇటీవల కాలంలో మనదేశంలో వీగన్ ట్రెండ్స్ బాగా పెరిగాయి. ఈ ట్రెండ్‌లో భాగంగానే వెజిటేరియన్ ఫుడ్స్‌లో కొత్తకొత్త రకాలు పుట్టుకొచ్చాయి. వెజిటేరియన్ మీట్ కూడా అలాంటిదే. ఇది ప్లాంట్ బేస్డ్ మీట్.. అంటే మొక్క ఆధారిత మాంసం అని అర్థం. ఇది రుచిలో మాంసానికి ఏమాత్రం తీసిపోదు. ఒక సర్వే ప్రకారం వెజిటేరియన్ మీట్‌ను శాకాహారుల కంటే మాంసాహారులే ఎక్కువగా తింటున్నారని తేలింది. దీన్ని బట్టి వెజ్ మీట్ రుచి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్లాంట్ బేస్డ్ మీట్‌ను మొక్కల నుంచి సేకరించిన ప్రొటీన్ కణాలతో తయారుచేస్తారు. ప్రొటీన్ కణాలను లవణాలు, ప్రొటీన్లు, పిండిపదార్థాలతో కూడిన ద్రావణంలో ఉంచి, కణాలు డెవలప్ అయ్యేలా చేస్తారు. ఇలా చేయడం ద్వారా ప్రతి 24 గంటలకు కణాల సంఖ్య రెట్టింపు అవుతుంది. అలా కొంతకాలానికి ప్రొటీన్లతో కూడిన మాంసం తయారవుతుంది. కణాల నుంచి తయారయ్యే మాంసం చూడ్డానికి ఒక ముద్దలా ఉంటుంది. ఈ మాంసంతో రకరకాల నాన్ వెజ్ వంటకాలు తయారుచేయొచ్చు. ఈ మాంసం పది రోజుల పాటు నిల్వ ఉంటుంది.

సాధారణ మాంసం కంటే వెజ్ మీట్ లోనే ఎక్కువ పోషకాలుంటాయి. కావాలంటే తయారు చేసేటప్పుడే పోషకాల మోతాదు పెంచుకోవచ్చు కూడా. వ్యక్తుల ఆరోగ్యానికి, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు. పైగా ఈ మాంసంలో ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్‌ లాంటివి ఉండవు. ప్లాంట్ బేస్డ్ మీట్‌లో ఉండే ప్రొటీన్స్‌ను.. సోయా, బటానీ, మష్రూమ్, ఆలూ, బ్రౌన్ రైస్ నుంచి సేకరిస్తారు. కాయగూరలు, నట్స్‌లో ఉండే పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, డైటరీ ఫైబర్‌‌కు ఎలాంటి లోటు ఉండదు. హెల్త్ పరంగా చూస్తే రెగ్యులర్ మాంసం కంటే ప్లాంట్ బేస్డ్ మీట్ ఒక మెట్టు పైన ఉంటుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ లాంటి సమస్యలున్నవారికి ఇదొక మంచి ఆల్టర్నేటివ్ అంటున్నారు డాక్టర్లు.


ప్లాంట్ బేస్డ్ మీట్‌తో పాటు రకరకాల ఇతర ఆర్టిఫిషియల్ మాంసాలు కూడా ఇటీవల పుట్టుకొచ్చాయి. మొక్క కణాలకు బదులుగా జంతు కణాలను వృద్ధి చేసి.. కల్చర్డ్ మీట్ లేదా కల్టివేటెడ్ మీట్ తయారు చేస్తున్నారు. అంటే జంతువులను చంపకుండా జంతు కణాలను ఉపయోగించి ల్యాబ్‌లో మాంసాన్ని తయారు చేయడమన్న మాట. దీన్ని టెస్ట్ ట్యూబ్స్, బయోరియాక్టర్లతో తయారుచేస్తారు. అలాగే ప్లాంట్ బేస్డ్ సీ ఫుడ్ కూడా పాపులర్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్‌‌లో జంతువులను చంపకుండానే మాంసం తయారుచేసుకోవచ్చన్నమాట,

First Published:  28 Oct 2022 4:03 PM IST
Next Story