ఐటీఆర్‌లో ఇంటి అద్దె.. హోంలోన్ మినహాయింపులు క్లయిమ్ చేశారా..? మీపైనే ఐటీ అధికారుల నిఘా..! ఎలాగంటే
ఆదాయం పన్ను విభాగం వేతన జీవులు దాఖలు చేస్తున్న ఐటీ రిటర్న్స్‌పై విస్తృత స్థాయిలో, లోతైన విశ్లేషణల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను ఉపయోగించనున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా కృత్రిమ మేధ(ఏఐ) టూల్‌ను సిద్ధం చేసింది.
గత ఆర్థిక సంవత్సర (2022-23) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు దగ్గర పడుతోంది. ప్రతి ఒక్కరూ తమ ఆదాయం వనరులతోపాటు పెట్టుబడులు, మదుపు, పన్ను మినహాయింపులపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఇంటి అద్దెలు, హోం లోన్ పేమెంట్స్ మీద పన్ను మినహాయింపులు కోరుతుంటారు. ఈ నేపథ్యంలో ఆదాయం పన్ను విభాగం వేతన జీవులు దాఖలు చేస్తున్న ఐటీ రిటర్న్స్‌పై విస్తృత స్థాయిలో, లోతైన విశ్లేషణల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను ఉపయోగించనున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా కృత్రిమ మేధ(ఏఐ) టూల్‌ను సిద్ధం చేసింది.
వేతన జీవులు సమర్పించే ఐటీ రిటర్న్స్‌లో ఇంటి అద్దె మీద, గృహ రుణంపై వడ్డీ చెల్లింపు మీద పన్ను మినహాయింపు క్లయిమ్ చేస్తుంటారు. ఆయా క్లయిమ్స్ అనుమానాస్పదంగా ఉంటే.. వాటిపై దృష్టి సారిస్తారు ఆదాయం పన్ను విభాగం అధికారులు.
రక్త సంబంధీకుల ఇండ్లలో నివాసం ఉంటున్నట్లు పేర్కొంటూ ఇంటి అద్దె క్లయిమ్‌లు సమర్పిస్తారని చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతారు. కానీ, ఆయా ఇంటి అద్దె చెల్లింపుల వివరాలు.. ఇంటి అద్దె స్వీకరించిన వారి ఐటీ రిటర్న్స్‌లో కనిపించవు. ఇంటి రుణంపై వడ్డీ చెల్లిస్తున్నట్లు మోసపూరిత క్లయిమ్‌లు కూడా దాఖలు చేస్తుంటారని చార్టర్డ్ అకౌంటెంట్లు అంటున్నారు. జీవన వ్యయంతోపాటు పిల్లల విద్యా వ్యయం పెరిగిపోవడంతోపాటు ఆయా విభాగాల్లో డిడక్షన్లు పరిమితంగా ఉండటం వల్లే వేతన జీవులు తమ ఐటీఆర్‌ల్లో ఇటువంటి ఇంటి అద్దె, గృహ రుణం వడ్డీ చెల్లింపుల పేరిట మినహాయింపులు క్లయిమ్ చేస్తారంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో పలువురు వేతన జీవులు పెట్టుబడులు పెట్టడానికి, పన్ను ఆదా చేయడానికి ఇబ్బందులు పడుతూనే ఉంటారని కొందరు చార్టర్డ్ అకౌంటెంట్ల అంటున్నారు. తాము చెల్లించాల్సిన పన్ను భారం తగ్గించుకోవడానికి ఇటువంటి పద్ధతులు అవలంభిస్తుంటారని చెబుతున్నారు. ఏళ్ల తరబడి వేతన జీవులు దాఖలు చేస్తున్న ఐటీఆర్‌లను విశ్లేషించాలని సూచిస్తున్నారు. ఈ ఖాతాల కింద మోసపూరిత క్లయిమ్‌లు దాఖలు చేసినా స్క్రూటినీ, ఐటీ అధికారుల దర్యాప్తును ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
జీసీసీఐ ప్రత్యక్ష పన్నుల కమిటీ చైర్మన్-చార్టర్డ్ అకౌంటెంట్ జైనిక్ వకీల్ స్పందిస్తూ.. ఇంటి అద్దె డిడక్షన్స్ వంటి విషయంలో అన్ క్వాలిఫైడ్ క్లయిమ్‌లు చేయొద్దని వేతన జీవులకు సూచించారు. వేతన జీవులు సమర్పించే స్వీయ క్లయిమ్‌లపై ఆదాయం పన్ను విభాగం విజిలెంట్‌గా ఉంటారని తెలిపారు. పాత పన్ను విధానాన్ని ఎంచుకునేవారు ఇంటి యజమానితో రెంట్ అగ్రిమెంట్, రెంట్ పేమెంట్స్ తదితర పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. 80సీ సెక్షన్ కింద వేతన జీవులు దాఖలు చేసే పన్ను మినహాయింపు క్లయిమ్‌లు తరుచుగా అనుమానాస్పదంగా మారుతున్నాయంటున్నారు. రూ.10 లక్షల్లోపు ఆదాయం గల వేతన జీవులకు బేసిక్ మినహాయింపు, స్టాండర్డ్ మినహాయింపు పరిమితులు పెంచాలని చార్టర్డ్ అకౌంటెంట్ కరీం లఖానీ తెలిపారు.