నాకు సంస్కారం ఉంది.. వివాదాన్ని కొనసాగించను.. నాగబాబుకు తమ్మారెడ్డి కౌంటర్
నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. తనపై విమర్శలు చేసిన వారి పట్ల తాను కూడా తీవ్రస్థాయిలో స్పందించగలనని, అయితే తన తల్లిదండ్రులు సంస్కారంతో పెంచారని కౌంటర్ ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుకు సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహించడానికి రాజమౌళి బృందం కోట్లకు కోట్లు ఖర్చుపెట్టడంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విమర్శలు చేశారు. ఆస్కార్ అవార్డు ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం 80 కోట్లు ఖర్చు పెట్టిందని, అదే 80 కోట్లతో మేమైతే 8 సినిమాలు తీసి ముఖాన కొడతామని వ్యాఖ్యానించారు. తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టాలీవుడ్ లో తీసిన ఒక సినిమా హాలీవుడ్‌లో ప్రశంసలు దక్కించుకోవడం నీకు ఇష్టం లేదా.. అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు.
తెలుగు సినిమాకు తెలుగు దర్శకుడికి మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి కానీ, ఇలా విమర్శలు చేయడం ఏంటని దర్శకుడు కె. రాఘవేంద్రరావు తమ్మారెడ్డిని సున్నితంగా మందలించారు. ఇక ఈ వ్యవహారంపై నటుడు నాగబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కోసం నీ.. మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు.. అని తీవ్ర పదజాలంతో విమర్శించారు.
నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. తనపై విమర్శలు చేసిన వారి పట్ల తాను కూడా తీవ్రస్థాయిలో స్పందించగలనని, అయితే తన తల్లిదండ్రులు సంస్కారంతో పెంచారని కౌంటర్ ఇచ్చారు. వారం కిందట తాను రాజమౌళిని పొగుడుతూ వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం వివాదం చేస్తున్నారని మండిపడ్డారు.
ఒకవేళ తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే 'మీరు మాట్లాడింది తప్పు.. అని నాకు చెప్పవచ్చని..' అలా కాకుండా అసభ్య పదజాలంతో తిట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది చాలా అసహ్యంగా ఉందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.