11 నిమిషాల నడకతో అకాల మరణాలకు చెక్
పెద్దలు వారంలో కనీసం 150 నిమిషాలు ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వరకు లేదా 75 నిమిషాలు అత్యంత తీవ్రస్థాయి శారీరక శ్రమ చేయాలని ఎన్‌హెచ్ఎస్ సూచించింది.

చిన్న వయసులోనే గుండెపోటుతో అకాల మరణానికి గురవుతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టాలంటే.. నడకే మార్గమని ఓ అధ్యయనంలో తేలింది. అదీ రోజుకు 11 నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు వేగంగా నడిస్తే చాలని ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ నడక వల్ల గుండె సంబంధిత, పక్షవాతం, కేన్సర్ వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొంది.
ఇటీవల తాము చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం తెలిపింది. యూకేకు చెందిన జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్ఎస్) సూచించిన శారీరక శ్రమలో సగం చేసినా ప్రతి పది అకాల మరణాల్లో ఒకదానిని నివారించవచ్చని `బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్`లో ప్రచురించిన తాజా అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు.
పెద్దలు వారంలో కనీసం 150 నిమిషాలు ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వరకు లేదా 75 నిమిషాలు అత్యంత తీవ్రస్థాయి శారీరక శ్రమ చేయాలని ఎన్‌హెచ్ఎస్ సూచించింది. ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం కన్నా.. ఎంతో కొంత శ్రమించడం వల్ల తప్పనిసరిగా మేలు కలుగుతుందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో వైద్య పరిశోధన మండలి (ఎంఆర్‌సీ) మహమ్మారుల విభాగానికి చెందిన డాక్టర్ సోరెన్ బ్రేజ్ పేర్కొన్నారు.