Telugu Global
NEWS

కోమటిరెడ్డి ఆత్మగౌరవ నినాదం.. అధిష్ఠానంపై అసంతృప్తి..!

ఇప్పటివరకూ పార్టీనే తొలి ప్రాధాన్యతగా చెబుతూ వచ్చిన కోమటిరెడ్డి..ఫస్ట్ టైం ఆత్మగౌరవం అంటూ నినాదాన్ని ఎత్తుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో హై కమాండ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

కోమటిరెడ్డి ఆత్మగౌరవ నినాదం.. అధిష్ఠానంపై అసంతృప్తి..!
X

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి అధిష్ఠానంపై అలకబూనారు. ఇటీవల ప్రకటించిన సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ, స్క్రీనింగ్ కమిటీల్లో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆయన పెద్దగా కలగజేసుకోవడం లేదు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌ను కూడా ఇప్పటివరకు కలవలేదు. సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీలో తెలంగాణ నుంచి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి మాత్రమే చోటు దక్కింది.

ఇక అసంతృప్తిలో ఉన్న కోమటిరెడ్డిని కాంగ్రెస్ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్‌ నేత సంపత్ కుమార్‌..ఆయనతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీతో పాటు ఆత్మగౌరవం ముఖ్యమేనన్నారు. ఇప్పటివరకూ పార్టీనే తొలి ప్రాధాన్యతగా చెబుతూ వచ్చిన కోమటిరెడ్డి..ఫస్ట్ టైం ఆత్మగౌరవం అంటూ నినాదాన్ని ఎత్తుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో హై కమాండ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు థాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కోమటిరెడ్డి నివాసానికి వెళ్లారు. అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే కేసీ వేణుగోపాల్‌తో మీటింగ్ తర్వాత కోమటిరెడ్డి అలకపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

First Published:  6 Sept 2023 4:16 PM IST
Next Story