సిట్టింగ్‌ల విషయంలో కేసీఆర్ ఇలా.. జగన్ అలా..
ప్రభుత్వ పథకాల అమలు సరిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల పనితీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉండరు అనేది కేసీఆర్ లాజిక్. ఇటు జగన్ మాత్రం ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ సీట్లు ఇచ్చే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉదారంగా ఉన్నట్టు ఇటీవల స్పష్టమైంది. దాదాపుగా సిట్టింగ్‌లు అందరికీ సీట్లు ఇస్తామంటూ ఆయన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో స్పష్టం చేశారు. గెలుపు అవకాశాలు తమ పార్టీకే ఎక్కువగా ఉన్నాయని చెప్పిన ఆయన.. దాన్ని చెడగొట్టుకోవద్దని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు.
ఏపీలో ఇలా..
ఏపీలో పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉంది. ఏపీలో సీఎం జగన్ సర్వేలపై ఆధారపడ్డారు. ఆఖరికి గడప గడప కార్యక్రమంపై కూడా ఆయన పీకే టీమ్‌తో నిఘా పెట్టారు. ఆ కార్యక్రమాన్ని సమర్థంగా చేయలేనివారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరించారు జగన్. ఇప్పటికే 27 మంది లిస్ట్ తీశారు. మరోసారి వారి పురోగతిని బేరీజు వేస్తామన్నారు. దీంతో సిట్టింగుల్లో గుబులు మొదలైంది.
తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమ్ ఉంది. ఈ దశలో ఏపీ సీఎం జగన్ సిట్టింగ్‌లకు ఇచ్చిన వార్నింగ్‌తో వారిలో భయం మొదలైంది. రెండేళ్ల ముందుగానే టెన్షన్ పట్టుకుంది. జగన్‌ని ఎలా మెప్పించాలనే విషయంలో వారు తలమునకలవుతున్నారు.
ఎవరి వ్యూహం కరెక్ట్..?
సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చే విషయంలో ఎవరి వ్యూహం కరెక్ట్ అనేది ముందు ముందు తేలిపోతుంది. ప్రభుత్వ పథకాల అమలు సరిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల పనితీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉండరు అనేది కేసీఆర్ లాజిక్. అందుకే సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రచారం కల్పిస్తూ ముందుకెళ్తున్నారు కేసీఆర్. ఎమ్మెల్యేలపై ఎక్కడా ఒత్తిడి పెట్టడంలేదు. ఇటు జగన్ మాత్రం ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పీకే టీమ్ సర్వేలతో ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే హిట్ లిస్ట్ లో తమ పేర్లు బయటకు రావడంతో జనంలో తమ ఇమేజ్ దెబ్బతింటుందని అంటున్నారు ఆ 27 మంది. జగన్ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి జనంలోకి వస్తున్నారనే ఇమేజ్ తమకు వద్దని కోరుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అయితే ఏపీలో ప్రతిపక్షం మరీ బలహీనంగా ఉండటంతో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలకు ఆల్టర్నేట్ లేదు. తెలంగాణలో మాత్రం అటు సీఎం నుంచి కానీ, ఇటు ఎమ్మెల్యేల వైపు నుంచి కానీ ఎలాంటి కంప్లయింట్ లు లేవు. సిట్టింగ్‌లందరికీ మరోసారి టికెట్ ఖాయమనే భరోసా వచ్చింది. మిగతా చోట్ల మాత్రం టీఆర్ఎస్ టికెట్ల కోసం కాంపిటీషన్ పెరుగుతోంది.