మార్గదర్శిలో ‘నల్లడొంక’ కదులుతోందా?
మార్గదర్శిలో కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు చేసిన వాళ్ళందరికీ సీఐడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రావాలని సమయం, తేదీ, ప్లేస్‌తో సహా నోటీసుల్లో స్పష్టంగా చెప్పింది. అయితే తమ ఖాతాదారులకు సీఐడీ నోటీసులు ఇవ్వటాన్ని ఛైర్మన్ రామోజీరావు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మార్గదర్శిలో నల్లధనం డిపాజిట్ల డొంకంతా కదులుతోందా? జగన్మోహన్ రెడ్డి మీడియా కథనం ప్రకారం అవుననే అనుకోవాలి. మార్గదర్శిలో కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు చేసిన వాళ్ళందరికీ సీఐడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రావాలని సమయం, తేదీ, ప్లేస్‌తో సహా నోటీసుల్లో స్పష్టంగా చెప్పింది. అయితే తమ ఖాతాదారులకు సీఐడీ నోటీసులు ఇవ్వటాన్ని ఛైర్మన్ రామోజీరావు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. మార్గదర్శిని అప్రతిష్టపాలు చేయటమే లక్ష్యంగా సీఐడీ వ్యవహరిస్తున్నట్లు గోల చేస్తున్నారు.
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ కేవలం చిట్టీలు మాత్రమే వేయాలి కానీ ఎవరి నుండి డిపాజిట్లు సేకరించకూడదు. చిట్టీల ద్వారా సేకరిస్తున్న డబ్బును కూడా జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలి. అలాటే చిట్టీల వ్యాపారంలో వచ్చిన డబ్బును చిట్టేతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. కానీ రామోజీ అన్నీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లఘిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. అసలు రామోజీరావు మార్గదర్శి వ్యాపారం చేయటమే అక్రమమన్నది ఉండవల్లి వాదన.
ప్రస్తుత విషయానికొస్తే సీఐడీ నోటీసులు ఇవ్వటంపై రామోజీ ఎందుకింత గోల చేస్తున్నట్లు? ఎందుకంటే కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు చేసినవాళ్ళు 800 మందిని గుర్తించారట. వీళ్ళందరికీ సీఐడీ నోటీసులిచ్చింది. వీళ్ళంతా కోటి రూపాయలను అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో కాకుండా కేవలం మార్గదర్శిలో మాత్రమే ఎందుకు డిపాజిట్లు చేశారనేది తెలుసుకునేందుకే విచారణకు రమ్మని పిలిచింది.
ఈ 800 మంది డిపాజిట్ల రూపంలో మార్గదర్శిలో భారీ ఎత్తున బ్లాక్ మనీ వ్యవహారం నడుస్తోందని సీఐడీ అనుమానిస్తోందట. బ్యాంకుల్లో అయితే తమ డిపాజిట్లకు ఆధార్ కార్డు, పాన్ కార్డుల్లాంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. కానీ మార్గదర్శిలో అలాంటి వివరాలేవీ తీసుకోకుండానే డిపాజిట్లు సేకరించినట్లు సీఐడీ గుర్తించిందట. అందుకనే మార్గదర్శిలో బ్లాక్ మనీ పోగుపడిందని అనుమానిస్తోంది. విచారణకు హాజరైతే ఈ 800 మంది వ్యవహారాలన్నీ బయటపడతాయనే రామోజీ గోల చేస్తున్నట్లు ఈ మీడియా అభిప్రాయపడింది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.