Telugu Global
NEWS

15న తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ఈ నెల 15న ఒకే సారి 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇది మరో రికార్డు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

15న తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
X

తెలంగాణలోని ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తూ.. అనేక జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. నిరుడు ఓకే సారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఈ నెల 15న ఒకే సారి 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇది మరో రికార్డు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ రోజు సీఎం కేసీఆర్ వర్చువల్ పద్దతిలో అన్ని కాలేజీలను ఒకే సారి ప్రారంభిస్తారు.

కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయ్యింది. త్వరలోనే ఇక్కడ తరగతులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని కాలేజీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. కొత్త కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేయనున్నారు.

మెడికల్ కాలేజీల ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే కాకుండా, విద్యార్థులకు వైద్య విద్య చేరువ కానున్నది. కొత్తగా ఏర్పాటు కానున్న కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియను ఆయా ప్రిన్సిపల్స్ అందుబాటులో ఉండి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ సమావేశం ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు.

కొత్తగా ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీల వల్ల 900 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా.. తాజాగా ప్రారంభించనున్న కాలేజీలతో కలిపి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 26కు చేరుకోనున్నది. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 850 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,915 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

First Published:  7 Sept 2023 8:35 PM IST
Next Story