Telugu Global
NEWS

క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలకు చెక్.. అక్టోబర్-1 నుంచి కొత్తరూల్స్..

ఇప్పటి వరకు కార్డ్ వివరాలన్నీ వెబ్ సైట్స్ లో ఆటోమేటిక్ గా సేవ్ అయ్యేవి. ఇకపై అలా జరగదు. అక్టోబర్-1నుంచి ఆర్బీఐ రూపొందించిన కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.

క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలకు చెక్.. అక్టోబర్-1 నుంచి కొత్తరూల్స్..
X

ఆన్ లైన్ లావాదేవీల కోసం క్రెడిట్, డెబిట్ కార్డ్ లు వాడే అలవాటు ఉందా..? అయితే ఇది మీకోసమే.. చదవండి.. ఆన్ లైన్ లో క్రెడిట్, డెబిట్ కార్డ్ లతో కొనుగోళ్లు, బిల్ పేమెంట్స్ చేసేవారు అక్టోబర్-1 నుంచి కొన్ని మార్పులు గమనించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఏదైనా ఈకామర్స్ వెబ్ సైట్ లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు ఎంట్రీ చేసి మనం ఏదైనా వస్తువుని కొంటే.. ఆ వివరాలు ఆ సైట్ లో నిక్షిప్తం అయిపోతాయి. రెండోసారి మనం ఏదైనా వస్తువు కొనాలంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు నమోదు చేయాల్సిన పని ఉండదు. కేవలం సీవీవీ నెంబర్, ఓటీపీ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. అంటే కార్డ్ వివరాలన్నీ ఆయా వెబ్ సైట్స్ లో ఆటోమేటిక్ గా సేవ్ అయ్యేవి అనమాట. ఇకపై అలా జరగదు. అక్టోబర్-1నుంచి ఆర్బీఐ రూపొందించిన కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.

మోసాలకు చెక్..

ఈకామర్స్ వెబ్ సైట్స్ లో మన క్రెడిట్, డెబిట్ కార్డ్ ల వివరాలు ఆటో సేవ్ అవుతుండటంతో కొంతమంది వీటిని దుర్వినియోగం చేసే అవకాశముంది. ఇప్పటికే ఇలాంటి మోసాలు అక్కడక్కడా వెలుగులోకి వచ్చాయి. వీటిని నివారించేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. అక్టోబర్-1 నుంచి ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో మన క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ల వివరాలు సేవ్ కావు. అంటే ప్రతి లావాదేవీకి కార్డ్ నెంబర్, పేరు, ఎక్స్ పయిరీ డేట్.. ఇలా అన్ని వివరాలు నమోదు చేయాల్సిందే.

ప్రత్యామ్నాయం ఉంది కూడా..

ఆటో సేవ్ ఆప్షన్ తీసేయడం మంచిదే, అయితే ప్రతి సారీ కార్డ్ వివరాలు పూర్తిగా నమోదు చేయాలంటే కస్టమర్లకు కష్టంగానే ఉంటుంది. దీనికోసం మధ్యే మార్గంగా టోకెన్ సిస్టమ్ ని అమలులోకి తెస్తున్నారు. ఈ టోకెన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు కార్డ్ వివరాలు ఆటోమేటిక్ గా నింపేసినట్టే. ఆ తర్వాత సీవీవీ, ఓటీపీ అనేవి తప్పనిసరి. ఒకవేళ టోకెన్ నెంబర్ ఎవరికైనా తెలిసినా దాని ద్వారా కార్డ్ వివరాలు తెలుసుకోవడం మాత్రం కష్టం.

టోకెన్ ఎలా తీసుకోవాలి..?

టోకెన్ నెంబర్ పొందాలంటే, ఈ కామర్స్ వెబ్ సైట్ లో 'టోకెన్ రిక్వెస్టర్' అనే అభ్యర్థన పెట్టుకోవాలి. ఈ అభ్యర్థన కార్డు నెట్‌ వర్క్ సంస్థకు వెళ్తుంది. వినియోగదారుడి రిక్వెస్ట్ మేరకు నెట్‌ వర్క్ సంస్థ కార్డు వివరాలకు బదులు.. టోకెన్ నెంబర్‌ను ఇస్తుంది. ఆన్ లైన్ లో షాపింగ్ పూర్తైన తర్వాత బిల్లింగ్ సందర్భంలో 'ఆర్బీఐ గైడ్‌ లైన్స్ ఆన్ టోకనైజ్ యువర్ కార్డ్ ఎడ్జ్' అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని ఎంపిక చేసుకుంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌ కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే టోకెన్ జనరేట్ అవుతుంది. కార్డుకు బదులుగా ఈ టోకెన్ నెంబర్ ఆన్‌ లైన్ షాపింగ్ ప్లాట్‌ ఫాంలో సేవ్ అవుతుంది. అంటే ఈ కామర్స్ వెబ్ సైట్ లో మన పూర్తి వివరాలు ఉండవు, కేవలం టోకెన్ నెంబర్ ఉంటుంది. దీని వల్ల మన కార్డు వివరాలు బయటకు వెళ్లే అవకాశం ఉండదు. ఒక వేళ వినియోగదారుడు టోకనైజేషన్ చేసుకోకపోతే.. ఆన్‌లైన్ చెల్లింపులు జరిపిన ప్రతిసారి కార్డు వివరాలు నమోదు చేయాల్సిందే.

First Published:  30 Sept 2022 7:10 AM IST
Next Story