Telugu Global
NEWS

కేఏ పాల్ పార్టీ 'ఇనాక్టీవ్' జాబితాలోకి.. షాకిచ్చిన ఎన్నికల కమిషన్

కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది చేపట్టిన ఫిజికల్ వెరిఫికేషన్‌లో 86 ఆర్‌యూపీపీలు అసలు లేవని తేలింది. దీంతో వాటిని జాబితా నుంచి తొలగించారు.

కేఏ పాల్ పార్టీ ఇనాక్టీవ్ జాబితాలోకి.. షాకిచ్చిన ఎన్నికల కమిషన్
X

దేశంలో రిజిస్టర్ అయిన అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల (ఆర్‌యూపీపీ)కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. 86 ఆర్‌యూపీపీలను జాబితా నుంచి తొలగించినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషన‌ర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే ఓ ప్రకటన విడుదల చేశారు. 253 ఆర్‌యూపీపీలను ఇనాక్టీవ్ జాబితాలో చేర్చినట్లు వారు తెలిపారు. ఈ ఇనాక్టీవ్ జాబితాలో కేఏ పాల్‌కు చెందిన ప్రజా శాంతి పార్టీ కూడా ఉంది. సెక్షన్ 29 ప్రకారం ప్రతీ రాజకీయ పార్టీ తమ పేరు, హెడ్ ఆఫీస్, అడ్రస్, ఆఫీస్ బేరర్లు, పాన్ సంబంధిత వివరాలు ఎలక్షన్ కమిషన్‌కు అందించాలి. ప్రతీ ఏడాది ఈ వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.

కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది చేపట్టిన ఫిజికల్ వెరిఫికేషన్‌లో 86 ఆర్‌యూపీపీలు అసలు లేవని తేలింది. దీంతో వాటిని జాబితా నుంచి తొలగించారు. ఇక బీహార్, ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన 253 రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలను ఇనాక్టీవ్ (అచేతనం) జాబితాలో ఉంచినట్లు తెలిపింది. ఈ పార్టీలు ఎలక్షన్ కమిషన్ పంపించిన నోటీసులు, లేఖలకు స్పందించడం లేదని, అలాగే 2014 నుంచి ఎలాంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ, రాజ్యసభ ఎన్నికల్లో ఈ పార్టీల అభ్యర్థులు బరిలో లేరని స్పష్టం చేసింది. ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధం కాబట్టి వాటిని అచేతన పార్టీల జాబితాలో చేర్చినట్లు పేర్కొంది.

తెలంగాణలో రిజిస్టర్ అయిన ప్రజాశాంతి పార్టీ, సురాజ్ పార్టీ, ప్రజా భారత్ పార్టీ, ప్రజా పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆలిండియా ముక్తి దళ్ పార్టీ, ఆలిండియా ముత్తహిదా ఖ్వామీ మహాజ్, ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజా పార్టీ, మన పార్టీ, భారత్ అభ్యుదయ పార్టీలను ఇనాక్టీవ్ జాబితాలో చేర్చారు. ఎన్నికల కమిషన్ ఇనాక్టీవ్ జాబితాలో పెట్టిన 253 పార్టీల్లో 66 పార్టీలు కామన్ సింబల్ కోసం కూడా దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కనీసం 5 శాతం మంది అభ్యర్థులను నిలపక పోతే కామన్ సింబల్ ఇవ్వడం కుదరదని ఎన్నికల కమిషన్ చెప్పింది.

ప్రతీ పొలిటికల్ పార్టీ ఎన్నికల్లో తప్పని సరిగా పోటీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఏ పార్టీ అయినా వరుసగా 6 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉంటే ఆ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగిస్తామని కూడా చెప్పింది. ఇనాక్టీవ్ జాబితాలో పెట్టిన పొలిటికల్ పార్టీలు 30 రోజుల్లోగా ఎలక్షన్‌ కమిషన్‌ను సంప్రదించి తమ పార్టీ యాక్టీవ్‌గానే ఉన్నట్లు రుజువులు చూపెట్టాలని తెలిపింది. అలాగే ఆడిటెడ్ అకౌంట్లు, చందాల వివరాలు, ఖర్చులు, ఆఫీస్ బేరర్ల జాబితాను తమకు ఇస్తే అప్పుడు ఇనాక్టీవ్ జాబితా నుంచి తొలగిస్తామని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.

First Published:  14 Sept 2022 7:30 AM IST
Next Story