Telugu Global
NEWS

బీటెక్ చాలు, ఎంటెక్ వద్దు.. ఉద్యోగాలవైపే యువత చూపు..

ఎంటెక్ లో 100కి కనీసం 40సీట్లు కూడా భర్తీ కావడంలేదు. దీంతో యాజమాన్యాలు కూడా తమ కాలేజీల్లో ఎంటెక్ సీట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం 6700 ఎంటెక్ సీట్లు తగ్గాయి. అందులో ఏపీ నుంచి 915 సీట్లు ఉన్నాయి.

బీటెక్ చాలు, ఎంటెక్ వద్దు.. ఉద్యోగాలవైపే యువత చూపు..
X

డిగ్రీ చదువుల తర్వాత దాదాపు నూటికి 80శాతం మంది పీజీ పరీక్షలు రాస్తారు. సీటు రాకపోతే మరోసారి ప్రయత్నిస్తారు, పీజీ అర్హతతో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని, ఈలోగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వొచ్చనే ఆలోచన విద్యార్థులకు ఉంటుంది. కానీ బీటెక్ తర్వాత ఇప్పుడు ఎంటెక్ చదివేవారి సంఖ్య మాత్రం బాగా తగ్గిపోయింది. బీటెక్ తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు కావడమే దీనికి కారణం. ఏపీలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంటెక్ లో 100కి కనీసం 40సీట్లు కూడా భర్తీ కావడంలేదు. దీంతో యాజమాన్యాలు కూడా తమ కాలేజీల్లో ఎంటెక్ సీట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం 6700 ఎంటెక్ సీట్లు తగ్గాయి. అందులో ఏపీ నుంచి 915 సీట్లు ఉన్నాయి.

ఉద్యోగ అవకాశాలు..

కరోనా కాలం తర్వాత ఫ్రెషర్స్ కి ఉద్యోగ అవకాశాలు భారీగా పెరిగాయి. కంపెనీల విస్తృతి పెరగడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కూడా పెరగడంతో ఉద్యోగ అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటున్నాయి. ఓ మోస్తరు టాలెంట్ ఉన్నవారు కూడా ఈజీగా ఇంటర్వ్యూలలో పాసైపోతున్నారు. వీరంతా పై చదువులకంటే కొలువులే మేలనుకుంటున్నారు. వెంటనే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ల్యాప్ టాప్ తో కుస్తీ పడుతున్నారు.

బీటెక్ ఇక్కడ.. ఎంఎస్ అక్కడ..

ఇక్కడ బీటెక్ చేసి, విదేశాల్లో ఎంఎస్ చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపించడం దీనికి మరో ప్రధాన కారణం అంటున్నారు విద్యారంగ నిపుణులు. మన దేశంలో ఎంటెక్ చేయడం కంటే, కాస్త స్థోమత ఉంటే విదేశాల్లో ఎంఎస్ చేయడం మేలని భావిస్తున్నారు విద్యార్థులు. తెలంగాణ నుంచి ఏటా 25 వేల మంది విదేశాల్లో ఎంఎస్‌ చేయడానికి వెళ్తున్నారు.

ఐఐటీల్లోనూ ఖాళీలు..

ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్, ఎంటెక్ ఛాన్స్ వస్తే ఎవరూ కాదనరు. కానీ ఇప్పుడు ఐఐటీలు, ఎన్ఐటీల్లోనే పీజీ సీట్లు మిగిలిపోతున్నాయి. 20 శాతం ఖాళీలు ఉంటున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఐఐటీలో పీజీ చేరినా, ఆ తర్వాత గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలు వస్తే వెళ్లిపోతున్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో వరుసగా రెండు విద్యా సంవత్సరాల్లో.. 6వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. కేవలం టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్లాలనుకుంటున్నవారు, పి.హెచ్.డి. చేయాలనుకునేవారే ఎంటెక్‌, ఎంఫార్మసీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

First Published:  7 Sept 2022 7:37 AM IST
Next Story