Telugu Global
NEWS

థైరాయిడ్‌తో జాగ్రత్త..!

థైరాయిడ్ అనేది మెడ దగ్గర ఉండే ఒక గ్రంధి. ఇది ‘థైరాక్సిన్’ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. శరీరంలో మెటబాలిజం సరిగ్గా పనిచేయాలంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ లెవల్స్ సరిగ్గా ఉండాలి.

థైరాయిడ్‌తో జాగ్రత్త..!
X

శరీరంలో మెటబాలిజంను కంట్రోల్ చేసే ముఖ్యమైన గ్రంధి థైరాయిడ్. ఇది సరిగా పనిచేయకపోతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మానసికంగా, శారీరకంగా కుంగదీసే ఈ జబ్బును ముందే పసిగడితే ప్రమాదాన్ని అడ్డుకోవచ్చంటున్నారు డాక్టర్లు.

థైరాయిడ్ అనేది మెడ దగ్గర ఉండే ఒక గ్రంధి. ఇది ‘థైరాక్సిన్’ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. శరీరంలో మెటబాలిజం సరిగ్గా పనిచేయాలంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ లెవల్స్ సరిగ్గా ఉండాలి. థైరాక్సిన్ లెవల్స్ తగ్గితే ‘హైపో థైరాయిడిజం’ అంటారు. పెరిగితే ‘హైపర్ థైరాయిడిజం’ అంటారు. హైపో థైరాయిడిజంలో మెటబాలిజం తక్కువగా, హైపర్ థైరాయిడిజంలో మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వయసునుబట్టి రకరకాల సమస్యలు వస్తుంటాయి.

హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం.. ఈ రెండింటి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. హైపో థైరాయిడిజంలో అవసరానికి సరిపడా థైరాక్సిన్ లేకపోవడం వల్ల చిన్న పిల్లల్లో మానసిక ఎదుగుదల లేకపోవడం, వయసుకు తగినట్టు పెరగకపోవడం, రజస్వల లేట్ అవడం, నెలసరి సరిగా రాకపోవడం, పెళ్లైన ఆడవాళ్లకు తరచూ మిస్‌క్యారేజ్ అవ్వడం లాంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటు బరువు పెరగడం, నీరసం, బద్ధకం, వేడి ఉష్ణోగ్రతలో కూడా చలిగా ఉండడం, డిప్రెషన్, జుట్టు రాలటం, చర్మం పొడిబారడం, మలబద్దకం, మగత, చలికి తట్టుకోలేకపోవడం, కీళ్లనొప్పులు వంటి లక్షణాలు కూడా హైపో థైరాయిడిజం కిందకే వస్తాయి.

హైపర్ థైరాయిడిజంలో అవసరాన్ని మించి థైరాక్సిన్ రిలీజ్ కావడం వల్ల గుండె దడ, చేతులు-కాళ్లు వణకడం, నిద్రలేమి, ఆకలి పెరగడం, బరువు తగ్గడం, కోపం, చిరాకు నీరసం, అలసట, నాడివేగం పెరగడం, చెమట పట్టడం, యాంగ్జైటీ, వేడిని తట్టుకోలేకపోవడం, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ అవ్వడం వల్ల ‘థైరోటాక్సికోసిస్’ అనే వ్యాధి కూడా రావొచ్చు. అలాగే కంటి దగ్గర కండరాలు వాచి, కనుగుడ్లు ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తే దాన్ని ‘గ్రేవ్స్ డిసీజ్’ అంటారు. కొంతమందికి థైరాయిడ్ గ్రంథి పెరిగి మెడ భాగంలో వాపు వస్తుంది. దీన్ని ‘గాయిటర్’ అంటారు.

జాగ్రత్తలు ఇలా..

థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా విడుదలైనప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి, జీవక్రియ పనితీరు బాగుంటుంది. ఆ హార్మోన్ విడుదలలో మార్పులొస్తే రకరకాల సమస్యలు తప్పవు. కాబట్టి థైరాయిడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

థైరాయిడ్ సమస్య ఏ వయసు వారిలోనైనా రావొచ్చు. ముఖ్యంగా హైపో థైరాయిడిజం జీవితాంతం ఉంటుంది. కాబట్టి డాక్టర్ల సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తుండాలి. మందులు వాడుతుండాలి. ఆరు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథి వాస్తుంది. అది క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. అలాంటి తేడా కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌‌ను కలవాలి.

గర్భిణులు తప్పనిసరిగా థైరాయిడ్‌ టెస్ట్ చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మిస్‌క్యారేజ్ అవ్వొచ్చు. లేదా పుట్టే బిడ్డకు మానసిక సమస్యలు రావొచ్చు.

థైరాయిడ్ లక్షణాల్లో ఎలాంటి చిన్న లక్షణం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా టెస్ట్ చేయించుకుని ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. లేట్ చేసే కొద్దీ రిస్క్ పెరుగుతుంది.

అయోడిన్ తీసుకోవడం వల్ల హైపో థైరాయిడిజం సమస్య రాకుండా చూసుకోవచ్చు. అరటిపండ్లు, క్యారెట్లు, అయోడైజ్డ్ ఉప్పు, వెల్లుల్లి, పాలకూర, ఉల్లిపాయల్లో అయోడిన్ ఉంటుంది. అలాగే హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్లు ఉప్పు తగ్గించాల్సి ఉంటుంది.

జింక్, కాపర్ లాంటి మినరల్స్ హార్మోన్ల పనితీరు సరిగ్గాఉండేలా చూస్తాయి. కాబట్టి ఓట్స్, చేపలు, నట్స్ లాంటివి తింటుండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్‌, జంక్ ఫుడ్ తగ్గించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

First Published:  25 Jan 2024 2:21 PM IST
Next Story