Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    Ayothi Movie Review: అయోతి – (తమిళం) రివ్యూ!

    By Telugu GlobalMay 15, 20238 Mins Read
    Ayothi Movie Review: అయోతి - (తమిళం) రివ్యూ!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    చిత్రం: అయోతి 

    రచన- దర్శకత్వం : ఆర్. మంధిర మూర్తి

    తారాగణం : శశి కుమార్, ప్రీతీ అస్రానీ, మాస్టర్ అద్వైత్, యశ్పాల్ శర్మ, అంజూ అస్రానీ, పాండీ తదితరులు

    సంగీతం : ఎన్ ఆర్ రఘునందన్, ఛాయాగ్రహణం : మాధేష్ మాణిక్కం

    బ్యానర్ : ట్రైడెంట్ ఆర్ట్స్

    నిర్మాత : ఆర్ రవీంద్రన్

    విడుదల : జీ 5

    తమిళ సినిమా ఒక్కోసారి దాని సహజ రంగు దాచి పెట్టుకుని దర్శనమిస్తూంటుంది. రంగు చూస్తే రంగేళీ, హంగు చూస్తే కంగాళీ అన్నట్టు అరవ సినిమా లొస్తూంటాయి. అరవ సినిమాలకి కాస్త భిన్నంగా యూనివర్సల్ సినిమా అన్నట్టుగా తమిళ సినిమాలొస్తూంటాయి. వీటి కంటెంట్ గానీ, మేకింగ్ గానీ ప్రాంతీయ సరిహద్దుల్ని చెరిపేసే ప్రమాణాలతో వుంటాయి. అరవ సినిమాలు మూసలో పడి అక్కడే వుంటాయి. తమిళ సినిమాని నిలబెట్టుకునే కొత్త మేకర్లు కూడా అరుదుగా వుంటారు. ఆ అరుదైన కొత్త మేకర్లలో ఇవాళ ప్రశంసలు పొందుతున్న వాడు ఆర్ మంధిర మూర్తి.

    ప్రశంసలు దేనికంటే, ‘అయోతి’ అనే మళ్ళీ తనే తీయలేడేమో అనేంత ఆశ్చర్య జనకంగా సినిమా తీసినందుకు. హీరో శశి కుమార్ తో హీరోయిజానికే హీరోయిజాన్ని నేర్పే నేర్పుతో ఆలోచనాత్మకంగా తీశాడు. ఆలోచనాత్మక విషయంతో సినిమాలు రావడం వేరు. ఆ విషయాన్ని చెప్పే విధం కూడా ఆలోచనలో పడేసే ‘అయోతి’ లాంటి సినిమా వేరు. విషయాన్ని చెప్పడంలో అమల్లో వున్న అన్ని పద్ధతుల్నీ తీసి పక్కనబెట్టి, తన పద్ధతిని విప్లవాత్మకంగా ముందుంచుతున్న కొత్త దర్శకుడి క్రియేటివ్ వైకల్పమేమిటో ఇక చూద్దాం…

    కథ

    అయోధ్య కి చెందిన బలరాం (యశ్పాల్ శర్మ) రామభక్తుడు. మతవాది. మహా కోపిష్టి. ఎవరి మాటా వినడు. మగ దురహంకారంతో భార్య జానకి (అంజూ అస్రానీ) తో క్రూరంగా ప్రవర్తిస్తాడు. పిల్లలు అతడ్ని చూసి వణికి పోతారు. కాలేజీకి వెళ్ళే టీనేజీ కూతురు శివానీ (ప్రీతీ అస్రానీ), స్కూలు కెళ్ళే కొడుకు సోనూ (మాస్టర్ అద్వైత్ ) ఇంట్లో తండ్రి లేనప్పుడు స్వేచ్ఛని అనుభవిస్తారు. తండ్రి కనపడగానే బిక్కచచ్చిపోతారు. ఇలాటి బలరాం కుటుంబంతో రామేశ్వరం తీర్థయాత్ర పెట్టుకుంటాడు. మదురై చేరుకుని, అక్కడ్నించి టాక్సీలో వెళ్తారు. అసలే కోపిష్టి, పైగా గుట్కా తినే అలవాటు. గుట్కాతో టాక్సీని పాడు చేస్తూంటే డ్రైవర్ అభ్యంతరం చెప్తాడు. దీంతో పిచ్చి రేగిపోయిన బలరాం టాక్సీని స్పీడుగా తోలమని వేధిస్తాడు. తెల్లారేలోగా రామేశ్వరం చేరుకోవాలంటాడు. స్పీడు పెంచడానికి డ్రైవర్ ఒప్పుకోకపోవడంతో కొడతాడు. ఇద్దరూ మీద పడి కొట్టుకోవడంతో టాక్సీ అదుపు తప్పి యాక్సిడెంట్ పాలవుతుంది.

    యాక్సిడెంట్లో తలకి తీవ్రగాయమైన జానకిని హాస్పిటల్ కి చేరుస్తారు. గాయపడ్డ డ్రైవర్, స్నేహితుడైన శశికుమార్ కి చెప్పడంతో, శశి కుమార్ అత్యవసరంగా వేరే హాస్పిటల్ కి తీసికెళ్ళాల్సిన జానకిని అంబులెన్స్ లో తీసుకుని బయల్దేరతాడు. మార్గ మధ్యంలో ఆమె చనిపోతుంది.

    ఇప్పుడేం చేయాలి? భాష తెలియని ప్రాంతంలో మృత దేహంతో ఏకాకిగా మిగిలిన కుటుంబాన్నేం చేయాలి? ఎట్టి పరిస్థితిలో ఈ హిందీ కుటుంబానికి సాయపడాలని నిర్ణయించుకున్న తమిళ శశికుమార్, అయోధ్యకి మృత దేహం తరలింపుకి సంబంధించి ఎలాటి చట్టపరమైన అవాంతరాల్ని ఎదుర్కొన్నాడు? సాంప్రదాయం పేరుతో అడుగడుగునా అడ్డు తగులుతున్న బలరాంతో ఏ ఇబ్బందులు పడ్డాడు? దీనంగా మిగిలిన పిల్లల మొహాలు చూసి పట్టు వదలకుండా ఆ కుటుంబాన్ని ఎలా కష్టంలోంచి బైట పడేశాడు? ఇదీ మిగతా కదిలించే కథ.

    ఎలావుంది కథ

    ఇది తమిళనాడులో నిజంగా జరిగిన కథ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తరాది వలస కూలీల మీద తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని అబద్ధపు ప్రచారం సాగించిన శక్తులకి చెంప పెట్టు లాంటి కథ. అయోధ్యలో నివసిస్తున్న ఉత్తరాది బ్రాహ్మణ కుటుంబాన్ని, తమిళనాడులోని రామేశ్వరం, మదురైలలో నివసిస్తున్న తమిళుల్ని ఒకచోట చేర్చి, మానవత్వం మీద బలమైన విశ్వాసాన్ని కలిగించే – రచయిత ఎస్. రామకృష్ణన్ రాసిన కథ ఆధారంగా – తన తొలి సినిమా ప్రయత్నంగా దీన్ని అందించాడు కొత్త దర్శకుడు మంధిర మూర్తి.

    ఒక మరణం ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తుంది. మనుషుల్లో, మానవ సంబంధాల్లో మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. అయితే మరణంతోనే ఈ మార్పులు జరగాలని కాకుండా ముందే మేల్కొంటే మరణమనే నష్టమే జరగదు. ఇది ఈ కథ చెప్పే ఒక వాస్తవమైతే, రెండో వాస్తవం- మతం కేవలం ఒక ఆచారం. ఇంకే అర్ధాలు కల్పించినా అది రాజకీయం. రేపటి భవిష్యత్తుకి ఆశాకిరణం (అయోతి) గా మతాన్ని చూడకపోయినా రాజకీయమే. రాజకీయంతో అవసరాలు తీరతాయా?

    పై రెండు అంశాల్ని కలగలిపిన ఒక బలమైన భావోద్వేగభరిత కథగా ఇది తెరకెక్కింది. ఇందులో ముగింపులో తెలిసే అసలు విషయం కొసమెరుపుగా కథని ఆకాశానికెత్తేస్తుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే ఈ ముగింపులో చిన్న డైలాగు ఇంకో ఎత్తు. క్లుప్తంగా, మృదువుగా పలికే ఈ రెండు పదాల డైలాగు సినిమాని ఎక్కడికో తీసికెళ్ళిపోతుంది ఎమోషనల్ హై తో. ఇంతవరకూ కథలో తెలియని కోణం అమాంతం బయటపడి నిశ్చేష్టుల్ని చేస్తుంది. ఇందుకే ఇది రెగ్యులర్ అరవ సినిమా కాలేదు, అరుదైన తమిళ సినిమా అయింది.

    నటనలు – సాంకేతికాలు

    శశికుమార్ ది రెగ్యులర్ కమర్షియల్ హీరో పాత్ర కాదు. వూర మాస్ అరవ హీరోయిజాల తమిళ ప్రేక్షకులకి ఇదొక షాక్. అయితే ప్రారంభంలో సముద్ర తీరంలో సన్నాసుల్ని ఉతికే మాస్ ఎంట్రీ సీను పాత్రకి అవసరం లేకపోయినా దర్శకుడికి ఎత్తుగడగా తప్పనట్టుంది. ఇది తప్పితే శశికుమార్ సగటు మనిషి పాత్ర సహజత్వంతో ఎక్కడా రాజీపడదు. అతనెక్కడా నవ్వడు, పైగా ఒకే ఎక్స్ ప్రెషన్ తో వుంటాడు. మౌనంగా వుంటాడు. సన్నివేశం సహజ బలాన్ని ఉత్పత్తి చేస్తే నటుడికి భావ ప్రకటనతో పనుండదు. సన్నివేశాల్లో శశికుమార్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకపోయినా, అతడి మౌనంతో మైండ్ ని చదవగలం. ఈ సబ్ టెక్స్ట్ (ఉపవచనం) గురుదత్ ‘ప్యాసా’ లోని మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ టైపు కథనం వల్ల వస్తుంది.

    ఎదుటి పాత్రలు వాటి ఆక్రోశాలతో ఎంత ప్రకోపితులైనా సరే, శశి కుమార్ సాక్షిలా వుంటాడు తప్పితే ఆ ఎమోషనల్ తూఫానులో తానూ సుడిగుండమై పోడు. సాక్షిలా గమనిస్తూ తగిన నిర్ణయం తీసుకుంటాడు. ఈ ప్రత్యేకతే ఇతర పాత్రల్నుంచి అతడ్ని వేరు చేసి, దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది. ఈ యాక్టివ్ పాత్ర హీరోయిజం విజువల్ గా, ఆబ్జెక్టివ్ గా వుండకుండా, కనపడని సబ్జెక్టివ్ గా వుంటుంది.

    కూతురి పాత్రలో ప్రీతీ అస్రానీ నటన బలమైన ముద్ర. యువ నటీమణుల్లో కావాల్సినంత సామర్ధ్యముంది. కమర్షియల్ సినిమాల్లో వాళ్ళని కరివేపాకు పాత్రలకి పరిమితం చేయడంతో టాలెంట్ ని ప్రదర్శించుకోలేని స్థితిలో వుండిపోతున్నారు. తండ్రితో వేధింపులకి గురవుతూ అణిగిమణిగి వున్న కూతురు తను. ఇక మెడికల్ కాలేజీలో తల్లి శవపేటిక ముందు తండ్రి మీద తిరగబడి కళ్ళు తెరిపించే – లావాలా బ్రద్ధలయ్యే సీనుని హేండిల్ చేసిన విధం ఆమెకే సాధ్యమవుతుంది. సినిమా మొత్తంలో సుడిగాలిలా కమ్మేసే సీను ఇదొకటే. తమ్ముడికి తనే దిక్కుగా మిగిలిన పరిస్థితి సహా సానుభూతి పొందే నటనకి గీటు రాయిలా నిల్చింది. శశి కుమార్ తర్వాత ప్రధాన ఆకర్షణ ఈమె నటనే. తమ్ముడుగా మాస్టర్ అద్వైత్ దైన్యంతో కూడిన మొహం ఒక వెంటాడే దృశ్యం.

    తల్లిగా అంజూ అస్రానీ భర్త పెట్టే బాధల్ని దాచుకుని ఓదార్పు చూపే సాత్విక పాత్రలో కన్పిస్తుంది. గుట్కా తినే తండ్రి బలరాం గా బాలీవుడ్ నటుడు యశ్పాల్ శర్మ వొంటి మీద రామభక్తి, ఇంట్లో రావణ కుయుక్తి పాత్రని బలంగా పోషించాడు. అయోధ్యలో అతడి వుండకూడని రావణ కుయుక్తి, రామేశ్వరంలో కూతురి చేతిలో హుళక్కి అయ్యే సన్నివేశంలో పురుగులా మిగిలి తెగ జాలిని పొందుతాడు.

    భార్య మృతదేహంతో ప్రతీచోటా సాంప్రదాయం పేరుతో అడ్డుపడతాడు. పోస్ట్ మార్టం తో, పోలీస్ ప్రొసీజర్ తో, అవయవ దానంతో, ఏర్ పోర్టు రూల్స్ తో ప్రతీచోటా న్యూసెన్స్ చేస్తాడు. అవయవ దానమనేసరికి- ‘ఏంట్రా – గుండె తీసేసి, కళ్ళు తీసేసి, కిడ్నీలు కూడా తీసేసి స్వర్గాని కెలా పంపుతారురా? ఆమె ఆత్మ ఎలా శాంతిస్తుంది రా? – అంటూ కేకలేస్తాడు. శశికుమార్ మౌనం గా వుంటాడు.

    శశి కుమార్ నేస్తంగా పాండీది కూడా కీలకపాత్రే. విమాన టిక్కెట్ల కోసం బైక్ ని అమ్మేసే శశికుమార్ ఇంకో స్నేహితుడు, ఉచితంగా శవపేటికని తయారు చేసిచ్చే ఇంకో పాత్ర, పోస్టుమార్టం విషయంలో పోలీసుల సహాయగుణం, మెడికల్ కాలేజీ సిబ్బంది ఔదార్యం, చివరి నిమిషంలో విమాన టిక్కెట్లు లేకపోతే రూల్స్ లో లూప్ హోల్స్ ఏమున్నాయా అని వెతికే ఏర్ పోర్టు అధికారీ పాత్రలు కూడా ఆకట్టుకునే విధంగా వుంటాయి.

    రెండు పాటలున్నాయి- పోలీస్ స్టేషన్లో దొంగలతో పోలీసులు పాడించే పాట (ఇది కావాలని రిలీఫ్ కోసం పెట్టినట్టుంది). ఈ పాటలో శశికుమార్, పాండీ బయట కూర్చుని వుంటారు. అరవ సినిమా అయితే దొంగలతో ఆడి పాడతారు. రెండో పాట సెకండాఫ్ లో మాంటేజ్ సాంగ్. ఈ సాంగ్ లో యశ్పాల్ శర్మ పాత్ర ఇంటి దగ్గర క్రూరత్వాలు బయట పడతాయి. అతడి పాత్ర నేపథ్యం ఇక్కడ వెల్లడవుతుంది.

    కెమెరా వర్క్, ఎడిటింగ్ నాణ్యంగా వున్నాయి. కెమెరా వర్క్ లో అయోధ్యా, మదురై, రామేశ్వరం దృశ్యాలు, పాత్రల భావోద్వేగాల విజువల్స్ జ్ఞాపకముండి పోతాయి. కేవలం మృతదేహాన్ని అయోధ్యకి చేర్చే – ఒక రోజులో పూర్తయ్యే స్వల్ప కథకి, ఎమోషన్లని తోడే ఎక్కువ సందర్భాలకి తావుండదు. అటువంటప్పుడు డల్ అయిపోతూంటుంది రన్. అందుకని చనిపోయిన తల్లిని చూసి ఏడ్చే పిల్లల విజువల్స్ ని- కథనం డల్ అయ్యే అవకాశమున్న రెండు మూడు చోట్లా రిపీట్ చేస్తూ ఎమోషనల్ హైని, కంటిన్యూటీనీ సాధించినట్టున్నాడు ఎడిటర్. ఇది అరవ సినిమా ఓవర్ మేలో డ్రామా అన్పించ వచ్చుగానీ, రన్ ని కాపాడ్డానికి చేసిన ఎడిటింగ్ కళ కూడా కావొచ్చు.

    చివరికేమిటి

    ఈ మధ్య వస్తున్న సస్పెన్స్ సినిమాల్ని మధ్య మధ్యలో నిద్ర మేల్కొని చూడాల్సి వస్తున్న రోజుల్లో- సోషల్ జానర్ స్వల్ప కథ అయిన ‘అయోతి’ లో, దృష్టి మరల్చలేని రెండు గంటల పకడ్బందీ కథనం చేయడంలో అనుసరించిన విధానం చూస్తే- కృత్రిమ ఫార్ములాలకి భిన్నంగా, ఆర్గానిక్ గా సహజ భావోద్వేగాల సృష్టే స్పష్టమవుతుంది. కదిలించే సన్నివేశాల పరంపరే ఈ స్వల్పకథకి బలం. పూర్తి విషాదంతో కూడిన సినిమా ఈ రోజుల్లో రిస్కే అయినా, ఆ విషాదం కథ లోతుల్లోంచి నిజంగా కదిలించే విషాదమైతే, టీనేజర్ కూడా అతుక్కుపోయి చూస్తాడని ఇందువల్ల తెలుస్తోంది.

    టీనేజర్స్ కి ప్రీతీ అస్రానీ టీనేజి పాత్ర, పిల్లలకి మాస్టర్ అద్వైత్ బాల పాత్ర, జనరల్ యూత్ కి హీరో శశికుమార్ పాత్ర, గృహిణులకి అంజూ అస్రానీ తల్లి పాత్ర, పెద్దలకి యశ్పాల్ శర్మ పాత్రా ముట్టడించి అన్ని ఏజి గ్రూపులకి విజువల్ అప్పీల్ ని ఎడతెరిపి లేకుండా పంచుతోంటే, విషాదంతో నిండిన రెండు గంటల ఈ స్వల్ప కథ తేలిపోయే అవకాశం లేదు.

    ప్రేక్షకుల్ని ప్లీజ్ చేయడానికి రోమాన్స్ లేదు, కామెడీల్లేవు, టైమ్ పాస్ పాటల్లేవు, ఎలాటి కమర్షియల్ హంగులూ లేవు. అసలు సాధారణంగా అనుకునే హీరోయిజమే లేదు. సబ్ ఫ్లాట్స్ లేవు. ఎక్కువ పాత్రల్లేవు. కేవలం మరణమనే విషాదంతో, మృతదేహాన్ని అయోధ్యకి చేర్చే ఒకే లైనుతో, దాని చుట్టూ సంఘర్షణతో మాత్రమే ఈ స్వల్ప కథ వుంది.

    ఈ సంఘర్షణలో సాధారణంగా హీరోకి వుండే ప్రత్యర్ధి లేడు. పరిస్థితులే వివిధ అడ్డంకులుగా వుంటాయి. మృత దేహం తరలింపు కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి చేయాల్సిన పనులకి సంబంధించి. కథ 25 వ నిమిషంలో యశ్పాల్ శర్మ – టాక్సీ డ్రైవర్ కొట్లాడుకుని జరిగే యాక్సిడెంట్ తో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ లో హీరో శశి కుమార్ వుండడు. అమల్లో వున్న నియమాల ప్రకారమైతే టాక్సీ డ్రైవర్ గా శశికుమారే వుంటాడు. కాన్ఫ్లిక్ట్ లో అతనుండాలి కాబట్టి. కానీ ఈ నియమాన్ని పాటించలేదు కొత్త దర్శకుడు. అయినా కథ గానీ, పాత్ర గానీ దెబ్బ తినలేదు.

    ప్రారంభంలో యశ్పాల్ శర్మ రామేశ్వరం ప్రయాణం గురించి కుటుంబానికి చెప్పాక, రామేశ్వరం సముద్ర తీరంలో సన్నాసులతో పైటింగ్ తో ఎంట్రీ సీను వేసుకుని వెళ్ళిపోతాడు హీరో శశికుమార్. మదురై సమీపంలో యాక్సిడెంట్ తర్వాత, టాక్సీ డ్రైవర్ ఫోన్ చేయడంతో, అంబులెన్స్ డ్రైవర్ గా శశికుమార్ కాన్ఫ్లిక్ట్ లోకి – అంటే కథలోకి ఎంటరవుతాడు.

    ఇక్కడ్నుంచి మృతదేహాన్ని అయోధ్యకి తరలించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకదాని తర్వాతొకటి కాన్ఫ్లిక్టుల వరస మొదలవుతుంది. ఆ రోజు దీపావళి పండుగ సెలవు కాబట్టి ఈ పరిస్థితి. కథనంలో ఐరనీ ఏమిటంటే, ఒక వైపు మృతదేహంతో పాట్లు, మరో వైపు తెల్లారినప్పట్నించే వీధుల్లో టపాకాయలతో పండుగ సందడి. అయితే ఎవరైనా శుభమా అని దీపావళి పండుగ రోజు ఇల్లు వదిలి తీర్ధ యాత్ర పెట్టుకుంటారా అన్నది ప్రశ్న. పెట్టుకుంటారేమో అదేమంత పెద్ద విషయం కాదనుకుంటే, అఖండ సాంప్రదాయ వాదియైన బలరాం (యశ్పల్ పాత్ర) లాంటి వాడు ప్రయాణం పెట్టుకుంటాడా, అన్న పాత్ర చిత్రణకి సంబంధించిన ప్రశ్న తలెత్తుతూనే వుంటుంది. పండుగ సెలవుతో అవాంతరాల కోసమే కొత్త దర్శకుడు పాత్రచిత్రణని బలిపెట్టి వుండాలి.

    రెండోది యశ్పాల్ దగ్గర డబ్బుల్లేకపోవడం. పేదవాడైన శశికుమార్ పర్సులో వున్న రెండు మూడొందలు ఖర్చు పెట్టేసి ఇబ్బంది పడడం. ఎక్కడో పర రాష్ట్రానికి ప్రయాణం పెట్టుకున్న యశ్పాల్ దగ్గర టాక్సీ ఫేర్ కి మించి డబ్బులే వుండవా? అయోధ్యలో మిత్రుడికి ఫోన్ చేస్తే, విమాన టికెట్లు నేను చూసుకుంటాను, దిగులు పడొద్దంటాడు మిత్రుడు. ఈ లోపాలు కూడా గమనించాలి.

    ప్రీతీ అస్రానీ తల్లికి రామేశ్వరంలో కట్టుకోవడానికి సెలెక్టు చేసే చీర, తమ్ముడు హుండీలో డబ్బు దాచుకునే చర్యా- ఈ రెండూ తర్వాత ప్లాట్ డివైసుల రూపంలో అవసరంలో అనూహ్యంగా తెరపైకొచ్చి థ్రిల్ చేస్తాయి. స్వల్ప కథ సింగిల్ లైను కుంగ కుండా ఇలాటి క్రియేటివ్ ఎలిమెంట్స్ ప్రయోగం కూడా తోడ్పడింది.

    భాషల విషయంలో రాజీ పడలేదు కొత్త దర్శకుడు. హిందీ మాట్లాడే పాత్రలు హిందీయే మాట్లాడడం, తమిళం మాట్లాడే పాత్రలు తమిళమే మాట్లాడడం చేస్తాయి. ఎవరి మాతృభాషలో ఆ పాత్రలు మాట్లాడ్డం వల్ల సహజత్వమే కాకుండా, ఎదుటి పాత్ర భాష అర్దంకాని టెన్షన్, భావోద్వేగాలు కూడా ఏర్పడుతూ కథనం బలీయమవుతూ పోవడానికి తోడ్పడింది.

    ప్రత్యర్ధి లేని కథనంలో కథనం చప్పబడకుండా వివిధ ప్రభుత్వ లాంచనాల సమస్యలే టెన్షన్ ని పెంచుతూపోయే క్రమం కన్పిస్తుంది. ప్రభుత్వ లాంచనాలకి సంబంధించి కొత్త దర్శకుడు మంచి రీసెర్చి చేసినట్టు కన్పిస్తుంది. సన్నివేశాల్లో బలీయమైన హ్యూమన్ డ్రామా సృష్టి వల్ల డాక్యుమెంటరీ అయ్యే ప్రమాదం కూడా తొలగిపోయింది. పౌరుల జీవితాల భద్రత కోసం రూపొందించిన ప్రభుత్వ నిబంధనల మధ్య చిక్కుకున్న సామాన్య ప్రజల వేదనని, వాటిని పాటించడంలో వున్న ఆచరణాత్మక సమస్యల్ని, ఓ పరాయి పట్టణంలో చిక్కుకుపోయిన దిక్కులేని కుటుంబాన్ని ప్రతీకగా చేసి చూపించాడు కొత్తదర్శకుడు. పోలీసు రిపోర్టులో పేరులో స్పెల్లింగ్ తప్పులు చూసి ఏర్ పోర్టు అధికారి అనుమతి నిరాకరించే లాంటి బ్రిటీష్ కాలం నాటి ఆఫీసర్ల ‘బాబు డమ్’ ఇంకా వేళ్ళూ నుకోవడం ఒక విచారకర స్థితి.

    ‘అయోతీ’ ని వైవిధ్యం కోసం ప్రయత్నించే మేకర్లు రిఫరెన్సుగా వుంచుకోవచ్చు. కథ చెప్పడంలో అమల్లో వున్న సాంప్రదాయాల్ని కాసేపు పక్కన బెట్టి, ఒక క్రియేటివ్ వైకల్పం చూపిస్తున్న కొత్త దర్శకుడు మంధిర మూర్తి మలి ప్రయత్నమెలా వుంటుందో ఇక చూడాలి.

    Ayothi Ayothi Movie Review
    Previous Articleశ్లోకమాధురి : శృంగార హర్షవర్ధనం
    Next Article సాంగత్యం (కథ)
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.