RRR కు ఆస్కార్ వేళ....బూమరాంగ్ అయిన బండి సంజయ్ ట్వీట్, ట్రోల్ చేస్తున్న నెటిజనులు
RRR మూవీ రిలీజ్ కు ముందు రిలీజైన ఓ పోస్టర్ లో... హీరో ఎన్టీఆర్ స్కల్ క్యాప్ ధరించి ఉంటాడు. దానిపై అప్పట్లో బండి సంజయ్ రాజకీయాలు ప్రారంభించాడు.దుబ్బాకలో జరిగిన ఓ బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ, సినిమాలో కుమ్రం భీమ్ స్కల్ క్యాప్ ధరించినట్టు చూపించడాన్ని వ్యతిరేకించారు.
RRR సినిమా లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన అవార్డుతో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా తెలుగు సినిమా ఘనత విశ్వవ్యాప్తమైందని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. అందరితో పాటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా RRR టీంను అభినందిస్తూ ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు, ముఖ్యంగా తెలుగు వారికి ఈ క్షణం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు.అయితే బండి సంజయ్ ఏమి ఆశించి ఈ ట్వీట్ చేశారో అది నెరవేరలేదు. పైగా ఆయన ట్వీట్ బూమరాంగ్ అయ్యింది. నెటిజనులు సోషల్ మీడియాలో సంజయ్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
RRR మూవీ రిలీజ్ కు ముందు రిలీజైన ఓ పోస్టర్ లో... హీరో ఎన్టీఆర్ స్కల్ క్యాప్ ధరించి ఉంటాడు. దానిపై అప్పట్లో బండి సంజయ్ రాజకీయాలు ప్రారంభించాడు.దుబ్బాకలో జరిగిన ఓ బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ, సినిమాలో కుమ్రం భీమ్ స్కల్ క్యాప్ ధరించినట్టు చూపించడాన్ని వ్యతిరేకించారు. దాంట్లో సంజయ్ కి మత కోణం కనపడింది. భీమ్‌ను ముస్లింగా చిత్రీకరించడం ఆదివాసీలను అవమానించడమేనని సంజయ్ మతపరమైన వాదనలు లేవనెత్తాడు. సినిమా రీళ్లను తగులబెడతామని బెదిరించడమే కాకుండా సినిమా ప్రదర్శించే థియేటర్లకు నిప్పు పెడతామని అన్నారు. థియేటర్లు కాల పెడతాం.. తగలబెడతాం.. అని హూంకరించి....దర్శకుడు రాజమౌళి ని ఉద్దేశించి ''బిడ్డా నువ్వు కనుక సినిమా రిలీజ్ చేస్తే ఉరికిచ్చి కొడతాం'' అని మాట్లాడాడు.
సంజయ్ అప్పుడు మాట్లాడిన మాటల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంజయ్ ని నెటిజనులు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోమని సంజయ్ కి నెటిజనులు హితవు పలికారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి బండి సంజయ్ అంటూ విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని దుమ్మెత్తిపోశారు. మొత్తం మీద సినిమాకు అవార్డు రావడం ఎంత ట్రెండింగ్ గా మారిందో బండి సంజయ్ వైఖరిని నిరసిస్తూ నెటిజన్లు స్పందించిన తీరు కూడా అంత ట్రెండింగ్ గా మారింది
ఈ సందర్భంగా , అస్కార్ అవార్డు అందుకుంటున్న , చంద్రబోస్, కీరవాణిల ఫోటోలు, సంజయ్ గతంలో ఈ మూవీకి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్...
''చంద్ర బోస్ రాసిన నాటు నాటు పాట ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు RRR టీమ్‌కి అభినందనలు
బండి సంజయ్ లాంటి మతోన్మాదులు ఈ సినిమాపై ఎలాంటి విషం చిమ్మారో ఈ సమయంలో ఒక సారి మనం గుర్తు చేసుకోవాలి.అలాంటి ద్వేషపూరిత వ్యక్తులను తిరస్కరిద్దాం!'' అని కామెంట్ చేశారు.
దిలీప్ ట్వీట్ ను షేర్ చేసిన మంత్రి కేటీఆర్ ''ఇంకేముంది, మోడీ వల్లనే ఈ అవార్డు వచ్చిందని ఆ మతోన్మాది మీకు చెబుతాడు'' అని కామెంట్ చేశారు.
ఇక సత్యప్రసాద్ పెద్దపల్లి, అశోక్ రెడ్డి నల్గొండ, సామ్రాట్ తదితర వందలాది మంది నెటిజనులు బండి సంజయ్ పై దుమ్మెత్తిపోశారు. ''మోడీ వల్ల ఆస్కార్ రావడమేంటి ఆస్కార్ కనిపెట్టిందే మోడీ'' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అసలు యూ టర్న్ తీసుకునే కళకు గాను బండి సంజయ్ కి అవార్డు ఇవ్వాలి అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
మొత్తానికి ఈ రోజు సోషల్ మీడియాలో రాజమౌళి ఎంత ట్రేండింగ్ లో ఉన్నారో బండి సంజయ్ కూడా అంతే ట్రెండింగ్ లో ఉన్నారు. అయితే ఒకరు పాజిటీవ్ గా, మరొకరు నెగిటివ్ గా.
Not before long, the SAME Bigot will tell you the Award was given only because of Modi https://t.co/8Z0hp6FETl
— KTR (@KTRBRS) March 13, 2023