తిరుపతి చేరిన శ్రావణ భార్గవి గొడవ
శ్రావణ భార్గవి హావభావాలపై అన్నమాచార్య కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి పాడిన ఓ పాట ఇటీవల వివాదమైన విషయం తెలిసిందే. 'ఒకపరి ఒకపరి' అనే ఓ పాటను శ్రావణ భార్గవి ఆలపించి.. ఆ పాట కోసం అభినయించారు కూడా.. అయితే యూట్యూబ్ లో విడుదలైన ఈ పాట ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాటపై అన్నమాచార్య కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అసలు శ్రావణ భార్గవి పాడింది అన్నమాచార్య రాసిన పాట కాదన్నది మరికొందరి వాదన. అన్నమయ్య కుమారుడు తిరుమాలాచార్యులు ఈ పాట రాశారని వారు అంటున్నారు. మొత్తానికి ఈ పాటపై తీవ్ర దుమారం రేగింది. శ్రావణ భార్గవి హావభావాలపై అన్నమాచార్య కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిజానికి ఈ పాటలో పెద్దగా అసభ్యత ఏమీ ఉండదని కొందరు అంటున్నారు. అయినప్పటికీ కొందరు అతివాదులు కావాలనే వివాదం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా అన్నమాచార్య కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పాట విషయంలో జోక్యం చేసుకోగా.. తాజాగా పలువురు సంప్రదాయవాదులు, నిత్యం వివాదాలు సృష్టించే ఓ అతివాద ముఠా ఎంట్రీ ఇచ్చింది. శ్రావణ భార్గవి వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు చేస్తున్నారు.
కాగా.. ఈ వివాదంపై నేరుగా శ్రావణ భార్గవి కూడా క్లారిటీ ఇచ్చారు. సదరు పాటలో ఎక్కడా అసభ్యత లేదని ఆమె తేల్చి చెప్పారు. వీడియో తొలగించే ప్రసక్తే లేదని చెప్పేశారు. దీంతో సంప్రదాయవాదులు మరింత రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తిరుపతిలో శ్రావణ భార్గవికి వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేపట్టారు. ఆమె సంప్రదాయాన్ని మంటగలిపిందని.. వెంటనే ఈ పాటను తొలగించాలని .. అన్నమాచార్య కుటుంబ సభ్యులకు శ్రావణ భార్గవి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శ్రావణ భార్గవిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
గతంలో ప్రముఖ గాయని మంగ్లీ మీద కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చిన విషయం తెలిసిందే. అయితే అన్నమయ్య సినిమాలోనే కొన్ని శృంగార భరిత సన్నివేశాలు చిత్రీకరించారని.. గతంలోనూ పలు అన్నమయ్య పాటలను అసభ్యంగా చిత్రించారని కొందరు చెబుతున్నారు. ఇప్పుడు శ్రావణ భార్గవి పాటలో ఏ అసభ్యత లేకపోయినా ఎందుకు రచ్చ చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాలి.