అల్లు అర్జున్, సుకుమార్ గొడవ.. తప్పు ఎవరిది?
అల్లు అర్జున్, సుకుమార్‌ల మధ్య గొడవ ఎందుకు జరిగింది?. ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందో తెలుసుకోవడానికంటే ముందు అల్లు అర్జున్, సుకుమార్‌ల బాండింగ్ గురించి చెప్పుకోవాలి.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2 గురించి కొద్దిరోజులుగా చాలా ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు వచ్చాయనే వార్త సంచలనంగా మారింది. అందుకే సుకుమార్ చెప్పినా వినకుండా అల్లు అర్జున్ గడ్డం చేయించాడని, దీంతో హర్ట్ అయిన సుకుమార్ అమెరికా వెళ్లిపోయాడని తెలుస్తోంది. సుక్కు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడన్న విషయం తెలిసిన బన్నీ కూడా ఫ్యామిలీతో యూరప్ ట్రిప్‌కి వెళ్ళిపోయాడని ప్రచారం జరుగుతోంది.
ఇద్దరూ సినిమా పిచ్చోళ్లే...
అల్లు అర్జున్, సుకుమార్‌ల మధ్య గొడవ ఎందుకు జరిగింది?. ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందో తెలుసుకోవడానికంటే ముందు అల్లు అర్జున్, సుకుమార్‌ల బాండింగ్ గురించి చెప్పుకోవాలి. బన్నీ, సుక్కూలది 20ఏళ్లకు పైగా ఫ్రెండ్‌షిప్. సుక్కూను అల్లు అర్జున్ డైరెక్టర్‌ని చేస్తే.. అల్లు అర్జున్‌ని సుక్కూ స్టార్‌ని చేశాడు. అందుకే వీళ్లిద్దరు డైరెక్టర్, హీరోలా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటారు. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఎంతమంచి బాండింగ్ ఉన్నా.. ఇద్దరు కూడా పని రాక్షసులే. ఔట్‌పుట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. ఈ విషయంలో అల్లు అర్జున్ కంటే ఒక ఆకు ఎక్కువే చదివాడు సుకుమార్. ఆర్య సినిమాలో హీరోయిన్ ఎంట్రీ గుర్తుంది కదా. ఆ సీన్ నిమిషం కూడా ఉండదు. కానీ దాదాపు రోజంతా ఆ ఒక్క సీనే తీశాడంటే సినిమాపై సుక్కూకు ఎంత పిచ్చుందో అర్థం చేసుకోండి. అల్లు అర్జున్ కూడా సినిమా పిచ్చోడే. ప్రతి సినిమాకు కొత్తగా ఏదో ట్రై చేస్తూనే ఉంటాడు. అందుకే వీడు హీరో ఏంట్రా అనే దగ్గరి నుంచి హీరో అంటే వీడేరా అనేలా ఎదిగాడు. 69ఏళ్ల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొదటిసారి బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు. సో ఇద్దరి డెడికేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
అక్కడే గొడవ..
అల్లు అర్జున్, సుకుమార్ ఎంత మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ.. ఇద్దరూ పని రాక్షసులే కావడంతో అక్కడే చెడింది. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన సినిమా డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ అయింది. దీంతో సినిమా రిలీజ్‌పై అల్లుఅర్జున్‌కు టెన్షన్ పట్టుకుంది. సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వాయిదా పడితే బాగుండదని భావించిన అల్లు అర్జున్.. షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని సుక్కూపై ప్రెజర్ పెట్టాడు. 3 యూనిట్లతో షూటింగ్ చేద్దామని సుకుమార్‌ని కోరాడు. కానీ సుక్కు అందుకు ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య గట్టి బాండింగ్ ఉందంటే కోపాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఇంకేమంది సుక్కూపై బన్నీకి కోపమొచ్చింది. సినిమా లేట్ చేస్తున్నావంటూ ఏళ్లుగా పెంచుతున్న గడ్డాన్ని ట్రిమ్ చేశాడు. బన్నీ గడ్డం గీయడంతో సుక్కూకు చిర్రెత్తుకొచ్చి అమెరికా వెళ్లిపోయాడు. సుక్కూ చెప్పాపెట్టకుండా పోవడంతో బన్నీ కూడా ఫ్యామిలీతో కలిసి యూరప్ వెళ్లిపోయాడు అనే ప్రచారం జరుగుతోంది.
మళ్లీ వాయిదా తప్పదా..!
అల్లు అర్జున్ మళ్లీ పాత గడ్డం లుక్‌లోకి రావాలంటే ఈజీగా ఇంకో నెల పడుతుంది. సినిమా షూటింగ్ మరో నెలన్నర ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకో నెల. ఎంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేసినా ఈజీగా నాలుగు నెలలు పడుతుంది. సినిమా ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది. రెండో రిలీజ్ డేట్‌కు టైం తక్కువే ఉంది. ఇలాంటి టైమ్‌లో హీరో, డైరెక్టర్ ఫారిన్ వెళ్లిపోవడం జరుగుతున్న ప్రచారాలకు బలం చేకూరుస్తోంది. ఇక పుష్ప-2 సినిమా నుంచి నెల గ్యాప్‌లో 2 పాటలు రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ అయ్యాయి. నెలన్నర దాటినా మూడో సాంగ్ రిలీజ్ చేయలేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరికీ సినిమా గురించి ఆందోళ లేదు. కానీ బన్నీ, సుక్కూల మధ్య విభేదాలు అనే వార్తనే అల్లు అర్జున్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.