Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    Adipurush Movie Review: ఆదిపురుష్ – మూవీ రివ్యూ {2.5/5}

    By Telugu GlobalJune 16, 20236 Mins Read
    Adipurush Movie Review: ఆదిపురుష్ - మూవీ రివ్యూ {2.5/5}
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    చిత్రం: ఆదిపురుష్

    దర్శకత్వం : ఓం రౌత్

    తారాగణం : ప్రభాస్, కృతీ సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే తదితరులు

    కథ : వాల్మీకి రామాయణం

    రచన : ఓం రౌత్, మనోజ్ ముంతషీర్

    సంగీతం -పాటలు : అజయ్-అతుల్, సచేత్ -పరంపర; నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా

    అంకిత్ బల్హారా; ఛాయాగ్రహణం : కార్తీక్ పళని, కళా దర్శకత్వం : సాగర్ మాలీ, పోరాటాలు : రమజాన్ బులూత్, ప్రద్యుమ్న కుమార్ స్వైన్

    బ్యానర్స్ : టీ -సిరీస్ ఫిల్మ్స్ , యూవీ క్రియేషన్స్

    నిర్మాతలు : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓంరౌత్

    విడుదల 16 జూన్ 2023

    రేటింగ్: 2.5/5

    ‘బాహుబలి’ పానిండియా ఘన విజయం తర్వాత, ‘సాహో’, ‘రాధేశ్యామ్’ అనే రెండు పానిండియా సినిమాలు పరాజయాల పాలయ్యాక, రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ పౌరాణిక రామాయణంలో నటిస్తూ, ఓ పెద్ద సినిమా కోసం కళ్ళు కాయలు చేసుకున్న అఖిల భారత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మిగతా ప్రపంచ ప్రేక్షకుల ముందుకూ వచ్చాడు. ‘తన్హాజీ’ దర్శకుడు ఓంరౌత్ రామాయణం మీద ఒక జపాన్ యానిమేషన్ నుంచి స్ఫూర్తి పొంది భారీ బడ్జెట్ తో రూపొందించిన ‘ఆదిపురుష్’ టైటిల్ కి తన భాష్యం చెప్పాడు. ఆదిపురుష్ ని తొలి పురుషుడనే అర్థంలో తీసుకోకూడదనీ, ఉత్తమ పురుషుడుగా చూడాలనీ స్పష్టం చేశాడు. మరి ఉత్తమ పురుషుడుగా రాముడిని ఎంత ఉత్తమంగా దృశ్యమానం చేశాడు? ఉత్తమ పురుషుడి లక్షణాలు రాముడిలో ఏమైనా హైలైట్ అయ్యాయా..? తన విజన్ ఏమిటి..? దాని ఒరిజినాలిటీ ఏమిటి..? ఇవి తెలుసుకుందాం…

    కథ

    రాఘవుడు (ప్రభాస్), జానకీ (కృతీ సనన్), లక్ష్మణుడు (సన్నీ సింగ్)ల వనవాసంతో కథ మొదలవుతుంది. దీనికి ముందు దశరథుడితో కైకేయి కోరిక, ఆ కోరిక మేరకు రాజ్యాన్ని భరతుడికి అప్పగించి రాఘవ నిష్క్రమించే నేపథ్యం యానిమేషన్లో క్లుప్తంగా వస్తుంది. ఇలా ముగ్గురూ వనవాసంలో వుండగా, లంకేష్ (సైఫ్ అలీ ఖాన్) తనకి మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాలు పొందుతాడు. ఇదిలా వుండగా, అటుగా వెళ్తున్న‌ శూర్పణఖ రాఘవని చూసి మోజు పడుతుంది. తను వివాహితుడిన‌ని చెప్తాడు రాఘవ. శూర్పణఖ లంకకెళ్ళిపోయి రాఘవతో తన కోరిక గురించి అన్న లంకేష్ కి చెప్తుంది. జానకి అందచందాల గురించి కూడా వర్ణించి చెప్పడంతో, లంకేష్ లో దుష్టత్వం మేల్కొంటుంది. మాయలేడిని ప్రయోగించి, సాధువు వేషంలో వచ్చి  జానకిని అపహరించుకుపోతాడు.

    దీంతో ఖిన్నుడైన రాఘవుడేం చేశాడు..? జానకీ విముక్తి కోసం అతను అనుసరించిన మార్గాలేమిటి..? ఆ ప్రయత్నంలో సుగ్రీవుడు, హనుమంతుడు తదితర వానర సైన్యం ఎలా తోడ్పడ్డారు..? మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాలు పొందిన లంకేష్ ఎలా రాఘవుడి చేతిలో అంతమయ్యాడు..? ఇదీ మిగతా కథ.

    ALSO READ: ఆదిపురుష్ మూవీ లోని టాప్ 10 డైలాగ్స్

    ఎలావుంది కథ

    అందరికీ తెలిసిన కథే. కాకపోతే నవతరం ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని ధారాళంగా సృజనాత్మక స్వేచ్ఛకి పాల్పడ్డాడు దర్శకుడు. ముఖ్యంగా వనవాసం, మాయలేడి, జానకీ అపహరణం, వాలి -సుగ్రీవ సంగ్రామం, హనుమంతుడి సాయం, రామసేతు నిర్మాణం, సంజీవనీ పర్వతం, లంకేష్ తో యుద్ధం- ఇలా ఓ పది ప్రధాన ఘట్టాల్ని తీసుకుని తేలికగా అర్థమయ్యేట్టు రామాయణం చెప్పుకెళ్ళాడు. భారతం కంటే రామాయణం తేలికైనదే. తెలుగులో బాపు- రమణలు తీసిన ‘సంపూర్ణ రామాయణం’ చూస్తే ఇక రామాయణ గ్రంథాలు చదవనవసరం లేదు.

    ఐతే దర్శకుడు ఓం రౌత్ 1990ల నాటి జపనీస్ యానిమేషన్ రామాయణం చూసిన ప్రేరణతో ఆధునిక టెక్నాలజీ రామాయణం తీయాలనుకున్నాడు. ఇలా తీస్తున్నప్పుడు ఇందులో ఆధునిక టెక్నాలజీ ఎక్కువైపోయి రామాయణ భక్తి భావం తగ్గింది. తగ్గడం కాదు, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

    అసలు పేర్ల మార్పు దగ్గరే మాస్ అప్పీల్ గాలిలో కలిసింది. రాఘవ, జానకి పేర్లు సినిమాటిక్ గా వాడకంలో ఎప్పుడూ లేవు. రాముడు, సీత అంటేనే ప్రేక్షకుల ప్రాణాలు లేచొస్తాయి. సినిమాలో పాత్రలు ఈ పేర్లు పలుకుతుంటే వుండే వైబ్రేషన్స్, రెస్పాన్స్ రాఘవ, జానకి పేర్ల‌లో వుండవు. సీత పేరు కూడా కలిపి జై సియారాం అనే పిలుపుని రాజకీయాల కోసం జై శ్రీరాంగా మార్చేసి పాపులర్ చేసినప్పుడు -ఎందుకో దర్శకుడు రాముడు పేరు వినపడకుండా చేశాడు.

    అయితే సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రతో ఎజెండాని టచ్ చేశాడు. వూహాజనిత లవ్ జిహాద్ నింద ప్రతిఫలించేందుకు, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అనే సాయెబుని తీసుకుని, ముస్లిం రాజు గెటప్ ఇచ్చి- ‘పద్మావత్’ లో అల్లావుద్దీన్ ఖిల్జీని సంజయ్ లీలా భాన్సాలీ చూపించినంత కిరాతకుడిగా (ఖిల్జీ కిరాతకుడు కాదనేది వేరే సంగతి) చూపించి ఎజెండాని చాటాడు. పవిత్ర పురాణాలని కూడా రాజకీయాలకి ఉపయోగించుకోక తప్పదేమో. ఇక ఈ పాత్రకి కూడా రావణుడు అంటే వుండే గాంభీర్యాన్ని, మాస్ అప్పీల్‌ని లంకేష్ అనే పేరుతో తగ్గించేశాడు.

    ఎంత టెక్నాలజీని జోడించినా పురాణం భక్తి పారవశ్యం కలిగించకపోతే అది విఫలమైనట్టే. నవతరంలో కూడా మత స్పృహ, దైవ భక్తి పెరిగిపోయిన ఈ రోజుల్లో కేవలం టెక్నికల్ హంగామా చేసి డ్రైగా రామాయణం తీసి హిట్ కొడతామనుకుంటే పొరపాటే. దీనికంటే వంద రెట్లు ఎక్కువ (కృష్ణ) భక్తితో నార్త్ లో కూడా నిఖిల్ నటించిన ‘కార్తికేయ2’ అనే తెలుగు స్పిరిచ్యువల్ థ్రిల్లర్ సూపర్ హిట్టయ్యింది . రౌత్ సినిమాలో రాఘవ ప్రేక్షకుల చేత జై శ్రీరామ్ అన్పించుకోనట్టే, హనుమంతుడు కూడా జై బజరంగ్ బలీ అన్పించుకోలేదు. ఇక మనం జానకిని చూసి- మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ – అని వేడుకోవాల్సిందే దోసిట్లో కాస్తంత భక్తి రస ధార కోసం.

    ప్రపంచ పురాణాల్ని పరిశోధించి సినిమాల కోసం ఇంత లావు పుస్తకం రాసిన జోసెఫ్ క్యాంప్ బెల్- అసలు పురాణ పురుషుడి పాత్ర ప్రయాణం అదొక స్పిరిచ్యువల్ జర్నీ అంటాడు. ఈ స్పిరిచ్యువల్ జర్నీలో 12 మజిలీలుంటాయి. రామాయణంలో కూడా ఈ 12 మజిలీలుంటాయి. ఒక్కో మజిలీ ఒక్కో అధ్యాత్మిక లక్ష్యాన్ని సాధిస్తూ సాగుతుంది. చివరి మజిలీ మోక్షం పొందడం. అప్పుడే కథ పాఠకులతో/ప్రేక్షకులతో స్పిరిచ్యువల్ గా కనెక్ట్ అయి ఎనలేని భక్తి పారవశ్యాలకి లోనుజేస్తుంది.

    ఈ పుస్తకం ముందు పెట్టుకునే జార్జి లూకాస్ ‘స్టార్ వార్స్’ అనే సైన్స్ ఫిక్షన్ హిట్ సినిమాలు తీస్తూ పోయాడు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఉత్త టెక్నాలజీ హంగామా సినిమాలు కావు- టెక్నాలజీ మాటున కథా కథనాలు, పాత్ర చిత్రణలూ ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే స్పిరిచ్యువల్ జర్నీలుగా వుంటాయి.

    ఇవేవీ లేకుండా రామాయణంలో పది ఘట్టాలు తీసుకుని, టెక్నికల్ హంగామా చేస్తే నవతరం పానిండియా అయిపోతుందా అనేది ఆలోచించాల్సిన విషయం.


    నటన- సాంకేతిక‌త‌

    ప్ర‌భాస్‌కి ఇలాంటి అవ‌కాశం మ‌ళ్లీ రాదు. ఈ అవకాశంతో క్షత్రియ పాత్రకి తన నటనతో కొత్త అధ్యాయం రాసుకోవడానికి చాలా కృషి చేశాడు. డైలాగ్ డెలివరీలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. అయితే ప్ర‌భాస్‌ క‌నిపిస్తే ఎక్కడా ప్రేక్షకులు ఈలలు వేయకపోవడం గమనించాల్సిన విషయం. అదే హనుమంతుడు క‌నిపిస్తుంటే ఈలలతో హోరెత్తించారు. అంటే బజరంగ్ బలీకి రాముడి కంటే పాపులారిటీ పెరిగినట్టా..?

    రాఘవ కాక రాముడుగా ఫీలైవుంటే ప్రభాస్ ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడేమో. కానీ పాత్ర చిత్రణలోనే మర్యాద పురుషోత్తముడి ఏ లక్షణాన్ని మెయింటెయిన్ చేయాలో దర్శకుడికి స్పష్టత లేదు. సాత్వికంగా చూపిస్తూనే రౌద్రంగా చూపిస్తాడు. రాముడు రౌద్రంగా వుంటాడా..? అతను స్థితప్రజ్ఞుడు, ఏ పరిస్థితుల్లోనైనా ఉదాత్తంగా వుంటాడు. శత్రువుతో చలించకుండా ఉదాత్త చిత్తంతో బాణాలేస్తుంటే వచ్చే దైవత్వం, మసాలా హీరోలాగా మారిపోతే వస్తుందా..? ఆద్యంతం ఒకే ఉదాత్త గుణంతో నడుచుకుని వుంటే ప్రభాస్ పాత్రని పూజనీయం చేసేవాడు.

    ఇంకోటేమిటంటే, పక్క పాత్రలు పూజిస్తే, భక్తి భావంతో పాడితే ప్రభాస్ రాముడి పాత్ర ప్రేక్షకుల మెదళ్ళలో బలంగా నాటుకుపోయే అవకాశముంటుంది. ‘సంపూర్ణ రామాయణం’ లో ‘రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!’ అని బృందగానం చేస్తేనే కదా రాముడి పాత్ర పైకి లేచింది. ఆఖరికి ‘అల్లూరి సీతారామ రాజు’ లో కూడా ఇలాంటి కీర్తి గానాలే. 150 కోట్లు తీసుకుంటున్న స్టార్ ని చూపిస్తూ పైకి లేపకపోతే ఎలా..? ఇదిలేక హనుమంతుడ్ని పైకి లేపాల్సి వచ్చింది ప్రేక్షకులు.

    పాత్ర చిత్రణ ఎలా వున్నా, దర్శకుడు టార్గెట్ చేసిన నవతరం ప్రేక్షకులతో పోరాటాల్లో ప్రభాస్ శభాష్ అనిపించుకున్నాడు. ఇక జానకిగా కంటే సీతగా వుండుంటే కృతీ సనన్ ప్రేక్షకులకి ఇంకా దగ్గరయ్యేది. సాధ్యమైనంత సుకుమార్యంగా, సున్నితంగా కన్పిస్తూ గౌరవం పొందే ప్రయత్నం చేసింది గానీ, లంకలో శోక రసమనేది తగిన పాళ్ళలో పాత్రకే లేకుండా పోయింది. హనుమంతుడి పాత్రలో దేవదత్తా నాగే భంగిమల్లో రాముడిపట్ల వుండే అణకువ, మెలో డ్రామా లేక పాత్ర నిలబడలేదు. రాముడితో హనుమంతుడి కుండే బాండింగ్ అదొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. నవతరం పౌరాణికంలో ఇలాంటి ఎమోషనల్ కనెక్ట్ కూడా కట్ అయింది.

    ఇక లంకాదహనం దృశ్యంలో చేసే అల్లరిని కూడా కట్ చేశాడు దర్శకుడు. అశోక వనంలో జానకిని తల్లిలా ఫీలవడం కూడా చేయకుండా తోక కత్తిరించాడు దర్శకుడు. ఫీల్, మెలో డ్రామా, భావోద్వేగాలు, సెంటిమెంట్లు వంటి మానవ సహజ లక్షణాలకి వీలైనంత దూరంగా ‘ఆదిపురుష్’ని వుంచాడు. లక్ష్మణుడ్ని శేషు అని పిలిచాడు దర్శకుడు. ఇలా పాత్రల పాపులరైన పేర్లు పక్కన పెట్టేయడం ఏదో కొత్తదనమనుకున్నాడు. శేషుగా సన్నీ సింగ్ సినిమాలో సరిగా రిజిస్టర్ కాడు.

    ఇక లంకేష్ గా (ఏ లంకేష్, గౌరీ లంకేషా?) సైఫ్ అలీ ఖాన్‌ అతి క్రూరత్వం హైలైట్. చివరికి జానకితో లవ్ జిహాద్ కుదరక రాఘవ బ్రహ్మాస్త్రానికి మట్టికరిచే సన్నివేశంలో కూడా ఓకే. రావణుడి గా అతను పాడే ‘శివోహం’ వీణ పాటలో ఎమోషనల్ గా జీవించాడు.

    సినిమాలో భక్తిని రగిలించే ఒక పాటే వుంది బ్యాక్ గ్రౌండ్ సాంగ్ – రాం సీతా రాం (హిందీలో- రాం సియా రాం). రాఘవ – జానకిలతో వచ్చే రెండు పాటలు పూర్తిగా లేవు. పాటల పరంగా, నేపథ్య సంగీత పరంగా ప‌ర్వాలేదన్పించుకుంటుంది.

    ఛాయాగ్రహణం, గ్రాఫిక్స్, వీఎఫెక్స్, కాస్ట్యూమ్స్, సెట్స్ మొదలైన సాంకేతికాలు అద్భుతమే. టెక్నికల్ గా ఉన్నత ప్రమాణాలే. పోరాటాలూ ఉన్నతమే. ఎంతకీ ముగియని క్లైమాక్స్ పోరాటాన్ని ఎడిటర్ తగ్గించాల్సింది. ఓం రౌత్ దర్శకత్వం గ్రాఫిక్స్ తోనే ఎక్కువుంది.


    చివరికేమిటి

    నీటుగా ప్రారంభమై ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే పరంగా సజావుగా సాగుతుంది. జానకీ అపహరణంతో ప్రధాన మలుపుని ఇంటర్వెల్ దాకా తీసికెళ్ళకుండా 40వ నిమిషంలో సరిపెట్టి కథలో కొచ్చేస్తాడు. ఇంట‌ర్వెల్‌లో లంకకి వారధి పూర్తయ్యే దృశ్యంతో కొనసాగి, సెకండాఫ్ లో క్రమంగా లంకలో రాఘవ వానర సైన్యంలో లంకేష్ తో తలపడే ఘట్టానికొస్తాడు. సినిమా నిడివి మూడు గంటలున్నా, ఓ పది ఘట్టాలతో తక్కువ టాకీ సీన్లు, ఎక్కువ యాక్షన్ సీన్లుగా వుండే ఈ స్క్రీన్ ప్లే కథనంలో, పాత్ర చిత్రణల్లో ఏమాత్రం జీవం లేకపోవడం ప్రత్యేకత. ఈ రామాయణాన్ని కథపరంగా ఫీలయ్యే మాటే వుండదు.

    ఈ పౌరాణికం ఎలా వుంటుందంటే.. రోమన్ సామ్రాజ్యంపై వచ్చిన హాలీవుడ్ సినిమాలకి రామాయణాన్ని అతికించినట్టు వుంటుంది. లేదా గ్లాడియేటర్, ఎక్సడస్, 300, ట్రాయ్ వంటి హాలీవుడ్ హిస్టారికల్స్ లో వుండే అవే పాత్రలు, వాటి ఆహార్యాలు, భవనాలు, లొకేషన్స్, లేజర్ ఆయుధాలు, వికృత సముద్ర జీవులు, వాయు జీవులు, రాక్షసులు, యుద్ధాలు మొదలైనవి కాపీ చేసి ఓ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ తీసినట్టు వుంటుంది. దృశ్యాలు కూడా కంటికింపుగా లేక, బ్యాక్ గ్రౌండ్ డార్క్ షేడ్స్ తో ఇబ్బంది కల్గిస్తూ వుంటాయి. పురాణాలతో నవతరం ప్రేక్షకుల అభిరుచి ఇలా వుంటుందంటే వాళ్ళకో నమస్కారం పెట్టాల్సిందే. రామాయణ పాత్రలు ఇలాగే వుంటాయని కూడా నమ్మేస్తారేమో! ఫేక్ న్యూస్ సినిమాలు కూడా ఇస్తాయని చెప్పడం దర్శకుడు రౌత్ ఉద్దేశమేమో!

    Adipurush Adipurush Movie Review
    Previous Articleత్వరలోనే ఐఓఎస్ 17.. కొత్త ఫీచర్లివే..
    Next Article ఆఫీస్ కి రాకపోతే క్రమశిక్షణ చర్యలు -ఇన్ఫోసిస్
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.