నాకు ఆ వ్యాధి ఉంది - ఫహాద్ ఫాజిల్
41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు ఫహాద్.
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. తాజాగా తన ఆరోగ్యం గురించి ఓ విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 41 ఏళ్ల వయసులో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ADHD) వ్యాధితో తాను బాధపడుతున్నట్లు ఫహాద్ తెలిపాడు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీని వల్ల దేనిమీదా ఎక్కువసేపు శ్రద్ధ పెట్టలేకపోవడం, కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి తనలో గమనించినట్లు తెలిపాడు. ఇది పిల్లల్లో సాధారణమని పెద్దలకు అరుదుగా వస్తుందన్నాడు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు ఫహాద్.
ADHD లక్షణాలు ఎలా ఉంటాయి?
పిల్లలు ఎక్కువగా ఈ రుగ్మతతో బాధపడుతుంటారు. చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, ఎక్కువగా మాట్లాడటం, అజాగ్రత్తతో తప్పులు చేయడం, ప్రతి దానికీ రిస్క్ తీసుకోవడం, తనవంతు వచ్చే వరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటే ADHD సమస్య ఉన్నట్లేనని డాక్టర్లు చెబుతున్నారు.
చికిత్స ఉందా..?
ఒక వ్యక్తికి ADHD ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం పెద్ద సవాల్. దీన్ని నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.