Telugu Global
NEWS

మహిళలు 30 దాటిన తరువాత క‌చ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు..

హార్మోన్ల అసమతుల్యత, ఎముకలు బలహీనపడడం వంటి వాటితోపాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు సోకే అవకాశం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

మహిళలు 30 దాటిన తరువాత క‌చ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు..
X

మహిళలకు వయస్సు పెరిగే కొద్ది పని, బాధ్యతలే కాదు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి అన్నది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తరువాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, ఎముకలు బలహీనపడడం వంటి వాటితోపాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు సోకే అవకాశం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇదే కాకుండా, భారత మహిళలను పీడిస్తున్న మరొక పెద్ద సమస్య రక్తహీనత.

ఈ నేపథ్యంలో 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయంచుకోవాల్సిన కొన్ని పరీక్షలు తెలుసుకుందాం.

1. మామోగ్రఫీ:

ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రిస్క్ పెరుగుతోంది. చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను వ్యాధి ముదిరిన దశలో మాత్రమే గుర్తిస్తున్నారని, అందుకే మరణాల రేటు అధికంగా ఉంటోందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్‌ ను రెండు పద్ధతుల ద్వారా తొలి దశల్లోనే గుర్తించవచ్చు. అందులో ఒకటి మహిళలు ఇంటి వద్దే పరీక్షించుకునే విధానం అయితే రెండవది మామోగ్రఫీ. ఇది రొమ్ములకు తీసే ఎక్స్-రే. దీని ద్వారా రొమ్ముల్లో కణుతులు ఏర్పడ్డాయో లేదో పరిశీలిస్తారు. అవి క్యాన్సర్ కారకాలైతే వెంటనే చికిత్స చేయించుకోవచ్చు.




2. పాప్ స్మియర్ టెస్ట్:

భారతీయ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తరువాత గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించగలిగితే, తగిన చికిత్స అందించవచ్చు. గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగా తెలుసుకోవటానికి ఉత్తమ మార్గం పాప్ స్మియర్ టెస్ట్. గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలు సేకరించి క్యాన్సర్ లక్షణాలు లేదా క్యాన్సర్ వచ్చే ముందు కలిగే మార్పులేమైనా ఉన్నాయా అని పరీక్షిస్తారు. ఇది క్లినిక్‌లో రెండు మూడు నిమిషాల్లో జరిగే తేలిక పాటి పరీక్ష.


3. కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ):

భారతదేశంలో 57 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. మహిళలకు నెలసరిలో రక్తస్రావం అవుతుంది. ఇది కాకుండా హార్మోన్ సమస్యల వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది. ఇది చిన్న సమస్య కాదని, మహిళలు దీనిపై దృష్టిపెట్టాలని వైద్యులు చెబుతున్నారు. దీని కోసం కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో శరీరం నుంచి రక్తాన్ని సేకరించి అందులోని ఎర్ర రక్త కణాల సంఖ్య, తెల్ల రక్త కణాల సంఖ్య, హిమోగ్లోబిన్ కౌంట్, హెమటోక్రిట్, ప్లేట్లెట్లు పరీక్షిస్తారు.




4. థైరాయిడ్:

బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, అలసట, డిప్రెషన్ ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలే. థైరాయిడ్ అనేది గొంతులో ఉండే ఒక గ్రంథి. ఇది టీ3, టీ4, టీహెచ్ఎస్ అనే హార్మోన్లను ఉత్పత్తిచేస్తుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే అనారోగ్యం పాలవుతారు. థైరాయిడ్ సమస్యలు రెండు రకాలు. ఒకటి, అండర్‌యాక్టివ్ థైరాయిడ్ లేదా హైపోథైరాయిడిజం. రెండవది, ఓవర్‌యాక్టివ్ థైరాయిడ్ లేదా హైపర్‌థైరాయిడిజం. సరైన సమయంలో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా తీవ్ర అనారోగ్యానికి లోనుకాకుండా జాగ్రత్తపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.




5. ఎముకల బలహీనత - విటమిన్ డి, కాల్షియం టెస్ట్

సాధారణంగా మహిళలలో 30 దాటిన తరువాత ఎముకలలో సాంద్రత (బోన్ డెన్సిటీ) తగ్గుతూ వస్తుంది. ఎముకలు బలహీనం అవుతుంటాయి. 40 ఏళ్లు దాటిన మహిళలు ముఖ్యంగా మెనోపాజ్ తరువాత బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) బారినపడతారు. ఈ వ్యాధి సోకితే ఎముకల పటుత్వం తగ్గి, గుల్లబారుతాయి. ఎముకల పటుత్వానికి విటమిన్ డి, కాల్షియం సహాయపడతాయి. విటమిన్ డి లోపం ఉంటే అలసట, నీరసం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆలస్యం చేయకుండా రక్త పరీక్ష చేయించుకుని విటమిన్ డి స్థాయి అలాగే, రక్తంలో కల్షియం స్థాయిలు పరీక్షించుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.

First Published:  3 Jan 2024 8:06 AM IST
Next Story