శ్రీవారి గరుడ సేవకు వచ్చే వారి కోసం 400 బస్సులు
ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అన్నప్రసాదం పంపిణీ : టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించే గరుడ సేవకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మలయప్ప స్వామి గరుడ వాహనంపై మంగళవారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారు. ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తారు. కనీసం 2 లక్షల మంది భక్తులు గరుడ సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. భద్రత పరమైన సమస్యలు తలెత్తకుండా 5 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 400లకు పైగా బస్సులు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి 3 వేల ట్రిప్పుల బస్సులు నడుపుతారు. ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు భక్తులకు అన్నప్రసాదం అందిస్తారు. గరుడ సేవకు 3.50 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేశారు. వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవను వీక్షించే అవకాశం కల్పించడంతో పాటు స్వామివారి దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.