4డేస్ వీక్.. నిజంగానే అద్భుత ఫలితాలిస్తుందా..?
వాస్తవానికి ఈ 4డేస్ వీక్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనేం కాదు. గతంలో అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా అమలు చేశాయి.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు 5 రోజుల పనికి కారణం వారికి విదేశీ క్లయింట్లు ఎక్కువగా ఉండటమే. వారంలో 5 రోజుల పనితో ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా అలసిపోరని.. తద్వారా మెరుగైన పనితీరును కనబరుస్తారనేది విదేశీయుల ఆలోచన. దాన్ని దాటి వారానికి నాలుగు రోజుల పని (4డేస్ వీక్)ను అమలు చేసేందుకు కొన్ని జర్మన్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి ఆరు నెలల పాటు దీన్ని 45 కంపెనీల్లో అమలు చేసి, ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేస్తారు.
గతంలోనూ ప్రయోగాలు.. విజయవంతమైన ఫలితాలు
వాస్తవానికి ఈ 4డేస్ వీక్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనేం కాదు. గతంలో అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. అలా వారానికి 4 రోజులు పనిచేసిన ఉద్యోగులు మిగిలిన ఉద్యోగులతో పోలిస్తే మానసికంగా, శారీరకంగా మెరుగయ్యారని తేలింది. తద్వారా పనిలో నాణ్యత, వేగం కూడా పెరిగిందని గుర్తించారు.
ఇప్పుడు మళ్లీ ఎందుకు?
పనిలో సంతోషంగా లేని ఉద్యోగుల వల్ల చేసే పనిలో నాణ్యత తగ్గుతుందని ప్రపంచవ్యాప్తంగా సర్వేలు చెబుతున్నాయి. సంతోషంగా లేని ఉద్యోగులు పనిలో ఏకాగ్రత కనబరచకపోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏటా 8.1 ట్రిలియన్ యూరోలు నష్టపోతున్నట్లు జర్మనీలోని ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ రిపోర్ట్‌లో పేర్కొంది.
జీతం తగ్గదు
4డేస్ వీక్ గ్లోబల్ అనే ఓ సంస్థ ఈ వారానికి నాలుగు రోజుల పని ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రాజెక్టును లీడ్ చేస్తుంది. ఇలా పనిచేసే ఉద్యోగులకు జీతం పూర్తిగా చెల్లిస్తారు. పనిదినాలు తగ్గినా పని పరిమాణం, నాణ్యత తగ్గకూడదు. వారానికి మూడు రోజుల సెలవు ఉండటంతో శారీరకంగా, మానసికంగా రిలాక్స్ అవ్వడానికి అవకాశం దక్కుతుందని, తద్వారా చీటికిమాటికీ ఉద్యోగులు సెలవులు పెట్టరని, తద్వారా పనిలో నాణ్యత, వేగం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.