Telugu Global
Family

హోళీ పండుగ

ప్రతీ సంవత్సరం ఫాల్గుణ మాసం (ఫిబ్రవరి-మార్చి) పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు.

హోళీ  పండుగ
X

ప్రతీ సంవత్సరం ఫాల్గుణ మాసం (ఫిబ్రవరి-మార్చి) పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఈరోజు స్నేహితులు, బంధువులు ఒక దగ్గర చేరి రంగులు చల్లుకుంటూ, కోలాటాలతో సందడి చేసుకుంటారు. అంతే కాకుండా సాంప్రదాయ నృత్యాలు చేస్తూ భగవంతుని సేవలో మునిగితేలుతుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. వసంత కాలంలో వచ్చే ఈ పండగను హిందువులు చాలా ఘనంగా జరుపుకుంటారు.


అసలు ఈ హోలీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? హోలీ పండగ ఎందుకు జరుపుకుంటారు? ఎవరు ఈ హోలీ పండగ జరుపుకోవడానికి కారణం వంటి విషయాలు తెలుసుకోవడం సబబు .హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ గాథలు ఉన్నాయి.


1)

ప్రాచీన భారతదేశంలో హిరణ్యకశిపుడు అనే శక్తివంతమైన రాక్షస రాజు ఉన్నాడు. విష్ణువు చేతిలో చనిపోయిన తన తమ్ముడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని సంవత్సరాలుగా బ్రహ్మ అనుగ్రహం కోసం ప్రార్థించాడు. చివరకు బ్రహ్మ అతనికి ఒక వరం ఇస్తాడు.

“అతన్ని మానవుడు లేదా జంతువు, ఇంటి లోపల లేదా బయట, పగటిపూట లేదా రాత్రిపూట, అస్త్రాలు, ప్రక్షేపక ఆయుధాలు, లేదా ఏ శాస్త్రా, చేతితో పట్టుకున్న ఆయుధాలు, మరియు భూమి మీద లేదా నీరు లేదా గాలి, సర్పాల చేతగాని, సరీసృపాల చేతగాని, అగ్నిలోగాని, ఆకాశంలోగాని” మరేవిధంగా తనకు చావు రాకూడదని వరం సంపాదిస్తాడు.

దీంతో హిరణ్యకశిపుడు తనను తాను దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు మరియు తనను దేవుడిలా ఆరాధించాలని ప్రజలను ఆదేశిస్తాడు. అంతే కాకుండా ముల్లోకాలకు ముచ్చెమటలు పట్టించసాగాడు. తన కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణు మూర్తికి గొప్ప భక్తుడు. ఇది తెలిసి ప్రహ్లాదుని మనసు మార్చడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమవుతాడు. ఇంకా లాభం లేదనుకొని కన్నకొడుకుని చంపాలని నిర్ణయించుకుంటాడు.

హిరణ్యకశిపుడు సోదరి అయిన ‘హోలిక’ సహాయంతో ప్రహ్లాద్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే, ఆమెను అగ్ని ఏమీ చేయలేదు. ఒక పైర్ వెలిగించి, హోలిక ప్రహలాద్‌ను పట్టుకొని దానిపై కూర్చుంది. ఆ పైన నిప్పంటిచుకుంటుంది ‘హోలిక’. అందరూ చూస్తుండగానే ‘హోలిక’ మంటల్లో కాలి బూడిదవుతుంది. విష్ణు నామ స్మరణ చేసే ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. హోలిక ఓటమే చెడును అంతం చేసినట్టుగా భావించి హోలీ పండగ రోజు హోలిక దహనం చేస్తారు. ఆ తరవాత హిరణ్యకశిపుణ్ని ఇంటా బయటాకాక ద్వారం మీద తొడలమీద పెట్టుకొని గోళ్ళతో గుండెను చీల్చి నరసింహావతారంలో ఉన్న భగవంతుడు చంపేస్తాడు.


(2)

హోలీ వెనక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కృష్ణ భగవానుణ్ణి రాధా మరియు కొంత మంది స్త్రీలు నల్లవాడు మా కృష్ణుడు అని వెక్కిరించడంతో ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో, రాధకు రంగు పూయమని చెప్పగా, అప్పుడు కృష్ణుడు, రాధా మరియు గోపికలు కలిసి ఈ రంగుల ఉత్సవాన్ని జరుపుకోవడంతో అది హోలీగా జరుపుకుంటారు అని చెప్తుంటారు.

ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్, మధుర, బరసానా వంటి పుణ్యక్షేత్రాలలో హోళీని ఘనంగా జరుపుతారు. హోళీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తరభారతదేశంలో చూడవచ్చు. హోళీ తరువాత వచ్చే పంచమినాటి వరకూ కూడా ఈ సంబరాలు సాగుతాయి.


(3)

దైవకార్య నిమిత్తం యోగ నిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన బాణం ప్రయోగిస్తాడు. దీంతో ఆగ్రహం చెందిన పరమేశ్వరుడు తన మూడో కంటిని తెరచి మన్మధుడిని బూడిద చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి పరమేశ్వరుడిని వేడుకోవడంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మధుడు రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిచ్చాడు అలా మళ్లీ మన్మధుడు రతీదేవికి దక్కాడు.


కారణాలు ఏవైనా... రంగులతోనూ, మంటలతోనూ జరుపుకొనే ఈ రోజు మన ముఖ్య పండుగలలో ఒకటిగా నిలిచిపోతుంది. బాన్ఫైర్ (Bonfire) పేరుతో మంటలు వేసి, ఆ మంటల చుట్టూ నలుగురూ కలిసి ఆడిపాడే సంప్రదాయం ప్రపంచమంతా ఉన్నదే! కానీ ఆ సంప్రదాయానికి భోగిపేరుతోనో, హోళీ పేరుతోనో ఓ అందమైన రూపాన్నిచ్చి... అనాదిగా ఓ పండుగలా కొనసాగిస్తున్న ఘనత మాత్రం భారతీయ సంస్కృతిదే! ఇక అరమరికలు లేకుండా రంగులు చల్లుకునే ఆచారం కూడా, ఏ ఆధునిక ఉత్సవానికీ తీసిపోదు. మరి హోళీ అంటే ఇష్టపడనిది ఎవరు? అందుకే దేశంలోని పలు ప్రాతాల వారు వారు సాంప్రదాయాలకు తగ్గట్టు ఈ పండగను జరుపుకుంటూ ఉంటారు. ఎవరెలా జరుపుకున్నా హాని చేయని రంగులు, సాంప్రదాయ రంగులతో హోలీ ఆడడం శ్రేయ స్కరం అందరికి హోళీ పర్వదిన శుభాకాంక్షలు.

First Published:  6 March 2023 5:40 PM IST
Next Story