భార్యాభర్తల బంధం ఇలా పదిలం!!
చిన్న చిన్న మనస్పర్థలకే విడాకుల పేరుతో విడిపోతున్నారని ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ కౌన్సెలర్ ల దగ్గరకు కూడా భార్యాభర్తల గొడవ సమస్యలే అధికంగా వస్తుండటం గమనార్హం.
ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో, అంతే ప్రత్యేకమైనది కూడా. మధ్యలో కలిసే ఈ బంధం ప్రాణం పోయేవరకు తోడుంటుంది. కష్టాలలో, సమస్యల్లో, బాధల్లో ఇలా అన్నింటిలో నేనున్నానని నిలబడేది, తల్లిదండ్రుల తరువాత బాధ్యతగా ఉండేది ఈ బంధం ద్వారా జీవితంలోకి వచ్చే జీవితభాగస్వామి మాత్రమే.
అయితే భార్యాభర్తల బంధాలు ఎక్కువకాలం నిలబడటం లేదని, చాలా సున్నితంగా ఉంటున్నాయని, అందుకే చిన్న చిన్న మనస్పర్థలకే విడాకుల పేరుతో విడిపోతున్నారని ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ కౌన్సెలర్ ల దగ్గరకు కూడా భార్యాభర్తల గొడవ సమస్యలే అధికంగా వస్తుండటం గమనార్హం.
◆ ఈకాలంలో జెండర్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉండటం లేదు. మగవాళ్ళు ఆడవాళ్లకు సరైన స్థానం ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు అయినా కూడా భార్యాభర్తల బంధం చాలా తొందరగా చీలికలు ఏర్పడుతోంది.
◆ అవగాహన లేకపోవడం, ఒకరి నుండి మరొకరు ఏమి ఆశిస్తున్నారు అనే విషయాన్ని ఒకరికొకరు తెలుపలేకపోవడం వల్లనే ఇలా అవుతోంది.
◆ ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ అనేది బంధాల విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అది లేకపోతే అపార్థాలు పెరిగిపోయి, ఇద్దరి మధ్య కోపం చోటుచేసుకుంటుంది. అక్కడే అహం మొదలవుతుంది.
ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటి పరిష్కారం కోసం దృష్టిపెట్టి బంధం అలాగే నిలబెట్టుకోవాలి అనే ఆలోచన ఉంటే గనుక ఎన్ని సమస్యలు వచ్చినా ఇక ఆ బంధానికి డోకా ఉండదని రిలేషన్‌షిప్ నిపుణురాలు నెడ్రా గ్లోవర్ తవ్వాబ్ చెప్పారు.
◆ భార్యాభర్తల బంధంలో ఒకరి నుండి మరొకరు ఆశించడం అనేది సాధారణమైన విషయం. అయితే ఆశించినది లభించనప్పుడు చాలా డిజప్పాయింట్ అవుతారు కూడా. దాన్నుండే చాలావరకు గొడవలు చోటుచేసుకుంటాయి.
◆ చాలామంది భార్యాభర్తలు సీరియస్ విషయాలను బానే అర్థం చేసుకుంటున్నారు. వచ్చిన చిక్కంతా చిన్నచిన్న పనుల దగ్గరే అనే విషయం సర్వేలలో తెలిసినప్పుడు ఆశ్చర్యపోవడం అందరివంతు అవుతోంది.
◆ ఉద్యోగాలు చేసుకుని ఇంటికి వచ్చిన తరువాత ఒకరికొకరు సహకరించుకోలేకపోవడమే గొడవలకు దారితీస్తోంది.
◆ ఇంటి పనిని సమానంగా పంచుకోవడం జరిగితే భార్యాభర్తల మధ్య గొడవలు పెద్దగా ఉండవు.
◆ వంట పని, ఇంటిని శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం, ఒకరికొకరు పర్సనల్ స్పేస్ ఇచ్చుకోకపోవడం వంటి విషయాలను ఒకరికొకరు దగ్గరగా కూర్చుని మాట్లాడుకుంటే అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది.
జీవితభాగస్వాములలో ఎవరో ఒకరు ఎదుటి వాళ్లకు ఏదైనా పని చెప్పాలన్నా, ఏదైనా సహాయం అడగాలన్నా సంకోచిస్తుంటారు. అయితే అలాంటి సంకోచాలేమి పెట్టుకోకుండా జీవితభాగస్వామిని మనకు కావలసింది చెప్పడానికి కూడా కొంచెం లౌక్యం అవసరం అవుతుంది.
◆ వంట చేస్తున్నప్పుడు పిల్లలను చూసుకోమని చెప్పడం.
◆ బట్టలు ఉతికినప్పుడు వాటిని ఇద్దరూ కలిసి ఆరేయడం, మడతబెట్టడం.
◆ పిల్లలను చూసుకునే సమయాన్ని కలసి పంచుకోవడం.
◆ ఇంటికి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడానికి ఎవరికి అవగాహన ఉన్న వస్తువులు తేవడంలో వాళ్ళు పనులు కేటాయించుకోవడం.
◆ పర్సనల్ సమయాన్ని ఇష్టం లేకపోయినా కాంప్రమైజ్ అవుతూ గడపడానికి ప్రయత్నించకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం.
◆ ఏదైనా అసౌకర్యం ఎదురైనప్పుడు దానిగురించి అర్థమయ్యేలా మెల్లిగా మాట్లాడుకోవడం.
◆ ఆర్థిక విషయాలలో ఎలాంటి గొడవలు లేకుండా అన్ని వివరంగా చెప్పుకోవడం.
◆ ముఖ్యంగా ఒకరికొకరు చెప్పుకోకుండా ఎలాంటి ఖర్చులు చేయకపోవడం.
◆ ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా భాగస్వామి విషయంలో బాధ్యతగా ఉండటం.
ఇలా అన్ని విషయాలలో జీవితభాగస్వాములు పనులను పంచుకోవడం, ఒకరిని మరొకరు గౌరవించడం, బాధ్యతగా ఉండటం. ముఖ్యంగా ఎన్ని గొడవలు వచ్చినా వాటిని పరిష్కరించుకోవాలి తప్ప విడిపోకూడదు అనే బలమైన నిర్ణయాన్ని తీసుకుంటే బంధాలు పదిలం.