ఈ ఏడాదితో వీటికి గుడ్‌బై చెప్పేయండి!
న్యూ ఇయర్ కోసం కొన్ని కొత్త రిజల్యూషన్స్ పెట్టుకోవడంతో పాటు కొన్ని పాత అలవాట్లను కూడా మానుకుంటే జీవితాన్ని కొత్తగా మలచుకోవచ్చు.
కొత్త సంవత్సరం రాబోతుంది. న్యూ ఇయర్‌ని ఫ్రెష్‌గా స్టా్ర్ట్ చేయాలని అందరూ అనుకుంటారు. మిమ్మల్ని మీరు మార్చుకోడానికి ఇదే అనువైన సందర్భం. అందుకే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేముందు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు చాలామంది. అలాగే కొన్ని అలవాట్లకు కూడా గుడ్ బై చెప్పేయాలనుకుంటారు.
న్యూ ఇయర్ కోసం కొన్ని కొత్త రిజల్యూషన్స్ పెట్టుకోవడంతో పాటు కొన్ని పాత అలవాట్లను కూడా మానుకుంటే జీవితాన్ని కొత్తగా మలచుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి అలవాట్లను మానుకోవాలంటే..
అప్పులు వద్దు
న్యూ ఇయర్‌లో చేయాల్సిన పనుల్లో మరో ముఖ్యమైన పని అప్పులు తీర్చేయడం. ఏవైనా చిన్నచిన్న అప్పులు లాంటివి ఉంటే వాటిని వీలైనంత త్వరగా తీర్చేసి పాత ఏడాదితో అప్పుల అలవాటుకి గుడ్ బై చెప్పేయండి. అప్పులు ఉంటే ఎప్పటికైనా టెన్షనే. అందుకే వీలైనంత త్వరగా వాటిని తీర్చేయాలి. అలాగే కొత్త సంవత్సరంలో కొత్త అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి.
స్మోకింగ్/ డ్రింకింగ్
స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లను మానుకోవాలని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటారు. కానీ దాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అవుతుంటారు. అయితే ఉన్నట్టుండి అలవాట్లను మానుకోవడం కష్టంగా అనిపించొచ్చు. కాబట్టి కొద్దికొద్దిగా తగ్గించాలని నిర్ణయం తీసుకోవచ్చు. మధ్యవయసులో వచ్చే గుండె జబ్బులు, బీపీ, షుగర్‌లకు ఈ రెండు అలవాట్లే ప్రధానమైన కారణంగా ఉంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఈ అలవాట్లను వీలైనంత త్వరగా మానుకుంటే బెటర్.
కిచెన్ శుభ్రంగా..
కిచెన్ శుభ్రంగా ఉంటే ఇంట్లో మూడ్ బాగుంటుంటుంది. కుటుంబమంతా హెల్దీగా ఉండొచ్చు. అందుకే న్యూ ఇయర్‌కి ఒక రోజు ముందైనా ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే బెటర్. ముఖ్యంగా వంటగది. వంటగదిలోని ప్రతీ మూల నీట్‌గా ఉంచుకోవడం వల్ల చాలావరకూ హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే కొత్తకొత్త వంటలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది.
ఇయర్ బడ్జెట్
మనీ మేనేజ్‌మెంట్ ఎప్పుడూ ఒక ఛాలెంజ్ లాంటిదే. డబ్బుని ఎంత ప్లాన్డ్‌గా ఖర్చు చేసినా అప్పుడప్పుడు కాస్త అటు ఇటు అవ్వడం సహజం. అందుకే ఈ సారి ఇయర్ బడ్జెట్ వేసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయొచ్చేమో ట్రై చేయండి. నెలకు వచ్చే శాలరీ, అందులో దేనికి ఎంత శాతం ఖర్చు పెట్టాలో ఒక బడ్జెట్ రెడీ చేసుకోవాలి. దాంతోపాటే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం కూడా కొంత కేటాయించాలి.
యాప్స్ డిలీట్
పాత సంవత్సరంతో పాటే కొన్ని యాప్స్‌కు కూడా గుడ్ బై చెప్పేయడం బెటర్. ఎప్పటినుంచో వాడకుండా ఉన్న యాప్స్‌తో పాటు మన టైంను బాగా తినేసే సోషల్ మీడియా యాప్స్, గేమింగ్ యాప్స్‌ను కూడా దూరం పెట్టడం మంచిది. కొత్త సంవత్సరంలో మొబైల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా సమయం గడపొచ్చు.
ఆరోగ్యం
ఇకపోతే మార్చుకోవాల్సిన అలవాట్లలో అన్నింటికంటే ముఖ్యమైంది హెల్త్ కేర్. పోయిన సంవత్సరం న్యూ ఇయర్‌కి బరువు తగ్గాలనో, ఫిట్‌గా ఉండాలనో.. ఇలా ఏదో ఒక హెల్త్ పరమైన రిజల్యూషన్ పెట్టుకునే ఉంటారు. అప్పుడు అది ఎంతవరకూ ఫాలో అవ్వగలిగారో చెక్ చేసుకోండి. ఒకవేళ మధ్యలో ఆపేసినట్టయితే ఈసారి అలా కాకుండా జాగ్రత్త పడండి. జీవితంలో ఎంత ప్లానింగ్ ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్యంగా లేకపోతే అవన్నీ వృథానే. అందుకే న్యూ ఇయర్‌లో మరింత హెల్దీగా ఉండాలని ఇప్పుడే నిర్ణయించుకోండి.