Telugu Global
Family

మీ ప్రేమ సేఫేనా? ఇలా చెక్ చేసుకోండి!

ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు ఇటీవల ఎక్కువయ్యాయి. ప్రేమించిన వాళ్లే ఉన్నట్టుండి రాక్షసుల్లా మారుతున్నారు. అసలు ఇలాంటి వ్యక్తులది నిజమైన ప్రేమేనా? ప్రేమికుల రూపంలో ఉన్న రాక్షసుల్ని ఎలా గుర్తించాలి?

మీ ప్రేమ సేఫేనా? ఇలా చెక్ చేసుకోండి!
X

ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. పెళ్లి చేసుకోమన్న పాపానికి ప్రేమించిన అమ్మాయిని ముక్కలుగా నరికేశాడు ఆఫ్తాబ్ అనే యువకుడు. ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు ఇటీవల ఎక్కువయ్యాయి. ప్రేమించిన వాళ్లే ఉన్నట్టుండి రాక్షసుల్లా మారుతున్నారు. అసలు ఇలాంటి వ్యక్తులది నిజమైన ప్రేమేనా? ప్రేమికుల రూపంలో ఉన్న రాక్షసుల్ని ఎలా గుర్తించాలి?

ఒక మనిషిలో చంపేంత కోపం, పగ ఉన్నాయంటే అతను/ఆమె ఎప్పటికీ ప్రేమించలేరు. కానీ, అందమైన మాటలు, చేష్టలతో కొంతమంది ప్రేమ పేరుతో వల వేస్తుంటారు. తీయని మాటలతో వలలో వేసుకొని ఆ తర్వాత అసలు రంగు చూపిస్తారు. అందుకే అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ప్రేమ ముసుగు వేసుకున్న రాక్షసులను మాత్రం ముందే పసిగట్టాలి. లేకపోతే ఎప్పుడైనా అనుకోని ప్రమాదం ముంచుకురావచ్చు. అమ్మాయి లేదా అబ్బాయిలో ఒక్కరిదే నిజమైన ప్రేమ అయినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఒకరు జీవితాంతం కలిసి ఉండాలనుకుంటే మరొకరు అవసరాలన్నీ తీరాక వదిలించుకోవాలనుకుంటారు. అది కుదరనప్పుడు వదిలించుకునే క్రమంలో హత్యల దాకా వెళ్తారు. అందుకే ఇలాంటి వ్యక్తులను ముందే గుర్తించాలి. ప్రవర్తన, నడవడిక, అలవాట్ల ద్వారా ప్రేమికుడు/ప్రేమికురాలు రాక్షసుల్లా మారుతున్న విషయాన్ని ముందే పసిగట్టవచ్చు. అదెలాగంటే..

మొదట్లో బాగానే ఉన్నా కొంతకాలానికి అతిగా కోప్పడడం, గౌరవం లేకుండా మాట్లాడడం, కొత్తగా దురలవాట్లు.. ఇలాంటివి కనిపిస్తే వారిలో ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే ఆమె లేదా అతడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.

మాట్లాడేటప్పుడు ఇంట్రెస్ట్ చూపించరు. చిన్నచిన్న విషయాలకే గొడవ పడుతుంటారు. ప్రతిదాంట్లో తప్పులు వెతుకుతుంటారు.

పెళ్లి ప్రస్తావన తెస్తే చిరాకు పడిపోతుంటారు. టాపిక్‌ను డైవర్ట్ చేస్తుంటారు.

సోషల్ మీడియాల్లో అన్‌ఫ్రెండ్‌ చేస్తారు. ఫోన్‌కి కొత్త పాస్‌వర్డ్‌ పెట్టుకుంటారు.

శారీరకంగా, ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు. ఎదుటి వ్యక్తి గురించి ఎక్కువగా పట్టించుకోరు. మొదట్లో చూపించిన అఫెక్షన్ రానురాను చూపించరు.

ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి మార్పులు గమనిస్తే.. వీలు చూసుకుని అన్నీ విషయాలు మాట్లాడేయాలి. మీ రిలేషన్ గమ్యం పెళ్లా? విడిపోవడమా? అనేది తెలుసుకోవాలి. 'పెళ్లి చేసుకోను' అన్నప్పుడు బలవంతపెట్టకుండా వాళ్లకు బ్రేకప్ చెప్పేయాలి.

ప్రేమించేటప్పుడు వీలైనంత వరకూ హద్దులు దాటకుండా ఉండేందుకు ట్రై చేయాలి. అవతలి వ్యక్తిలో నచ్చని అలవాట్లు, పద్ధతులు ఉంటే భరించాల్సిన పనిలేదు. మీకు నచ్చట్లేదని చెప్పేయాలి. అయినా వాటిని కంటిన్యూ చేస్తుంటే అలాంటి వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు రహస్యంగా ఉంచకుండా తెలిసిన వాళ్లతో పంచుకోవడం మంచిది. అత్యవసర సమయాల్లో అలాంటి వారి సాయం తీసుకోవచ్చు.

ఇకపోతే డ్రగ్స్ అలవాటు ఉన్నవాళ్లు, ఊరికే చేయి చేసుకునే వాళ్ల నుంచి వీలైనంత త్వరగా విడిపోవడం మంచిది.

First Published:  21 Nov 2022 4:06 PM IST
Next Story