తెలుగువాళ్ల బనారస్ చీర
బనారస్ వెళ్లి పాన్ తినని మగవాళ్లు, బనారస్ చీర కొనని ఆడవాళ్లు ఉండరేమో. బనారస్‌లో ఏ చీరల దుకాణానికి వెళ్లినా తెలుగు వినిపిస్తుంది, తెలుగు కనిపిస్తుంది.
బనారస్ వెళ్లి పాన్ తినని మగవాళ్లు, బనారస్ చీర కొనని ఆడవాళ్లు ఉండరేమో. బనారస్‌లో ఏ చీరల దుకాణానికి వెళ్లినా తెలుగు వినిపిస్తుంది, తెలుగు కనిపిస్తుంది. నిజమే... తెలుగు వాళ్ల ముఖం చూడగానే ఇట్టే పట్టేస్తారు దుకాణాలవాళ్లు. తెలుగులో ఆహ్వానం పలుకుతారు. ‘అమ్మా! ఇలా వచ్చి కూచుండి, మీకు మంచి మంచి చీర చూపిస్తా’’ తెలుగుమహిళ ఫిదా అయిపోతే మొదటి ఆయుధం అది. విజయవాడ, హైదరాబాద్‌లో పెద్ద పెద్ద చీరల షోరూమ్‌ల పేర్లు చెప్పి ‘ఆ షాపులకు సప్లయ్ చేసేది మేమే’నని కూడా చెబుతారు. దాంతో మనం సరైన చోటుకే వచ్చామనే మరో సంతృప్తి కూడా కలుగుతుంది. ఇదిలా ఉంటే... తెలుగువాళ్లే ఎక్కువగా ఎందుకు కనిపిస్తారు... అంటే బనారస్ చీరకు సరైన కట్టు తెలుగువాళ్ల దగ్గరే ఉంది. ఆశ్చర్యం కాదు, ఇది నిజమే.
బనారస్ కల
తమిళులుసంప్రదాయ చీరకట్టుకు కంచిపట్టు చీరను మించి మరొకటి పెద్దగా నప్పదు. పైగా వాళ్లు వాళ్ల సొంత నేతను తప్ప పొరుగునేతను అంత త్వరగా స్వాగతించరు. కేరళ వాళ్లు వారి సంప్రదాయ హాఫ్‌వైట్‌కే తొలిప్రాధాన్యం ఇస్తారు. కర్నాటక వాళ్లు మాత్రం తమిళనాడు కంచితోపాటు వారి మైసూర్ చేనేతలను, మన ధర్మవరం చేనేతతోపాటు కొంతవరకు బనారస్‌ను కూడా స్వీకరిస్తారు. మరాఠీల నుంచి ఉత్తరానికి వెళ్తే వారి ప్రాధాన్యత చమ్కీల చీరలకే. పైగా తల మీదకు కొంగు కప్పుకునే వస్త్రధారణలో నేతనైపుణ్యం, చీర అందం సరిగ్గా బహిర్గతం కావు. గుజరాత్ వాళ్ల శైలి వేరు. వాళ్ల చేనేత పటోలాను ప్రమోట్ చేసుకోవడం కంటే మరొకటి వాళ్లకు నచ్చదు. ఇలా... ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది. ఇక మన తెలుగు వాళ్లకు ధర్మవరం పట్టు, పాటూరు, వెంకటగిరి, ఉప్పాడ, గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఎన్ని రకాల చేనేతలున్నా సరే... బనారస్ చీరల కోసం బీరువాలో కొంత స్థానం ఉంచుతారు.
మనవాళ్లకు నప్పుతుంది
తెలుగువారి చీరకట్టుకు చీరలన్నీ చక్కగా ఇమిడిపోతాయి. బనారస్ చీర రిచ్ పల్లులో దాగిన వీవింగ్ నైపుణ్యం, కుచ్చిళ్లు, బోర్డర్‌లో బుటాల చిత్రవైచిత్రిని ఎగ్జిబిట్ చేయగలిగిన చీరకట్టు మనది. అంతకంటే ఎక్కువగా మనవాళ్లకు చీరల మీద మోజు కూడా ఎక్కువే. వధువుకి పెళ్లి చీరల ఎంపికలో కంచిపట్లు లేదా బనారస్ చీరలే ఉంటాయి. ‘బనారస్ చీర’ అని చెప్పుకోవడంలో కొంత అతిశయం కూడా. బనారస్ చీర మీద ఆసక్తితోపాటు కొనుగోలు శక్తి కూడా కలిగి ఉండడం వల్లనే కావచ్చు... బనారస్ చీరల మార్కెట్‌లో తెలుగుదనం పరిఢవిల్లుతోంది.