Telugu Global
Editor's Choice

ఎవరీ షర్మిల ? ఏమా కథ !!

లోటస్ పాండ్ లాంటి ఇంద్రభవనం, షర్మిల ఎక్కడయినా రాళ్లు కొట్టి సంపాదించిందా? కూలి చేసి కూడబెట్టిందా? షర్మిల భర్త అనిల్ కుమార్ ప్రార్థనలు చేసి పోగుచేశాడా'? అని సగటు టిఆర్ఎస్ కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు.షర్మిల పాదయాత్రకు రోజుకు రూ.25 నుండి రూ.30 లక్షలు ఖర్చు అవుతున్నట్టు ఒక అంచనా.

ఎవరీ షర్మిల ? ఏమా కథ !!
X

''నేను ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టకముందే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది.స్కూల్ పిల్లల లాగా మంత్రులు,ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు''అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.ఆమె వ్యాఖ్యలు ఆమె రాజకీయ అపరిపక్వతను రుజువు చేస్తున్నవి.అమాయకత్వాన్ని బట్టబయలు చేస్తున్నాయి.షర్మిల మాటలన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.

షర్మిల అసెంబ్లీలో కాలు మోపారనే అనుకుందాం! ఏమవుతుంది? అసెంబ్లీలో భూకంపం వస్తుందా?టిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా భయపడి అసెంబ్లీ నుంచి పారిపోతారా?

తెలంగాణ ప్రజల గురించి,ఇక్కడి సంస్కృతి గురించి,మొత్తంగా తెలంగాణ సమాజం గురించి ఆమెకు ఉన్న అవగాహన ఏమిటి?''టిఆర్ఎస్ కు నేనే ప్రత్యామ్నాయం''అని తన పాదయాత్రలో అడుగడుగునా షర్మిల ప్రకటిస్తున్నారు.'ప్రత్యామ్నాయం' అంటే ఏమిటి? ప్రత్యామ్నాయం గురించిన ప్రాథమిక అవగాహన ఆమెకు ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి.ఆమె చెబుతున్న 'రాజన్న రాజ్యం'తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారా? కేసీఆర్ పాలన వద్దు,తమకు షర్మిల పాలన కావాలని సామాన్య జనం కాంక్షిస్తున్నారా?రాజన్న రాజ్యం అంటే ఏమిటి? అదొక బ్రహ్మపదార్ధమా? రాజన్న అంటే షర్మిల తండ్రి.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.షర్మిల చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోదలచుకుంటే అది ఆంధ్రప్రదేశ్ లో చెల్లుబాటు కావచ్చు.అక్కడ ఆమె అన్న జగన్ తండ్రి పేరు చెప్పుకునే అధికారంలోకి వచ్చారు.సరే,తన శ్రమ కూడా ఉంది.అది అదనం.ఏపీలోనూ నెమ్మదిగా వైఎస్ఆర్ నీడ నుంచి బయటపడడానికి,సొంత ఆకర్షణ సంపాదించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్న విషయం రహస్యమేమీ కాదు.

తండ్రీ,తాత,ముత్తాతల పేర్లు చెప్పుకొని,వారి ఘనకార్యాల గురించి ప్రచారం చేసుకొని ఓటర్లను నమ్మించడం,ఓట్లు రాబట్టుకోవడం ప్రస్తుత రాజకీయాలలో కుదరదు.అది ఒకప్పటి వాతావరణం.ప్రజలకు చైతన్యస్థాయి తక్కువగా ఉన్న సందర్భాలలో,అటువంటి నియోజకవర్గాలలో 'వారసత్వ' ఆకర్షణ ట్రిక్కులు పనిచేసేవి.ఇప్పుడు చాలా మార్పు వచ్చింది.కొత్త జనరేషన్ లు వస్తున్నాయి.టెక్నాలజీలో ప్రతిక్షణం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.వీటన్నింటికి తోడు సోషల్ మీడియా విజృంభణ.ఈ దశలో పాతచింతతొక్కు ఫార్ములాను ప్రయోగించాలని చుస్తే షర్మిల తప్పనిసరిగా భంగపాటుకు గురవుతారు.

షర్మిల తండ్రి వైఎస్ 'పాస్ పోర్ట్,వీసా'అంటూ తెలంగాణను తూలనాడారు.తెలంగాణ విభజనను అత్యంత బలంగా అడ్డుకున్న చరిత్ర ఆయనకుంది.తెలంగాణ ప్రకటన వచ్చాక కూడా ఇదే షర్మిల ''తెలంగాణ ఏమయినా పాకిస్తానా'' అని ఆంధ్రప్రదేశ్ లో నోరు పారేసుకున్నది.అలంపూరు చౌరస్తాలో తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని షర్మిల,విజయమ్మ అమరుల మీద ఒట్టేశారు.

కాగా 'రాజన్న బిడ్డయితే రాజ్యం రాసివ్వాలా ?అయ్య ఇచ్చిన సంపద పొగరు పెంచిందా '? అని టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

'2004కు ముందు బంజారాహిల్స్ లో ఇళ్లు అమ్ముకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరిన వైఎస్ కుటుంబానికి ఇబ్బడిముబ్బడిగా ఆస్తులెక్కడివి? లోటస్ పాండ్ లాంటి ఇంద్రభవనం, షర్మిల ఎక్కడయినా రాళ్లు కొట్టి సంపాదించిందా? కూలి చేసి కూడబెట్టిందా? షర్మిల భర్త అనిల్ కుమార్ ప్రార్థనలు చేసి పోగుచేశాడా'? అని సగటు టిఆర్ఎస్ కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు.షర్మిల పాదయాత్రకు రోజుకు రూ.25 నుండి రూ.30 లక్షలు ఖర్చు అవుతున్నట్టు ఒక అంచనా! పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోతానని ఆమె పగటి కలలు కంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పాదయాత్ర పొడుగునా ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ పైన,కేసీఆర్ కుటుంబంపైన విషం చిమ్ముతున్నారు.

అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై,కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై,నాగర్ కర్నూలులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై,వనపర్తి మంత్రి నిరంజన్ రెడ్డిపై,దేవరకద్రలో ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డిపై షర్మిల నోటి కొచ్చిన విమర్శలు,అడ్డగోలుగా కారుకూతలు కూయడం పట్ల అధికారపార్టీ కార్యకర్తలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.అడుగడుగునా అహంకారం, చులకనభావం, జుగుప్సాకరమైన భాషను ఆమె వాడుతున్నట్టు వారంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అన్నతో పడక 'జగనన్న బాణం' రాజన్నరాజ్యం ముసుగులో 'అమిత్ షా బాణమై' తిరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఎవరి బాణమైనా కావచ్చు తెలంగాణ ప్రజల మనోభావాలు తీసే హక్కు,తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు,మంత్రులను కించపరిచే హక్కు షర్మిలకు లేదని చర్చ జరుగుతోంది.2023 ఎన్నికల్లో ఆమె పాలేరు నియోజకవర్గం మీదుగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నారు కానీ ప్రజలు ఆమెను ఆదరించే అంశంపై అనేక అనుమానాలున్నాయి.

First Published:  15 Sept 2022 12:00 PM IST
Next Story