ఇండస్ట్రీనే కాదు.. పవనూ సాగిల పడ్డాడా!?
అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ వ్యాఖ్యల వెనుక మతలబేంటి?
తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట సాగిల పడ్డాడా? ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు అవమానం జరిగిందంటూ ఇంతెత్తున ఎగిరిపడ్డ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు ఎందుకు పిల్లిమొగ్గలేస్తున్నారు? అల్లు అర్జున్ అరెస్టును ఏపీ కూటమికి నాయకత్వం వహిస్తోన్న చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. అల్లు అర్జున్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు తన వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు కూడా చేసింది తప్పేనని పవన్ కళ్యాణ్ చెప్పదల్చుకున్నారా? అసలు అల్లు అర్జున్ అరెస్టుపై మీడియా ముఖంగా మాట్లాడడానికి ప్రయత్నించని పవన్ కళ్యాణ్ చిట్ చాట్ లో చాటుమాటుగా ఇన్నిన్ని మాటలు చెప్పడం వెనుక మతలబేంటి? అల్లు అర్జున్, అర్వింద్ కుటుంబంతో ఇక మెగా ఫ్యామిలీ ఎప్పటికీ కలువదా? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలు ఆయన అభిమానులను, తెలుగు సినిమాను అభిమానించే వ్యక్తులను వెంటాడుతున్నాయి.
సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేస్తూ అరెస్టు చేయడంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ సీఎంగా తనను సినిమా పరిశ్రమ గుర్తించడం లేదనే కోపంతోనే రేవంత్ రెడ్డి ఈ ఘటనను అడ్డుపెట్టుకొని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ముందు సాగిల పడేలా చేశాడని కొందరు చెప్తున్నారు. రేవంత్ రెడ్డిని అమితంగా ఇష్టపడే సెక్షన్ ఈ విషయాన్ని ఎక్కడా దాచుకోవడం లేదు. బాహాటంగానే తాము చెప్పదల్చుకున్న విషయాన్ని కుండబద్దలు కొడుతోంది. రేవంత్ రెడ్డితో తమ సమావేశం ఫలవంతమైందని సినిమా ఇండస్ట్రీ పెద్దలు బయటికి చెప్తోన్నా లోలోపల వాళ్లు రగిలిపోతున్న విషయం సమావేశం తర్వాత ప్రస్ఫుటంగా కనిపించింది. టైం తమకు అనుకూలంగా లేదు కాబట్టి లేని నవ్వును ముఖాలపై పులుముకొని ఆ మీటింగ్ నుంచి బయటికి వెళ్లిపోయారు. కొందరు మీడియాతో చేసిన కామెంట్స్ వెనుక వ్యంగ్యం కూడా రకరకాలుగా ధ్వనిస్తోంది. అంటే రేవంత్ తో సమావేశం తమకు సంతృప్తినివ్వలేదని కొందరు చెప్పకనే చెప్పేశారు. కానీ ప్రభుత్వంతో పెట్టుకొని నిలదొక్కుకోలేమని సైలెంట్ అయిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై చాలా ఆలస్యంగా స్పందించారు. అది కూడా చిట్ చాట్ రూపంలో మాత్రమే రియాక్ట్ అయ్యారు. అంటే అవే విషయాలు బయట మాట్లాడటానికి ఆయనకేదో ఇబ్బంది ఉన్నట్టుగా అనిపిస్తోంది.
ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే విషయంలోనే అల్లు అర్వింద్ తో పవన్ కళ్యాణ్ కు విభేదాలు పొడచూపాయని చెప్తుంటారు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలోనూ కొన్ని విభేదాలు ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జట్టు కడితే అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం వైసీపీ తరపున ప్రచారం చేశారు. దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు కుటుంబానికి అగాధం పెరిగింది. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత అది కాస్త పూడుకుపోయినట్టే కనిపించింది. తాజాగా పవన్ వ్యాఖ్యలతో ఇక ఆ రెండు కుటుంబాలు ఎప్పటికీ ఒక్కటి కాకపోవచ్చు అన్న సందేహం మెగా ఫ్యాన్స్ కు మొదలైంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా కీలక స్థానానికి ఎదిగినా ఆయనలో రాజకీయ పరిపక్వత రాలేదనే అనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా కారు బానెట్ పై కూర్చొని ప్రయాణించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానూ అదే తరహా ఫీట్లు చేస్తున్నారు. ఇలాంటి కొన్నిసార్లు అభిమానులను ఆకట్టుకోవచ్చు. బలే చేస్తున్నాడు కదరా అనే మెచ్చుకోలు కూడా రావొచ్చు.. కానీ ఈ తరహా ఫీట్లు ఆయన హోదాకు మంచివి కావు.
సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి మరణం, శ్రీతేజ్ 25 రోజులుగా ఆస్పత్రిలో మంచానికే పరిమితమవడం ఆ కుటుంబానికి తీరని నష్టమే. శ్రీతేజ్ అల్లు అర్జున్ అభిమాని.. కుటుంబంతో కలిసి ఫస్ట్ షోనే పుష్ప-2 చూడాలన్న ఆ చిన్నారి ఆరాటం అతడికి తల్లిని దూరం చేసింది. తాను ఎప్పటికి కోలుకుంటాడో తెలియని పరిస్థితి. ఆ కుటుంబానికి అందరూ అండగా నిలవాల్సిందే.. కానీ ఈ ఘటనకు అల్లు అర్జున్ ది మాత్రమే తప్పు అనడం సరికాదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కూడా కారణమే. హోం శాఖ చూస్తున్న రేవంత్ రెడ్డి కూడా అక్కడ తొక్కిసలాటకు బాధ్యుడే. అల్లు అర్జున్ అరెస్టును సమర్థించుకోవడానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పడిన కష్టాలు చూస్తేనే ఈ విషయం తేలిపోతుంది. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డిని సమర్థించే వాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉండొచ్చు.. కానీ వాళ్లెవరూ ఈ ఘటనలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కు బాధ్యులెవరు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేసినప్పుడు శభాష్ రేవంత్ రెడ్డి అన్నోళ్లే.. పేదల ఇంటిపైకి బుల్డోజర్లు పంపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు విషయంలోనూ రేవంత్ చర్యను అలాగే సమర్థిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే.. ఈ విషయంలో బాలెన్డ్స్ గా మాట్లాడానికి ప్రయత్నిస్తూనే రేవంత్ రెడ్డి వైపు మొగ్గారు. అల్లు అర్జున్ ను తప్పుబట్టారు. హీరో ఒంటరి అయ్యాడని చెప్తూనే.. ఇంకో నాలుగు రాళ్లు మీదేయడానికే ప్రయత్నించారు. సినిమా ఇండస్ట్రీకే చెందిన పవన్ కళ్యాణ్ ఇలా స్పందిస్తారని ఎవరూ ఊహించి ఉండరు.. కానీ పవన్ కళ్యాణ్ ప్రతి అంశంపై ఒక్కో సందర్భంలో ఒకలా స్పందించినట్టే అల్లు అర్జున్ విషయంలోనూ మాట్లాడారు. రేపు ఇదే స్టాండ్ పై ఉంటారనే నమ్మకం కూడా లేదు. ప్రజారాజ్యం పార్టీని ప్రకటించిన రోజు నుంచి ఆయన స్టేట్‌మెంట్స్ చూస్తే ఇది తేటతెల్లమవుతుంది.