Telugu Global
Editor's Choice

హైడ్రాపై హైకోర్టు సీరియస్‌ కావడానికి కారకులెవరు?

కోర్టు వార్నింగ్‌ ఇస్తే తప్పా అధికారులకు బాధ్యతలు గుర్తురావా?

హైడ్రాపై హైకోర్టు సీరియస్‌ కావడానికి కారకులెవరు?
X

హైదరాబాద్‌ మహానగరంగా విలసిల్లుతున్నదంటే దీని వెనుక రాచరిక పాలన నుంచి ప్రజా ప్రభుత్వాల దాకా తీసుకున్న చర్యల ఫలితమే. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నాటికే దేశంలోనే కాదు ప్రపంచ నగరాలలో హైదరాబాద్‌ ఒకటి అన్నది చరిత్ర. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను మార్చినట్లే హైదరాబాద్ చరిత్రను మారుస్తామన్నట్లు ముఖ్యమంత్రి కొన్నిరోజులుగా హైడ్రా పేరుతో చేస్తున్న హడావుడి అధికారుల మెడకు చుట్టుకున్నది. ముఖ్యమంత్రికితోడు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అత్యుత్సాహం హైడ్రా ఏర్పాటుపై స్టే ఇస్తామని హైకోర్టు వార్నింగ్‌ ఇచ్చేవరకు వెళ్లింది. హైడ్రా ఏర్పాటు అభినందనీయం అంటూనే.. పనితీరే అభ్యంతరకరం అన్నది. అమీన్‌పూర్‌ తహసీల్దార్‌, హైడ్రా కమిషనర్‌ తీరు అసంతృప్తికరమని చెప్పింది.

హైకోర్టు సీరియస్‌ వార్నింగ్‌ల తర్వాత హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక ప్రకటన చేశారు. మూసీ సుందరీకరణ కోసం నదికి ఇరు వైపులా సర్వేలతో, మార్కింగ్‌ తో హైడ్రాకు సంబంధం లేదన్నారు. అసలు మూసీ సుందరీకరణతో తమకు సంబంధం లేదని దానిని మూసీ రిఫవర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేపడుతున్నదని వెల్లడించారు. మీ పరిధిలో లేనప్పుడు చీటికిమాటికి మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు ఎందుకు చేశారు? కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకునే సమయం కూడా ఇవ్వమని ఎందుకు చెప్పారు? నోడల్‌ ఏజెన్నీ కింద ఉన్న హైడ్రా చట్టబద్ధతపై హైకోర్టు ప్రశ్నిస్తున్నప్పుడైనా మౌనంగా ఉండకుండా హడావుడి ఎందుకు చేశారన్న ప్రశ్నలకు రంగనాథ్‌ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బుల్డోజర్‌ న్యాయంపై 'వచ్చే విచారణ వరకు మీ చర్యలను ఆపమని కోరితే మేం కోరినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు' అన్న సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్‌ అనడంపై విమర్శలు వచ్చాయి.

రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రానా అక్రమంగా ముందుకు వెళ్లొద్దని మొట్టికాయలు వేసింది. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారని, ఇల్లు కూల్చే ముందు చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా? అని ప్రశ్నించింది. అంతేకాదు కోర్టు అడిగిన ప్రశ్నలకే జవాబు చెప్పాలని సూచించింది. కూల్చివేతకు యంత్రాలు సిబ్బందిని కోరడంతో సమకూర్చమనడాన్ని కోర్టు తప్పుపట్టింది. చార్మినార్‌ కూల్చివేతకు తహశీల్దార్‌ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని నిలదీసింది. కూల్చివేయవద్దని కోర్టులు స్టే విధించిన విషయం, ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని ఐపీఎస్‌ అధికారికి తెలియదని అనుకోలేం. అందుకే అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళ్తారు జాగ్రత్తా అని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం హైడ్రోకు ఎన్నో విధులున్నాయని.. మిగతావి పట్టించుకోకుండా కేవలం కూల్చివేతలపై దృష్టి సారించడానికి కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ట్రాఫిక్‌ సమస్యపైనా హైడ్రాకు బాధ్యత ఉన్నదనే విషయాన్ని కోర్టు చెప్పింది. అంతేకాదు ఒక్కరోజులోనే హైదరాబాద్‌ మార్చాలనడం సరికాదన్నది. అలాగే జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రేవంత్‌ పరిధిలోనే హోం శాఖ ఉన్నది. ఆ శాఖ పనితీరు అస్తవ్యస్తంగా ఉన్నది. అధికారులు కోరారని కూల్చివేస్తామని, ప్రభుత్వ పెద్దలు చెప్పారని బుల్డోజర్‌ న్యాయం చేస్తామంటే ఇబ్బందులు పడేది ఎవరు అన్నది ఇవాళ హైకోర్టు స్పష్టం చేసింది.

రేవంత్‌ సర్కార్‌ బుల్డోజర్‌ చర్యలపై ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనను మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సోదరుడి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ కూల్చివేతపై కడిగిపారేసిందని సమాచారం. కానీ బైటికి వచ్చి అధిష్ఠానం ఆమోదం ఉన్నదని ప్రచారం చేసుకున్నారు. హైడ్రాపై హైకోర్టు సీరియస్‌ అయిన నేపథ్యంలో మరోసారి సీఎం ఢిల్లీకి వెళ్లారు. కూల్చివేతలు, కోర్టు అక్షింతలు, రేవంత్‌ వైఖరిపై సొంత పార్టీ నేతల ఫిర్యాదులకు వివరణ ఇవ్వడానికేనని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తానని బీరాలు పలికిన సీఎం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చే చర్యలు చేపడుతున్నారనే వాదనలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఒకే రోజు శ్రీవారి నెయ్యి కల్తీ విషయంలో సీఎం గురువు సారీ సహచరుడు చంద్రబాబుకు సుప్రీంకోర్టు, కూల్చివేతలపై రేవంత్‌ సర్కార్‌కు హైకోర్టు షాక్‌ ఇచ్చే తీర్పులు ఇవ్వడం గమనార్హం.

First Published:  1 Oct 2024 7:56 AM GMT
Next Story