రాజధాని, సూపర్ సిక్స్ పథకాల సంగతేమిటి?
రాజధాని అంశం, సూపర్ సిక్స్ హామీల కంటే ఇతర అంశాలే ముందుకు రావడంతో ఆందోళనకు గురవుతున్నఏపీ ప్రజలు
తిరుమల లడ్డూ కల్తీ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులను కలిచివేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని అందరూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం కూడా సనాతన ధర్మంపై దాడి జరుగుతుంటే సగటు హిందువులంతా రోడ్లపై రావాలని మేము కోరడం లేదన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా మీకు కోపం కూడా రావడం లేదా? గుడికి వెళ్లే హిందువు బాధ్యత కాదా? నా ఒక్కడి బాధ్యతేనా? ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత మీది కాదా? అని ఆయన ప్రశ్నించడంలో న్యాయం ఉన్నది. అయితే దీనితోపాటు ఆంధ్రుల ఆత్మగౌరవం అంతకంటే ముఖ్యం కాదా? మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ అవహేళనకు గురై ఆంధ్రులకు ఒక రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే కర్నూలు రాజధానిగా అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై ఏర్పాటుపై కేంద్రం ఏర్పాటు చేసిన వాంఛూ కమిషన్ వ్యతిరేకించినా పొట్టి శ్రీరాములు ఆమరణ నిరహార దీక్ష ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం అది. అంతేకాదు దేశంలో ఏర్పడిన మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమూ అదే. అలాగే అదే స్థాయిలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం ముందుండి నడిపించాడు. మరి ఏది నాటి ఆత్మగౌరవం?
దేశంలో 28 రాష్ట్రాలుంటే రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అక్కడి సగటు ప్రజల ఆవేదన. ఒప్పందాలపై ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లంఘనల కారణంగా తెలంగాణ ప్రజలు సుదీర్ఘ కాలం పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రాంతాలుగా విడిపోదాం. మనుషులుగా కలిసుందాం అని ఉద్యమ నాయకత్వం ఇచ్చిన పిలుపును పదేళ్ల కాలంలో పాలనలోనూ అదే చూపెట్టారు. విడిపోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయడానికి నాటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా అనేక హామీలు ఇచ్చింది. పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్నది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను అన్నది. అలాగే పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అప్పటిలోగా ఏపీకి రాజధాని నిర్మాణానికి అవసరమైన అన్నిరకాల సహాయాలు అందిస్తామన్నది. అలాగే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని వాగ్దానం చేసింది. 2014లో యూపీఏ ప్రభుత్వం పోయి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ఉత్తచేతులతో వచ్చి చెంబెడు నీళ్లు, పిడికెడు మట్టి తెచ్చి నాటి ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీకి మాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. అలాగే విభజనపై అప్పుడప్పుడు తన అక్కసును వెళ్లగక్కారే తప్పా ఏపికి ఎట్లా న్యాయం చేయాలన్నది ఎన్నడూ ఆలోచించలేదు.
ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వమే ఉన్నది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ టీడీపీ ప్రధాన పాత్ర పోషించింది. అయినా రాజధాని అంశం, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల కంటే ఇతర అంశాలే ముందుకు రావడం అక్కడి సగటు ఆంధ్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కూటమి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదంటూ... థాలీ బజావో పేరుతో విజయవాడ ధర్నా చౌక్‌లో ఆమె నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు పథకాల అమలులో విఫలమయ్యారని ఆమె ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఇప్పుడు వారు కూడా మోసం చేస్తున్నారంటూ విమర్శించారు.
అందుకే రానున్న ఐదేళ్ల కాలంలోనైనా తమ రాజధాని కల నెరవేరుతుందా? అనే అనుమానాలు వారిలో కలుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో ముస్లింలు, పాతబస్తి, రోహింగ్యాలు వంటి నినాదాలతోనే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను ముందు సనాతన ధర్మం, హిందుత్వం వంటి అంశాలను తెరమీదికి తెచ్చింది. చెగువేరా రచనలు, గద్దర్ పాటలతో ప్రభావితమయ్యాను అని చెప్పుకున్న పవన్ కల్యాణ్ ఉన్నపళంగా చాలామందికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లా కనిపిస్తున్నారు. ఏపీలో కుల రాజకీయాలు ఉంటాయి కానీ మత రాజకీయాలకు చోటు లేదు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణమాలను చూస్తే రానున్న రోజుల్లో అక్కడ మత రాజకీయాలే ముందు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది పవన్ రూపంలోనో లేదా మరో రూపంలోనూ వచ్చి అనేక అంశాలను మరుగునపడేయవచ్చు. విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవం అంటూ ప్రసంగాలు దంచినవాళ్లకు ఇప్పుడు అవేవీ కనిపించకపోవడమే ఇప్పటి విషాదం. మరో ఐదేళ్ల తర్వాత అయినా ఏపీ ప్రజలకు ఇది మా రాజధాని అని చెప్పుకునేలా కూటమి ప్రభుత్వం చేస్తుందా? లేదా అన్నది చూడాలి.