విలోమ రీతిలో చరిత్రను మలుపు తిప్పిన గోర్బచేవ్
ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన నాయకుడిగా గోర్బచెవ్ ను పశ్చిమ దేశాలు అప్పుడూ స్తుతించాయి. మరణానంతరమూ పొగుడ్తూనే ఉన్నాయి. ఏ యుద్ధానికైన ముగింపు పలికితే సంతోషించవలసిందే.
ఎవరి మరణమైనా విషాదమే. సోవియట్ యూనియన్ ఆఖరి అధ్యక్షుడు మైఖైల్ సెర్జియేవిచ్ గోర్బచెవ్ 91వ ఏట మంగళవారం రాత్రి మరణించారు. మునుపటి సోవియట్ వ్యవస్థలో 1985లో అధ్యక్ష స్థానాన్ని అధిష్టించిన గోర్బచేవ్ 1991లో పదవీ విరమణ చేసే నాటికి సోవియట్ యూనియన్ నామ రూపాలు లేకుండా పోయింది.
ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన నాయకుడిగా గోర్బచెవ్ ను పశ్చిమ దేశాలు అప్పుడూ స్తుతించాయి. మరణానంతరమూ పొగుడ్తూనే ఉన్నాయి. ఏ యుద్ధానికైన ముగింపు పలికితే సంతోషించవలసిందే. యుద్ధం ముగించడానికి రెండు పద్ధతులు ఉంటాయి. మొదటిది విజయం సాధించి యుద్ధం ముగించడం. రెండవది ప్రత్యర్థికి లొంగి పోవడం. అంటే పోరాడలేక రణరంగంలోంచి తప్పుకోవడానికి తెల్ల జెండా ఎగరేయడం కాదు. శత్రువుతో మిలాఖతై పోయి కూడా యుద్ధం ముగించవచ్చు. గోర్బచేవ్ రెండో పద్ధతి అనుసరించి "కీర్తిమంతుడు" అయ్యాడు.
గోర్బచేవ్ చరిత్ర గతిని మార్చాడంటారు. చరిత్రను కూడా రెండు విధాలుగా మార్చొచ్చు. ఒకటి సమాజాన్ని పురోగమన దిశగా నడపడం. రెండు: సమాజాన్ని తిరోగమించేట్టు చేయడం. గోర్బచేవ్ రెండో పనిచేసి చరిత్రను మలుపు తిప్పాడు. ఆయన చరిత్ర గతి మార్చిన పద్ధతి సోవియట్ పతనానికి దారి తీసింది. తూర్పు యూరప్ లోని సోషలిస్టు దుర్గం కూడా సోవియట్ పతనంతో ముక్కలైంది. ఎన్నటికైనా మానవ జాతి పురోభివృద్ధికి పూచీ పడగలిగే సత్తా ఉన్న ఏకైక వ్యవస్థ-కమ్యూనిజం, దానితో పాటు ఆ వ్యవస్థకు పునాది అయిన మార్క్సిజం లెనినిజం కూడా అంతరించి పోయాయన్ని నిర్ధారణలకు రావడానికి కావలసిన పూర్వ రంగాన్ని ఏర్పాటు చేసింది గోర్బచేవ్.
ఆయన పశ్చిమ దేశాల మన్ననలు పొందాడు. శత్రు శిబిరం నుంచి పొగడ్తలు అందుకోవడానికి వారికి ప్రీతిపాత్రమైన పనులు చేయడమే ప్రధాన కారణం అవుతుంది. ఆయనను పొగడ్తున్నది సోవియట్ యూనియన్ నో లేదా ఆ తరవాత ముక్క చెక్కలైన ప్రపంచంలోని ఆరో వంతు భూభాగంలో ప్రజల బతుకులు బాగు పరిచినందుకో కాదు. పతనం తరవాత సోవియట్ యూనియన్ భౌగోళికంగా, రాజకీయంగా మాత్రమే అస్తిత్వం కోల్పోలేదు. ఆర్థిక, సాంకేతిక రంగాలలోనూ కుదేలైపోయింది. గోర్బచేవ్ ప్రతిపాదించిన పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం), గ్లాస్ నస్త్ (దాపరికం లేని విధానం) సోవియట్ యూనియన్ ను పేదరికంలోకి నెట్టింది. ప్రజలు ఆకలికి అలమటించి పోయారు. అంతకు ముందు కూడు, గూడు, విద్య, వైద్యానికి ఉన్న హామీ అమాంతం మటుమాయమైంది. సోవియట్ కు ఉన్న అగ్ర రాజ్య హోదా పోయి మూడు దశాబ్దాలుగా అమెరికా ఒకే అగ్ర రాజ్యంగా మిగిలిపోయింది. గోర్బచేవ్ సంస్కరణలు శత్రువును బలోపేతం చేశాయి.
ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం అంతరించేలా చేశాడని గోర్బచేవ్ కీర్తి గానంలో తలమునకలై ఉన్న వారు ఏకైక అగ్రరాజ్యం దాష్టీకాన్ని మౌనంగా భరించవలసి వస్తున్న దుస్థితిని అర్థం చేసుకోలేక పోతున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్ తో అణ్వస్త్ర ఒప్పందం కుదుర్చుకుని గోర్బచేవ్ ప్రపంచ శాంతికి దోహదం చేశాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఒప్పందంవల్లే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం కోసం బ్రెజ్ఞేవ్ హయాంలోనే ముమ్మర ప్రయత్నాలు మొదలైనాయి. అప్పటి సోవియట్ యూనియన్ ఏకపక్షంగా అణ్వస్త్ర నిలవలను తగ్గించుకుంది. గోర్బచేవ్ చేసింది ఆ క్రమాన్ని శత్రువుకు అనుకూలమైన రీతిలో రీగన్ తో ఒప్పందానికి రావడమే. శత్రువు చేతిలో ఉన్న ఆయుధం వదలక పోయినా గోర్బచేవ్ సోవియట్ అస్త్ర సన్యాసం చేశాడు.
సోవియట్ పతనం ఓ మహా విషాదం. దానికి ప్రధాన కారకుడు గోర్బచేవ్. సోవియట్ రాజకీయాలను మెచ్చని వారూ ఈ పతనాన్ని స్వాగతించలేదు. అమెరికా ఆడిందల్లా సాగాలని భావించలేదు. సోవియట్ పతనం శిథిలాల నుంచి పేదరికం మహా భూతంలా వికృత రూపంలో వికటాట్టహాసం చేసింది. గోర్బచేవ్ ప్రతిపాదించిన గ్లాస్ నస్త్ (దాపరికం లేని విధానం) కమ్యూనిస్టు పార్టీని, రాజ్య వ్యవస్థను ప్రశ్నించే హక్కు కల్పించిన మాట వాస్తవమే. ఇలాంటి పరిణామాలను హర్షించవలసిందే. కానీ ప్రశ్నించే హక్కు, దాపరికంలేని తత్వం మునుపటి సోవియట్ యూనియన్ లో అంతర్భాగాలుగా ఉన్న రిపబ్లిక్కులు విడిపోవడానికే ఉపకరించాయి. పశ్చిమ దేశాల అసలు లక్ష్యం గోర్బచేవ్ పుణ్యమా అని నెరవేరింది. చరిత్ర లిఖించడానికి గోర్బచేవ్ కలం తిరగేసి రాశాడు.