సబ్బండ వర్గాలు ఉద్యమంలో.. సంచులు మోసే పనిలో రేవంత్!
ఉద్యమకారులపైకి తుపాకీతో బయల్దేరిన చరిత్రను చాటి చెప్పాల్సిందే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఉన్నది చీకటి అధ్యాయాలే..! సమైక్యవాదుల అడుగులకు మడుగులొత్తడం.. వాళ్ల సంచులు మోయడంలో ఆయన నేర్పరి. తెలంగాణ స్వరాష్ట్రంగా సిద్ధించిన తర్వాత కూడా ఆయన సంచులు మోసే పని మానలేదు. తెలంగాణ ఉద్యమ ఖిల్లా కరీంనగర్ ఉద్యమకారులపైకి తుపాకీతో బయల్దేరిన రేవంత్ రెడ్డి చరిత్రను రాబోయే తరాలకు తప్పనిసరిగా చాటి చెప్పాల్సిన సందర్భాన్ని శుక్రవారం సాయంత్రం ఆయనే గుర్తు చేశారు. అవును తెలంగాణ ఉద్యమం అంటే ఒక్క కుటుంబం చరిత్ర మాత్రమే కాదు.. రేవంత్ రెడ్డి ఏ వేదికపై మాట్లాడినా నిజాలే చెప్తానని అనుకుంటారు.. రాష్ట్ర ప్రజలంతా అదే భ్రమలో తాను చెప్పే విషయాన్ని వింటారని అనుకుంటారు. తెలంగాణ ఉద్యమం అంటే ఒక్క కుటుంబం చరిత్ర ఎంతమాత్రం కాదు. మూడు కోట్ల తెలంగాణ సమాజాన్ని తమ కుటుంబంగా చేసుకొని కేసీఆర్ సాగించిన పోరాటం. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం తాలుఖు విషాద జ్ఞాపకం రాష్ట్ర అసెంబ్లీ ముందు ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. జై తెలంగాణ అని నినదించిన 369 మంది తెలంగాణ బిడ్డలను అత్యంత కర్కషంగా తుపాకుల కాల్చిచంపిన ఇందిరాగాంధీ పార్టీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మలిదశ ఉద్యమంలో.. ''మీ మనస్సుల్లో ఏముందో తెలుసు.. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని చేర్చాం.. మీ ఆకాంక్షను నెరవేరుస్తాం..'' అని సోనియాగాంధీ మాట ఇచ్చి తప్పడంతో 1,200 మందికి పైగా యువత, విద్యార్థులు, తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదాలనాలు చేసుకున్న కన్నీటి తడికి మరో సజీవ సాక్ష్యం సెక్రటేరియట్ కు ఎదురుగా అమరజ్యోతి రూపంలో కనిపిస్తున్నది.
1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా అణచివేసింది. విద్యార్థుల నెత్తురుతో జై తెలంగాణ అనే నినాదమే మళ్లీ ఇంకెవరూ లేవనెత్తదని అనుకున్నది. 1990లలో తెలంగాణ జనసభ ఈ గడ్డకు జరుగుతోన్న అన్యాయాలపై గళమెత్తింది. గజ్జకట్టి జాగురూకం చేసింది. జనసభ నాయకత్వం నక్సలైట్ నాయకత్వమని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వారిని బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో మట్టుబెట్టింది. బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా నరికింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనో ఫలోకాల్లో నిక్షిప్తమయ్యే ఉన్నది. తొలి దశ తెలంగాణ ఉద్యమం.. జనసభ అందించిన భావజాల వ్యాప్తి ఉద్యమం పునాదులుగా 2001లో గులాబీ జెండా చేతబట్టుకొని కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఒక్కడిగా బయల్దేరారు. డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గాంధేయ మార్గంలో తెలంగాణ ఉద్యమ శంఖం పూరించారు. 1969లో జరిగిన ద్రోహం.. జనసభ పేరుతో గళమెత్తిన వారి కుత్తులను తెగనరికిన ప్రభుత్వాల రాక్షసత్వం తెలంగాణ ప్రజల మదిలో అనేకానేక అనుమానాలు, అపోహలను రేకెత్తించింది. అయినా కేసీఆర్ ఎత్తిన జెండా దించలేదు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశారు. వెన్నుపోట్లు.. కుట్రలు.. ద్రోహాలు సరేసరి.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ రాజకీయ పోరాట పంథా ఎంచుకున్న తర్వాత బీజేపీని వీడి ఆలె నరేంద్ర, విజయశాంతి లాంటి వారు వచ్చి గులాబీ పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించిన మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ ప్రత్యేక రాజకీయ పార్టీ స్థాపించి తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉన్నది. ఆయనను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆయన రచించిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి తప్పనిసరిగా చర్చించుకొని తీరాలే. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాల్గొనలేదు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఇటీవల ఢిల్లీలో నేషనల్ మీడియా చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను కేసీఆర్ పార్టీలో పని చేయలేదని.. కేసీఆర్ కు ఫైనాన్స్ చేశానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. తద్వారా తానేప్పుడు టీఆర్‌ఎస్ లో చేరలేదని, ఆ పార్టీ సభ్యుడిగా పని చేయలేదని చెప్పుకోవడానికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు జడిసి అప్పటి యూపీఏ -2 ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తెల్లారే రేవంత్ రెడ్డి మెంటార్ చంద్రబాబు ప్రోద్బలంతో సీమాంధ్ర ప్రాంత నాయకులు పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో లైన్ కట్టి స్పీకర్ కు రాజీనామాలు సమర్పించారు. దీంతో కేంద్రం తెలంగాణ ప్రకటన నుంచి వెనక్కి తగ్గింది. అప్పుడు సభలో టీఆర్‌ఎస్ సభ్యులుగా ఉన్న పది మందికి తోడు నిజామాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన యెండెల లక్ష్మీనారాయణ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తలపడి విజయం సాధించారు. ఆ రోజు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా సమైక్యవాది చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి రేవంత్ రెడ్డి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు అంటూ ఉండరు. దేవేందర్ గౌడ్ తర్వాత మళ్లీ టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున ఆరేళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2001లో కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తుకున్న తర్వాత ఈ గడ్డపై రాజకీయ ప్రాతినిథ్యం కోరుకునే ఒక్క సీపీఎం మినహా మిగతా అన్ని పార్టీలతో జై తెలంగాణ అనిపించారు. తెలంగాణ సాధన తప్ప తనకు ఇంకే ఎక్కువ కాదని పలుమార్లు పదవులకు రాజీనామా చేసి ప్రజాతీర్పును కోరారు. ఆయన కుటుంబ సభ్యులుగా హరీశ్ రావు, కేటీఆర్, కవిత తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రజలు ఎన్నుకుంటేనే చట్ట సభల్లో అడుగు పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకే కాదు కవులు, కళాకారులు, మేధావులు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, కార్మికులు, కర్షకులు సహా కోట్లాది మంది పాలు పంచుకున్నారు. అందుకే.. అది మిలియన్ మార్చ్ అయినా.. సాగర హారమైనా.. రైల్ రోకో అయినా.. సకల జనుల సమ్మె అయినా.. ధూం ధాం అయినా ఉద్యమాన్ని ఈ గడ్డ ప్రజలు తమ భుజాలకెత్తుకొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సకల జనులు, సబ్బండ వర్గాలు ఉద్యమంలో ఉన్నప్పుడు సమైక్యవాదుల సంచులు మోసిన రేవంత్ రెడ్డిది మొత్తం చీకటి అధ్యయమే. తనకంటూ ఉద్యమ ప్రస్థానం లేదు కాబట్టి ఉద్యమంలో ఉన్నోళ్ల చరిత్రను తగ్గించాలనుకోవడం సూర్యుడిపై ఉమ్మేసే ప్రయత్నమే. ఈ వాస్తవం రేవంత్ రెడ్డికి బోధపడే రోజు ఎంతోదూరంలో లేదు!!