టీ కాంగ్రెస్ కకావికలం!
పార్టీ ఒక దిక్కు.. ప్రభుత్వం ఇంకో దిక్కు.. ఇప్పటికే సీఎం నిర్ణయాలపై హై కమాండ్ గుర్రు
తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం చెలరేగింది. అనేక అంశాల్లో పార్టీకి ప్రభుత్వానికి పురి కలుస్తలేదు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతోందని పార్టీ హై కమాండ్ గుర్రుగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం ప్రభుత్వం నిర్ణయాలను సమర్థించే ప్రయత్నం చేస్తూనే తేడా వస్తే పార్టీ కి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో నేతల మధ్య భేదాభిప్రాయాలు సహజమే. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర లోనే మొదటిసారి ప్రభుత్వ నిర్ణయాలు పార్టీకి అపాదించొద్దు.. అవన్నీ సీఎం సొంత ఆలోచనలు అనే రీతిలో పార్టీ నేతలు కామెంట్స్ చేయడం కలకలం సృష్టిస్తోంది.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు చూస్తే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉన్నట్టు స్పష్టమవుతున్నది. పార్టీతో సంబంధం లేకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో హత్యకు గురైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి కుటుంబాన్ని విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి ఆయన పరామర్శించారు. ఫిరాయింపులపై జీవన్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు. పార్టీ మారిన వారికి కాంగ్రెస్ పార్టీపై ప్రేమలేదని, వారి ఆస్తులు కాపాడుకోవడానికే పార్టీ మారారు అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌లు పదే పదే రేవంత్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే స్వయంగా పార్టీ మారేందుకు వచ్చిన కొందరు ఎమ్మెల్యేలను చేర్చుకున్నామన్నారు. పీఏసీ ఛైర్మన్ ప్రతిపక్షానికే ఇచ్చామని సీఎం రేవంత్, అరికెపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డిల మధ్య సవాళ్ల పై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపక్ష ఎమ్మెల్యే గొడవతో మాకేం సంబంధం అన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు అని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీనికి సీఎం, మంత్రి, ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు పక్కననే కూర్చున్న ఇద్దరు విప్‌లు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఉందని.. కేంద్రంలో అధికారంలోకి రాగానే చట్టాన్ని సవరించి అమలు చేస్తామన్నారు. అసలు ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యా బలం ఉందని, సీపీఐ, ఎంఐఎం సభ్యులతో కలిపి ఆ సంఖ్య 74కు చేరిందని మొన్ననే జీవన్‌రెడ్డి అన్నారు. ఒకవేళ బీఆర్‌ఎస్, బీజేపీ కలిసినా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వెంటనే అనర్హత వేటు వేయాలన్నారు.
ఫిరాయింపులపై ఈ ఇద్దరు నేతలు చేసిన కామెంట్లు చూస్తే రేవంత్ రెడ్డి వ్యక్తిగత అజెండాలో భాగంగానే పార్టీ ఫిరాయింపులును ప్రోత్సహిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనే పార్టీలోకి ఆహ్వానించారు. వాళ్లలో ఒకరిద్దరికి మంత్రి పదవులు కూడా ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అలాగే మిగతా వారికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని అభయహస్తం ఇచ్చారు. కానీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్‌ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనమౌతుందనే ప్రకటనలు ఆచరణలో సాధ్యం కాకపోవడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలో మెజారిటీ ఆత్మరక్షణలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి (ఫిరాయింపు ఎమ్మెల్యేల ముఠా నాయకుడు అని జీవన్ రెడ్డి ఆరోపించారు) ఇంట్లో భేటీకి సీఎం వచ్చి వారికి భరోసా ఇచ్చినా కొందరు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కారణం పార్టీ మారిన తర్వాత వాళ్ల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారడమే అందుకు కారణం. గద్వాల, జగిత్యాల, చేవెళ్ల లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే వీరికి నిరసన వ్యక్తమైంది.
ఇక పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిణామాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన చోట వాళ్లనూ గౌరవించుకోవాలన్నారు. అయితే క్యాడర్‌లో పాత, కొత్త కలయిక మధ్య కొంత ఇబ్బంది వస్తున్నదన్నారు. సయోధ్య కుదర్చడానికి యత్నిస్తున్నామన్నారు. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో విభేదాలు ఉన్నాయని సాక్షాత్తూ పీసీసీ అధ్యక్షుడే అంగీకరించారు. ఇప్పుడు వారిపై అనర్హత పిటిషన్ అంశంపై హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి కీలక ఆదేశాలు ఇచ్చింది. నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆయన టేబుల్‌పై అనర్హత పిటిషన్లను పెట్టాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సీజే ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దీనిపై వాదనలు వినిపించడానికి అడ్వకేట్ జనరల్ సమయం కోరడంతో నవంబర్ 4కు వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో జరుగుతున్న పరిణామాల చూసిన తర్వాత ఇప్పటికే సీఎం, కొందరు మంత్రులు మాట మార్చారు. జీవన్‌రెడ్డి, మధుయాష్కీ లాంటి వాళ్లు కూడా వాళ్లు మాకు అవసరం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజవర్గాల్లో సయోధ్య సాధ్యం కాదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసుకుంటూ... కొత్త, పాత నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. అందుకే ఆయన దీనిపై ఆచితూచి మాట్లాడుతూ.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతల మాటలు చూసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. పొమ్మనలేక పొగపెడుతున్నారా? అనే అనుమానం వ్యక్తమౌతున్నది. అందుకే కొన్నిరోజులుగా వాళ్లు మీడియా ముందు పెద్దగా మాట్లాడటం లేదు.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో చేపట్టిన చర్యలు వివాదాస్పదమౌతున్నాయి. నిర్వాసితులు, విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతుండగా.. సొంత పార్టీ నేతల్లోనూ భిన్నాభిప్రాయం వ్యక్తమౌతున్నది. ముఖ్యంగా ఈ సుందరీకరణ, పునరుజ్జీవానికి ప్రభుత్వం చెబుతున్న రూ. 50 వేలు, 70 వేల, లక్షా 50 వేల కోట్ల మాటలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. సీఎం నాలుక మడతేసీ నేనెప్పుడు అన్నానని బుకాయించారు. నిర్వాసితుల నుంచి తిరుగుబాటు రావడంతో ముఖ్యమంత్రి మాట మార్చారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల కోట్లు అవుతుందేమోనన్నది తన వ్యక్తిగత అంచనా అని పీసీసీ అధ్యక్షులు అన్నారు. ఒకే పార్టీలోనే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ఇన్ని మాటలు వస్తున్నాయి. అందుకే విపక్షాలు మూసీ పేరుతో లూటీ చేయాలని సీఎం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహానికి కారణమైన జీవో 29 అంశంపై గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమైన రోజే సుప్రీంకోర్టులో ఈ అంశంపై జోక్యం చేసుకోలేమంటూనే హైకోర్టును నవంబర్ 20లో తుది తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. అక్కడ అన్యాయం జరిగిందని భావిస్తే సుప్రీంకోర్టు రావాలని పిటిషనర్లకు సూచించింది. ఈ తీర్పుకు ముందు, తర్వాత జీవో 29తో ఏ రిజర్వేషన్లకు నష్టం కలుగదని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. ఇదే అంశంపై నిన్న మాట్లాడుతూ.. ఈ జీవో కారనంగా ఏ రిజర్వేషన్ల నష్టం జరగదని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి, ఇతర అధికారులు చెప్పారు. ఒకవేళ అధికారులు మాకు అబద్ధాలు చెప్పినట్లు తేలితే రేపు వారి పీక పట్టుకుంటామన్నారు. ఈ జీవో వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు నష్టం జరుగుతున్నదని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఆధారాలతో సహా ఇప్పటికే వెల్లడించారు. హైకోర్టులో ఈ అంశంపై బలమైన వాదనలు వినిపిస్తామని కేటీఆర్ చెప్పారు. గ్రూప్-1పై హైకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగా వస్తుందనే నమ్మకం మాకుందన్నారు. తాజాగా జీవో 29పై పీసీసీ అధ్యక్షుడి మాటలు చూస్తే ఏదో తేడా కొడుతున్నదని అనిపిస్తున్నది.