కాంగ్రెస్ బలపడటం దేశానికి అనివార్య అవసరం
జాతీయత పేరుతో దేశభక్తి కొంగజపం చేస్తున్న బిజెపి విధానాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయి. చేయడానికి పనుల్లేక అర్ధాకలితో అలమటించే వారికి బిజెపి బూటకపు జాతీయతా నినాదాలు ఒరగబెట్టేదేమీ లేదు. కనుకనే ఆర్థిక, రాజకీయ రంగాలలో జనం కోసం కాంగ్రెస్ ఏం చేయబోతున్నదో నిర్దిష్టంగా, కచ్చితంగా చెప్పాలి. తద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి, నిజమైన జాతీయతావాదానికి బలం చేకూరుతుంది.
''స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ దాస్యం నుంచి విముక్తి మాత్రమే కాదు. ఆర్థిక పరాధీనత నుంచి కూడా విముక్తి లభించాలి. స్వాతంత్య్రం ప్రజానీకపు సంక్షేమంగా రూపొందాలి. ఆర్థిక విముక్తి లేని రాజకీయ విముక్తి అర్థరహితమని నెహ్రూ భావన'' అని చెబుతారు ప్రఖ్యాత జర్నలిస్టు ఫ్రాంక్ మొరేస్. స్వాతంత్య్ర సమరకాలంలో తను ప్రవచించిన ఈ సూత్రానికి అనుగుణంగానే దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల రూపకల్పనకు పునాదులు వేశారు నెహ్రూ. ఇవాళ అందుకు విరుద్ధంగా సకల రంగాలలో ఒకరిద్దరు వ్యక్తుల గుత్తాధిపత్యానికి అనువుగా ఆర్థిక వ్యవస్థని కుదించడం దేశానికి వినాశకరం. ప్రజల భవితవ్యానికి పెను విఘాతం. ఆర్థిక పరాధీనత నుంచి ప్రజలకు విముక్తి లభించాలని నెహ్రూ ఆశించారు. ఇందుకు భిన్నంగా పేదల్ని మరింత పేదలుగా పరిమార్చే ప్రతికూల ధోరణిని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తుంది. దీనిని ప్రతిఘటించాల్సిన కాంగ్రెస్ అస్తిత్వమే ప్రమాదంలో పడటం విషాదం. ఈ విషాదకర స్థితి కాంగ్రెస్‌కీ, గాంధీ, నెహ్రూ కుటుంబానికి సంబంధించిందిగా చూడకూడదు. ఇది మొత్తం దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల పాలిటి విపరిణామం.
నెహ్రూ చెప్పిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి ముప్పయ్యేళ్ళ కిందటనే కాంగ్రెస్ తప్పుకున్న మాట వాస్తవమే గానీ ఆర్థిక వ్యవస్థని నడిపించటంలో ప్రభుత్వానిది ప్రేక్షక పాత్రగా భావించలేదు. ఉదారవాద ఆర్థిక విధానాలని అనుసరించడంలోనూ ఒక పద్ధతి, ప్రజా సంక్షేమ దృష్టి. ఎక్కడ, ఏ మేరకు ప్రైవేటీకరణ అవసరమో యోచించే, చర్చించే లక్షణం వ్యక్తమైంది. కానీ ఇవాళ ఆర్థికరంగం అంబానీ, అదానీల ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందే ధోరణి పెచ్చరిల్లింది. ప్రధాని నరేంద్ర మోదీ అండదండలతో వీరి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు జరగడం శోచనీయం. దేశ ప్రజల కొనుగోలు శక్తినీ, జీవన ప్రమాణాల స్థాయినీ దిగజార్చే ప్రమాదకర క్రీడని ఆర్థిక రంగాన బిజెపి ఆడుతుంది.
ఈ విధంగా నెహ్రూ స్వప్నాలకు భిన్నంగా వ్యవహరిస్తూనే చరిత్రలో నెహ్రూ స్థానాన్ని తుడిచిపెట్టడానికి అబద్ధాల ప్రచారంతో చెలరేగుతుంది బిజెపి పాలకవర్గం. 'ఉచితాల' మీద చర్చ, రిజర్వేషన్ల మీద చర్చ, జిఎస్‌టి పేరిట రాష్ట్రాల ఆదాయానికి గండికొట్టే విధానాల సరళి ఆర్థికరంగంలో బిజెపి దాష్టీకానికి నిదర్శనం. ప్రజలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాల కల్పన బాధ్యత ప్రభుత్వాలదే. ఏ దేశంలోనైనా ఈ రంగాలలో ప్రజల క్షేమానికి అనుగుణమైన విధానాల్ని అనుసరిస్తుంటే ఉచితాల నెపంతో బాధ్యతల్నించి తప్పుకోవాలని బిజెపి పాలకులు భావించడం ఘోరం.
ఈ నేపథ్యంలోనే నెహ్రూ ఆదర్శాల, స్వప్నాల, విధానాల ప్రాసంగికతని తెలియజెబుతూ ముందుకు సాగాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణుల మీద ఉంది. దీనికి భిన్నంగా ఉనికి కోసం పోరాడే స్థితికి ఆ పార్టీ నెట్టబడటం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు చేటు. కాంగ్రెస్‌లో రాజీనామాల పరంపరని మీడియా ఆ పార్టీ పునాదులే కూలిపోతున్నాయన్న రీతిలో ప్రచారంలో పెట్టింది. మీడియా వ్యవస్థ మొత్తం కాషాయ పాలకుల కనుసన్నలలో పనిచేయడం తప్పనిసరయిన స్థితిలోకి నెట్టబడినది. ఎన్‌డిటివిని తమ సొంతం చేసుకోడానికి అదానీ గ్రూప్ వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. తటస్థంగా ఉండే పరిస్థితి సైతం మీడియాకు లేదు. కాషాయ పాలకులకు తందానా అంటే తప్ప మనలేని స్థితికి మీడియా నెట్టబడినది. కనుక కాంగ్రెస్ మీద ఇకముందు కూడా విషప్రచారం ముమ్మరం అవుతుంది. మరీ ముఖ్యంగా రాహూల్‌గాంధీ మీద విషం జల్లడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని, నాయకత్వ పటిమని పలుచన చేయడానికి మీడియా చేయకూడని పనులు కూడా చేస్తుంది.
ఎందరో రాజీనామాలు చేస్తున్నప్పటికీ, పార్టీలో అసంతృప్తులున్నప్పటికీ కాంగ్రెస్‌లో సకల వర్గాలని సమన్వయపరిచే వ్యక్తిగా రాహుల్ గాంధీ ఉన్నారు. కాంగ్రెస్‌లో కొనసాగాలనుకునే వారు ఆయన నాయకత్వాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. దీనిని దెబ్బ తీయడం కోసం బిజెపి శతవిధాలా దాడులు చేస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ మీద, ప్రత్యేకించి రాహుల్ మీద మీడియా దాడి పెరుగుతుంది. గులాం నబీ అజాద్ రాజీనామా పైన విపరీతమైన చర్చ సైతం ఈ దాడిలో అంతర్భాగం. ఆయనకు మరోసారి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చివుంటే పార్టీ నుంచి రాజీనామా చేయకపోయేవారు. కపిల్ సిబాల్ కూడా పదవి కోసమే పార్టీ మారారన్నది వాస్తవం. దశాబ్దాలుగా పార్టీ అండతో అధికారం అనుభవించిన వారే పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం గమనార్హం.
ఈ పరిస్థితుల నడుమనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి తుది నిర్ణయం జరిగింది. పోటీలో ఎవరు నిలబడుతారో, చివరకు ఎవరు అధ్యక్షులు అవుతారో అక్టోబర్ 17 నాటికి తేలుతుంది. ఇదంతా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఈ లోగా పార్టీ యంత్రాంగం, నిర్మాణం సమీకృతం కావటం, బలపడటం అవసరం. ఆయా రాష్ట్రాలలో అసమ్మతి వర్గాల మధ్య సయోధ్యను కుదర్చటం, ఎవరి బాధ్యతలలో వారు నిమగ్నమై పనిచేసేలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. బిజెపి చేస్తున్న దాడులను, కాంగ్రెస్‌ను బలహీనపరిచే ఇతర పార్టీల కుట్రలని ఎదుర్కొనేవిధంగా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం మరింత ప్రధానం.
కాంగ్రెస్ అవసరాన్ని ప్రజలు గుర్తించేలా పార్టీ వ్యవహారాల్లో మార్పు రావాలి. నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకులు మరింత చురుకుగా పనిచేసేలా దిశానిర్దేశం చేయగల యంత్రాంగం పటిష్టం కావాలి. స్వాతంత్య్రానంతరం ఆధునిక భారతదేశం నిర్మాణంలో నెహ్రూ పాత్రని పదేపదే గుర్తు చేసే కార్యక్రమాల రూపకల్పన సైతం తప్పనిసరి. నెహ్రూ మీద, కాంగ్రెస్ మీద బిజెపి విషప్రచారాన్ని ఎదుర్కొనే వ్యూహం కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఉత్సాహం నింపడానికి ఉపయోగపడుతుంది.
బలహీనపడితే ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు
వరుస ఓటములతో కుదేలయి, అంతర్గత తగాదాలతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతున్నదని కాషాయ మీడియా చేసే ప్రచారానికి అంతులేదు. కాంగ్రెస్‌లో మునుపటి పోరాటపటిమ లేదని, నాయకత్వ లేమీతో ఆ పార్టీ మునిగిపోయే పడవ అనే మీడియా విశ్లేషణలు, బిజెపి నాయకుల ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ప్రచారాలు తుదీమొదలు లేకుండా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని చెబుతూనే ఎప్పటికప్పుడు విషం చిమ్మడం ఎందుకు? దుందుడుకుతనంతో రాహుల్‌గాంధీ మీద విరుచుకుపడటం ఎందుకు? చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేని కాంగ్రెస్ గురించి చర్చోపచర్చలు ఎందుకు? ఈ ప్రశ్నలలోనే దానికి సమాధానం లభిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ విముక్త భారత్ అనే లక్ష్యం చేరుకోవడం అంత సులువు కాదని బిజెపికీ, మోదీ`అమిత్ షాలకు తెలుసు. అధికారంలో లేనప్పటికీ దేశవ్యాప్తంగా బలమైన నిర్మాణం గల ఏకైక పార్టీ కాంగ్రెస్. దానిని బలహీనపరచడం అంత సులువు కాదని వారికి తెలుసు. అంతేగాక బిజెపి పాలన మీద వ్యతిరేకత ఉన్న ఓటర్లకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపించే అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్ ఉనికి తమకు ఎప్పటికయినా ప్రమాదకరమని బిజెపి భావన. అధికారంలో లేనప్పటికీ అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ రెండో అతి పెద్ద పార్టీగా ఉందన్నది వాస్తవం. ఈ కారణంగానే కాంగ్రెస్ ఉనికి బిజెపికి ఇష్టం లేదు. నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్టీ వ్యవస్థలో మరో పార్టీ ఉనికినే లేకుండా చేయాలనుకోవడం ఆక్షేపణీయం, అభ్యంతరకరం. ప్రజల ముందు ప్రత్యామ్నాయం లేకుండా చేసే కుటిల వ్యూహాలు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు చేటు.
దేశంలో ఉన్న రాజ్యాంగం, అమలులో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థల సౌలభ్యం వల్లనే బిజెపి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఇతర పార్టీలను ఉనికిలో లేకుండా చేయాలనే కుట్రలకు తెగబడుతుంది. ప్రాంతీయ పార్టీలని సైతం అదృశ్యం చేసేలా వ్యవహరిస్తుంది. వందేళ్ళ పైబడిన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తే ఏకపార్టీ వ్యవస్థ నెలకొంటుంది. ప్రాంతీయ పార్టీలని నయానో భయానో లొంగదీసుకోవడం సులువు అవుతుంది. ఈ దుష్ట పన్నాగాల ఫలితమే కాంగ్రెస్ మీద, దాని ఉనికి పైన పరంపరగా కాషాయమూకలు దాడులు. విధానాలపై కన్నా వ్యక్తులపై విషం చిమ్ముతున్నాయి. నెహ్రూ, గాంధీ కుటుంబాలపైన అభూత కల్పనల్ని ప్రచారంలో పెట్టాయి. చరిత్రని వక్రీకరిస్తున్నాయి. ఇదంతా కాంగ్రెస్ మీద ముప్పేటదాడిగా భావించాలి.
ఈ పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన నేతలు సంయమనంతో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఉదాహరణకు సచిన్ పైలెట్. రాజస్థాన్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి. అంతర్గత పోరాటం చేస్తూనే కష్ట సమయంలో పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే ప్రధానమనుకున్న వారు కాంగ్రెస్‌లో కొనసాగుతారనడానికి తను సిసలైన ఉదాహరణ. తమ స్వార్థమే పరమార్థంగా భావించేవారు పార్టీ నుంచి నిష్క్రమించి వ్యక్తుల మీద, పార్టీ మీద ఆరోపణలు గుప్పిస్తారు. గులాం నబీ అజాద్ చేసిన పని అదే. పార్టీ నిర్ణయాల్లో, విధివిధానాల్లో లోపాలు, పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేయవచ్చు. కానీ శత్రువు పొంచి వున్న వేళ దుర్మార్గపుటాలోచనలు చేయడం అభ్యంతరకరం. అందువల్లనే గులాం నబీ అజాద్ రాజీనామాపై, లేఖపై కాంగ్రెస్ శ్రేణులు స్పందించాయి. రాహుల్‌గాంధీకి బాసటగా నిలిచాయి.
2004కు ముందు కన్నా కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నది నిజం. రెండు దఫాలుగా సార్వత్రిక ఎన్నికలలో వందసీట్లను గెలుచుకోలేకపోయింది. అనేక రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. అయినప్పటికీ ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీల ఉనికిని గుర్తిస్తూ, సర్దుబాట్లు చేసుకుంటూ తనదైన పద్ధతిన పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. బిజెపి మాదిరిగా ప్రాంతీయ పార్టీలని దెబ్బతీసే వ్యవహారసరళిని అనుసరించలేదు. పొత్తు పెట్టుకున్న పార్టీలనే నేలమట్టం చేయాలనే కుతంత్రాలకు పాల్పడలేదు. ఈ వాస్తవికతని గుర్తించినందునే అనేక ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పట్ల గౌరవం ఉంది. ఆ పార్టీ నేతృత్వంలో బిజెపికి ప్రత్యామ్నాయం నెలకొనాలన్న భావన పాదుకుంది. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థ దిశ దశను మార్చుకునేందుకు కాంగ్రెస్ నిలిచి బలపడాలి. ఈ క్రమంలో నెహ్రూ భావధారని చర్చలోకి తీసుకురావాలి. నెహ్రూ చరిత్రకు మకిలి పట్టించాలనుకునే బిజెపిని ఎదుర్కొడానికి ఆయన ఆలోచన, వివేచన, దూరదృష్టిని ఆయుధంగా చేసుకోవాలి. ఇక్కడ మరోసారి ఫ్రాంక్ మొరేస్ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి: ''1926లో యూరపు వెళ్ళినప్పుడు నెహ్రూకు సామ్యవాదంతో అనుబంధం అంతంత మాత్రమే. అప్పట్లో కూడా జాతీయతావాదం అసంపూర్ణమనీ, ప్రజానీకం ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే జాతీయతావాదానికి పూర్ణత్వం ప్రాప్తిస్తుందనీ ఆయన భావించాడు''. ఈ మాటలు చాలు కదా బిజెపి జాతీయతావాదానికి ఎదుర్కొవడానికి. జాతీయత పేరుతో దేశభక్తి కొంగజపం చేస్తున్న బిజెపి విధానాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయి. చేయడానికి పనుల్లేక అర్ధాకలితో అలమటించే వారికి బిజెపి బూటకపు జాతీయతా నినాదాలు ఒరగబెట్టేదేమీ లేదు. కనుకనే ఆర్థిక, రాజకీయ రంగాలలో జనం కోసం కాంగ్రెస్ ఏం చేయబోతున్నదో నిర్దిష్టంగా, కచ్చితంగా చెప్పాలి. తద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి, నిజమైన జాతీయతావాదానికి బలం చేకూరుతుంది. ఇది అంతిమంగా కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం బలపడటానికి దోహదం చేస్తుంది.