Telugu Global
Editor's Choice

'మైత్రివనం' కేంద్రంగా స్కాం స్టర్‌!

ఆయన ఓకే చెప్తేనే ఎంఏయూడీ, హెచ్‌ఎండీఏ ఫైళ్లలో కదలిక

మైత్రివనం కేంద్రంగా స్కాం స్టర్‌!
X

తెలుగు గ్లోబల్‌ ఎక్స్‌క్లూజివ్‌


ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు. రేవంత్‌ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నాల్లో ఆయన ఒక నిందితుడు. నిత్యం జూబ్లీహిల్స్‌ లోని సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటి వద్దనే ఉంటూ వీవీఐపీల వ్యవహారాలన్నీ ఆయనే చక్క బెడుతుంటారు. ఎమ్మెల్యేల ప్రొక్యూర్‌మెంట్‌ వ్యవహారాల్లోనూ అప్పట్లో తలదూర్చారు. ఆయనను ఢిల్లీలో పెట్టి రాష్ట్ర వ్యవహారాలు చక్కబెట్టాలని కూడా అప్పట్లో అనుకున్నారు.. కానీ ఏమైందో ఏమో.. హైదరాబాద్‌ లోనే కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్ద ఉన్న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖకు షాడో మంత్రి కూడా ఆయనే. ఇప్పుడు చెప్తేనే ఎంఏయూడీ, హెచ్‌ఎండీఏలో ఏ ఫైల్‌ అయినా కదిలేది. ఆయన నోటీస్‌ లేకుండా ఏ ఉన్నతాధికారి కూడా ఒక్క ఫైల్‌ క్లియర్‌ చేయడానికి లేదు. హెచ్‌ఎండీఏ హెడ్‌ ఆఫీస్‌ ఉన్న మైత్రివనం కేంద్రంగానే ఆయన ఇప్పుడు దందాలు నడిపిస్తున్నారు. అందరూ ఆయనను ముందుగా స్కాం స్టర్‌ అని పిలుస్తున్నారు కూడా. గతంలో ఒకటి, రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఏదైనా సంస్థ వెంచర్‌ ఏర్పాటు చేస్తే నిబంధనల మేరకు అన్ని క్లియరెన్స్‌ లు ఉన్నాయా లేదా చూసుకొని నిర్దేశిత ఫీజు చెల్లించిన తర్వాత ఆ శాఖ ఉన్నతాధికారి దానికి అప్రూవల్‌ ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మొత్తంగా మారిపోయింది. అలాంటి వెంచర్‌లకు క్లియరెన్స్‌ ఇవ్వాలన్నా సదరు స్కాం స్టర్‌ అనుమతి తప్పనిసరి. ఆయన చెప్పకుండా ఏ ఒక్క ఉన్నతాధికారి కూడా అలాంటి అనుమతులు ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వ పెద్దల నుంచి క్లియర్‌ కట్‌ ఆదేశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు.



సదరు స్కాం స్టర్‌ ఆదేశాలు లేకపోవడంతో హెచ్‌ఎండీఏ, ఎంఏయూడీలో మొత్తంగా 670 ఫైళ్లు పెండింగ్‌ లో ఉన్నాయట. నాలుగు రోజుల నుంచి ఉన్నతాధికారులు ఒక్క ఫైల్‌ కూడా క్లియర్‌ చేయలేదట.. అలా క్లియర్‌ చేయకుండా సదరు స్కాం స్టర్‌ ఒత్తిడి తెస్తున్నారని ప్రభుత్వంలోని ముఖ్యులే చెప్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ శాఖలకు సంబంధించిన ఒక ఉన్నతాధికారి విదేశీ పర్యటనకు వెళ్లారు. అదే సమయంలో స్కాం స్టర్‌ దగ్గరకి ఒక కీలక ఫైల్‌ వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలోని సర్వే నంబర్లు 15, 16, 17, 18, 20, 22, 23, 27, 28, 29, 30, 31, 32లో గల 81,341.78 స్క్వేర్‌ మీటర్లు అంటే 20.09 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్‌ యూసేజీ నుంచి రెసిడెన్షియల్‌ యూసేజీకి కన్వర్షన్‌ చేయాలనేది ఆ ఫైల్‌ సారాంశం. ఆ స్థలాన్ని రెసిడెన్షియల్‌ జోన్‌ కు మార్చి భారీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ కు ప్లాన్‌ చేస్తున్న వ్యక్తులు సదరు స్కాం స్టర్‌ ను కలిశారు. ముట్టజెప్పాల్సిన మొత్తం ఇచ్చేశారు. వెంటనే ఆ ఫైల్‌ కు రెక్కలొచ్చింది. చకచకా ప్రాసెస్‌ పూర్తయ్యింది. విదేశీ పర్యటనకు వెళ్లిన ఉన్నతాధికారికి ఈ ఆఫీస్‌ విధానంలో సదరు ఫైల్‌ పంపారు. ఆయనకు స్కాం స్టర్‌ నుంచి ఫోన్‌ వెళ్లడంతో మారు మాట్లకుండా క్లియరెన్స్‌ ఇచ్చేశారు. నిత్యం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హెచ్‌ఎండీఏకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో సదరు స్కాం స్టర్‌ తలదూర్చుతున్నారు. ఉన్నతాధికారుల చుట్టూ వ్యాపారులు తిరిగి తిరిగి విసిగి పోయినా ఒక్కరి ఫైల్‌ కూడా క్లియర్‌ చేయడం లేదు.

ప్రస్తుత ముఖ్యమంత్రి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖను తనతో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి రాసి ఇచ్చారని మైత్రివనంను ఆనుకునే ఉండే స్వర్ణజయంతి కాంప్లెక్స్‌ లో చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఏ పదవి లేని వ్యక్తికి ఉన్నతాధికారులు నిత్యం రిపోర్ట్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. గతంలో 15, 20 ఎకరాలు.. అంతకన్నా ఎక్కువ మొత్తంలో భూములు కన్వర్షన్‌ కోసం వస్తేనే ప్రభుత్వ పెద్దల పరిశీలనకు వెళ్లేవని.. అంతకన్నా తక్కువ ఎకరాల భూముల కన్వర్షన్‌ పై ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకునే వారని చెప్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మొత్తం మారిపోయిందని.. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు కూడా స్కాం స్టర్‌ అనుమతి లేకుండా ఏమి చేయలేని దుస్థితిలో ఉన్నారని ఆ శాఖ అధికారులే చెప్తున్నారు. సొంత భూములు, వారసత్వంగా వచ్చిన భూముల కన్వర్షన్‌ కోసం తాము ఎవరికో ఎందుకు ముడుపులు ఇచ్చుకోవాలని ఆ భూముల కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు అధికారులను నిలదీస్తున్నారు. ''పట్టుమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం'' అన్నట్టుగా ఉన్నతాధికారులు స్కాం స్టర్‌ కు అప్లికేషన్లు పెట్టుకున్న వారి మధ్య నలిగిపోతున్నారు.

First Published:  11 Nov 2024 7:16 PM IST
Next Story