రేవంత్ యూటర్న్.. ఫార్మా కాదు ఇండస్ట్రియల్ క్లస్టర్
కొడంగల్ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడుత.. కమ్యూనిస్టు పార్టీల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా.. కమ్యూనిస్టు పార్టీల నేతలను నమ్మించడానికి అబద్ధం చెప్తున్నారా అనే చర్చ మొదలైంది. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల సమీప గ్రామాల్లో ఫార్మా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం, గిరిజనులపై పోలీసుల అఘాయిత్యాలపై కమ్యూనిస్టు పార్టీల నేతలు శనివారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గిరిజనులు, రైతుల భూముల్లో కాలుష్యకారక ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేస్తారన్న ఆందోళన అక్కడి ప్రజల్లో ఉందని వివరించారు. సీఎం స్పందిస్తూ.. తాను కొడంగల్ లో తలపెట్టింది ఫార్మా పరిశ్రమలు కాదన్నారు. కొడంగల్ లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. తన నియోజకవర్గంలోని ప్రజలు, యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలను తానేందుకు ఇబ్బంది పెడుతానని అన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామన్నారు. భూసేకరణ పరిహారం పెంపు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నాయకులు లగచర్ల ఘటనపై ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. సీఎంను కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వివిధ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఉన్నారు.
ఫార్మా పరిశ్రమ పేరుతో భూసేకరణ ఎందుకు?
సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతానని కమ్యూనిస్టు పార్టీల నాయకులను ఎదురు ప్రశ్నించడం వెనుక వ్యూహమేమిటా అనే చర్చ మొదలైంది. సొంత నియోజకవర్గంలో ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు రైతులను ఒప్పించి మెప్పించి భూమి సేకరించాలి. అలా కాకుండా అధికార బలాన్ని ప్రయోగించాలని రేవంత్ చూశారు. కలెక్టర్, అధికారులపై దాడులు చేశారని చెప్తూ లగచర్ల సహా సమీప గ్రామాలపై వందలాది మంది పోలీసులు అర్ధరాత్రి పడి కరెంట్ తీసి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. బాధిత మహిళలు ఢిల్లీ వరకు ఎస్సీ, ఎస్టీ, మావన హక్కుల కమిషన్, మహిళ కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు తన అల్లుడి కోసం పేదల భూములను రేవంత్ చెరబడుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దానిని ప్యాచ్ అప్ చేసుకోవడానికి కలెక్టర్ పై హత్యాయత్నానికి రూ.10 కోట్ల సుపారీ ఇచ్చారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఈమొత్తం వ్యవహారం కేసీఆర్ కనుసన్నల్లో సాగిందనే ప్రాపగండాకు ప్రయత్నించారు. అవేవి ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోగా బాధిత రైతులు, గిరిజనుల్లో కోపం మరింత ఎక్కువైంది. హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్టీ కమిషన్, ఉమెన్ కమిషన్ లగచర్లలో ఏం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డాయి. దీంతో ఇన్నాళ్లూ ఫార్మా పరిశ్రమపై ఎటాకింగ్ మోడ్‌లో ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా డిఫెన్స్ మోడ్ లోకి మారారు. తామేందుకు ప్రజలను ఇబ్బంది పెడుతామని అంటున్నారు. అదే నిజమైతే ఫార్మా పరిశ్రమల పేరుతో భూసేకరణకు ఎందుకు ప్రయత్నించారు? లగచర్లలో గిరిజనులపై పోలీసుల అఘాయిత్యాలకు బాధ్యులపై ఎందుకు చర్యలు చేపట్టలేదనే ప్రశ్నలు ప్రభుత్వాన్ని వేధిస్తున్నాయి. అల్లుడి పరిశ్రమల కోసమే బలవంతపు భూసేకరణ అనే ప్రచారం నుంచి బయట పడేందుకే కమ్యూనిస్టు నాయకులతో సీఎం అలా మాట్లాడారని.. అక్కడ ఫార్మా పరిశ్రమల ఏర్పాటు ఖాయమని ప్రభుత్వంలోని ముఖ్యులే చెప్తున్నారు.