Telugu Global
Editor's Choice

ఫార్ములా ఈ పై రేవంత్‌ పొలిటికల్‌ రేస్‌

బీఆర్‌ఎస్‌ నేతల కట్టడికి కాంగ్రెస్‌ సర్కార్‌ కేసుల కుట్రలు

ఫార్ములా ఈ పై రేవంత్‌ పొలిటికల్‌ రేస్‌
X

రేవంత్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ఆరు గ్యారెంటీల గురించి నిలదీస్తుంటే తట్టుకోలేకపోతున్నది. అందుకే ఎలాగైనా బీఆర్‌ఎస్‌ నేతలను రాజకీయంగా దెబ్బతీయాలని కేసులు పెడుతున్నది. ముఖ్యంగా కేటీఆర్‌, హరీశ్‌రావులపై కేసులు పెట్టి కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా - ఈ రేస్‌పై ప్రభుత్వం దుష్ప్రచారాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఫార్ములా-ఈ రేస్ అంటే ఏమిటి? దీనివల్ల జరిగిన లాభాలు ఏమిటి? హైదరాబాద్‌కు ఫార్ములా రేస్‌ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఫార్ములా-ఈ రేస్‌ చరిత్ర ఇది

మోటార్‌ కార్‌ రేసింగ్‌ క్రీడ అనేది ఇవాళ బీఆర్‌ఎస్‌ కొత్తగా తెచ్చిందేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నది. పేరెన్నిక, ప్రజాదరణ ఉన్న క్రీడ ఇది. నెట్‌ జీరో కార్బన్‌ ఘనత సాధించిన మొదటి క్రీడా కూడా ఇదే. దీనివల్ల ఆయా దేశాల బ్రాండ్‌ ఇమేజ్‌ పెరగడంతో పాటు పర్యాటక ఆదాయం పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణ కోసం, ఎలక్టిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి గత కొన్నేళ్లుగా చాలా దేశాల్లో స్ట్రీట్‌ సర్క్యూట్లలో ఫార్ములా ఈ కార్ల రేసులను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే లండన్‌, సియోల్‌, బీజింగ్‌, బెర్లిన్‌, మాస్కో వంటి ప్రముఖ నగారాల్లో ఇప్పటికే వందల ఫార్ములా కార్‌ రేస్‌ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

ఫార్ములా వన్‌ నిర్వహణ ప్రతిపాదన పాతదే

ఫార్ములా వన్‌ ఇక్కడ నిర్వహించాలని 2003లోనే నాటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు సెప్టెంబర్‌ లో అప్పటి ఎఫ్‌1 సీఈవో బర్ని ఎకల్‌స్టోన్‌తో భేటీ అయ్యారు. మా దేశానికి, మా హైదరాబాద్‌కు ఎఫ్‌1 కావాలని కోరారు. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లాలో పెట్టాలనే ప్రయత్నం జరిగింది. దీనికి కోసం 400 ఎకరాలు సేకరించాలని భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే దీనిపై రైతులు తాము భూమి ఇవ్వమని కోర్టు వెళ్లారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులోనే ఉన్నది. ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టును కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. ఫార్ములా - ఈ రేస్‌ నిర్వహణ కోసం హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబయి పోటీ పడ్డాయి.

అయితే బీఆర్‌ఎస్‌ ఈ ఫార్ములా - ఈ రేస్‌ను హైదరాబాద్‌కు తీసుకునిరావాలని యత్నించింది. దీని కోసం గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎలక్టిక్‌ వాహనాల వినియోగంలో అప్పటికే అగ్రభాగాన ఉన్న హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ మరింత పెంచాలని సంకల్పించింది. నాటి మున్సిపల్‌ శాఖమంత్రి కేటీఆర్‌ చొరవతో ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహకులు హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకున్నారు. రాబోయే సీజన్లలో మరికొన్ని రేస్‌లు నిర్వహించడానికి ఫార్ములా-ఈ నిర్వాహకులతో తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాన్ని చేసుకున్నది. అందులో ఎలక్రిక్ట్‌ వెహికిల్స్‌కు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు కార్‌ రేస్‌ ఈవెంట్‌ను దానితో జత చేశారు. దీనిలోభాగంగానే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022 జులై 11న జీవో ఇచ్చింది. మెక్‌ లారెన్‌, నిస్సాన్‌, టీసీఎస్‌, జాగ్వార్‌తో పాటు మహీంద్రా కూడా ఫార్ములా రేస్‌లో పాల్గొంటుందని ఆనంద్‌ మహీంద్రను సలహాదారుగా అందులో నియమించింది. ఆ రేస్‌ నిర్వహణ కోసం స్ట్రక్చర్‌ కు సంబంధించి మొత్తం సమగ్రంగా డిజైన్‌ చేసింది.

రేవంత్‌ ప్రభుత్వ చర్యలతో దెబ్బతిన్న హైదరాబాద్‌ ఇమేజ్‌

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేలా ఫార్ములా-ఈని ఇక్కడికి తీసుకొచ్చింది. మొత్తం ప్రభుత్వ ఖర్చు (హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ) తోనే రూ. 46 కోట్లు, ఒక ప్రమోటర్‌ను (గ్రీన్‌ కో) ఆయన రూ. 100 కోట్లు పెట్టారు. ఇట్లా ఈ రేసు కోసం మొత్తం ఖర్చు పెట్టింది రూ. 150 కోట్లు. 2023 ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. చాలా దేశాలు, రాష్ట్రాల నుంచి 35,000 మంది హైదరాబాద్‌ వచ్చి ఈవెంట్‌ను చూశారు. ఫార్ములా -ఈ రేసు నిర్వహించడం వల్ల ప్రపంచంలోని ప్రముఖ నగరాల సరసన హైదరాబాద్‌ చేరింది. దేశంలో ఫార్ములా ఈ రేస్ జరిగిన ఘనతను హైదరాబాద్‌ నగరం సొంతం చేసుకున్నది. హైదరాబాద్‌ ఎకో సిస్టమ్‌ కు రూ. 700 కోట్ల లాభం జరిగిందని నెల్సన్‌ అనే స్వతంత్ర సంస్థ రిపోర్టు ఇచ్చిన విసయం తెలిసిందే. ఇలా హైదరాబాద్‌ నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన ఏబీబీ ఫార్ములా- ఈ రేస్‌పై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్‌ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి నష్టాలు వస్తున్నాయి. రేవంత్‌ సర్కార్‌ వ్యవహరించిన తీరు చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసుకున్న ఒప్పందాన్ని రేవంత్‌ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రానికి గత పదేళ్ల కాలంలో ఉన్న ఇమేజ్‌ను దెబ్బతీసింది.

కేసులో ఇరికించాలనే కుట్ర

నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో, ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్నది. హెచ్‌ఎండీఏ బోర్డు అనుమతి లేకుండానే ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండానే రూ. 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడాన్ని తప్పుపడుతున్నది. హెచ్‌ఎండీఏ అనేది సర్వస్వతంత్రమైన బోర్డు అని, దానికి ఛైర్మన్‌ సీఎం అని, వైస్‌ ఛైర్మన్‌ మున్సిపల్‌ మినిస్టర్‌ అని దీనిపై కేటీఆర్‌ ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఫార్ములా- ఈ కారు రేసు వ్యవహారంలో చిన్న సాంకేతిక సమస్యను పట్టుకుని గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నది. అధికారం మారినా ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్‌ అనేది అందరికీ తెలిసిందే. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఫార్ములా-ఈ రేస్‌ నిర్వాహకులకు అధికారులు విడుదల చేయాలని తానే ఆదేశించానని స్పష్టం చేశారు. ఎందుకంటే ఈవెంట్‌ను కాపాడుకోవడంతో పాటు సిటీ ఇమేజ్‌ దెబ్బతీయకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం వివాదాస్పదం చేస్తున్నది. ఎలాగైనా దీన్ని రాద్ధాంతం చేయాలి. కేటీఆర్‌ను ఇరికించాలని కుట్ర చేస్తున్నది.

First Published:  14 Dec 2024 3:36 PM IST
Next Story