Telugu Global
Editor's Choice

బనకచర్ల కట్టుకోమని చంద్రబాబుకు రేవంతే చెప్పిండా!?

ప్రజా భవన్‌ భేటీలోనే ఆ ప్రాజెక్టుకూ బీజం పడిందా?

బనకచర్ల కట్టుకోమని చంద్రబాబుకు రేవంతే చెప్పిండా!?
X

గోదావరి - బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు.. పోలవరం నుంచి 200 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌ కు అక్కడి నుంచి పెన్నా బేసిన్‌ కు తరలించే ప్రాజెక్టు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును కేంద్రం సాయంతో పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి వరద జలాలను మళ్లించే మాటున తలపెట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు హైదరాబాద్‌లోనే బీజం పడిందా? తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల భేటీలోనే ఈ ప్రాజెక్టు తలపెట్టబోతున్నట్టు రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు చెప్పారా? రేవంత్‌ రెడ్డి ఆమోదంతోనే చంద్రబాబు రైట్‌ రాయల్‌ గా గోదావరి - బనకచర్ల లింక్‌ ప్రాజెక్టును ఎనౌన్స్‌ చేశారా? అనే ప్రశ్నలు సామాన్య ప్రజల నుంచే కాదు కాంగ్రెస్‌ వర్గాల నుంచి కూడా వినవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నట్టు బయటికి చెప్పినా ఈ భేటీ వెనుక ఇంకా ఏవో కారణాలున్నాయనే వాదనలు మొదటి నుంచి ఉన్నాయి. వాటిని రూడీ చేసేలా రేవంత్‌ రెడ్డితో సమావేశమైన కొన్ని రోజులకే చంద్రబాబు నాయుడు గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టు చేపడుతున్నట్టు ప్రకటించారు.

దవళేశ్వరం బ్యారేజీని దాటుకొని బంగాళాఖాతంలో కలిసే గోదావరి జలాలను మళ్లించి తమ రాష్ట్ర అవసరాలకు ఉపయోగించుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు రోజుకు 28 వేల క్యూసెక్కులు (రెండున్నర టీఎంసీలు) తరలించే పనులకు రూ.13,511 కోట్లు, ప్రకాశం బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్‌ కుడి కాలువ మీదుగా బొల్లాపల్లి రిజర్వాయర్‌ వరకు సెగ్మెంట్‌ -2గా చేపట్టే పనులకు రూ.28,560 కోట్లు, బొల్లాపల్లి రిజర్వాయర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన ఉన్న బనకర్ల క్రాస్ రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌ వరకు సెగ్మెంట్‌ -3గా చేపట్టే పనులకు రూ.38,041 కోట్లు ఖర్చు చేయబోతున్నామని ప్రకటించారు. తొమ్మిది పంపుహౌస్‌లు, 150 టీఎంసీల కెపాసిటీతో బొల్లాపల్లి ఆర్టిఫీషియల్‌ రిజర్వాయర్‌, పోలవరం నుంచి 359 కి.మీ.ల దూరంలోని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌కు నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. తద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు, నాగార్జున సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుతో పాటు శ్రీశైలం ఆధారంగా ఏపీ చేపట్టిన తెలుగు గంగా, గాలేరు - నగరి, శ్రీశైలం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ ఆయకట్టును పరిరక్షించడం.. తుంగభద్ర ఆధారిత కేసీ కెనాల్‌ ఆయకట్టును పరిపుష్టం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశాలు. అంటే కృష్ణా నదిలో నీటి లభ్యత లేకున్నా గోదావరి నీళ్లను మళ్లించి ఏపీలోని ప్రధాన ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగునీటి భరోసా కల్పించడం.. ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు తాగునీటి సమస్యే రాకుండా చూసుకోవడం ఈ ప్రాజెక్టు ధ్యేయంగా కనిపిస్తోంది.

తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎన్నికైన కొన్ని నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌ ఘన విజయం సాధించారు. గోదావరి నుంచి వృథాగా సముద్రంలోకి పోతున్న వరద జలాలను మళ్లించుకొని రెండు రాష్ట్రాలు బాగుపడాలని కేసీఆర్‌ సలహా ఇచ్చారు. సమ్మక్క సాగర్‌ బ్యారేజీ (తుపాకులగూడెం) నుంచి గోదావరి నీళ్లను మళ్లించి నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి భరోసానివ్వడంతో పాటు మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటిని అందిస్తూ రాయలసీమకు నీళ్లు మళ్లించుకోవాలని అప్పట్లో కేసీఆర్‌ ప్రతిపాదించారు. ఈ దిశగా రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌ ఇంజనీర్ల మధ్య పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. ఏపీ ఇంజనీర్లు అనేక కొర్రీలు పెట్టడంతో చర్చల దశలోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. కేసీఆర్‌ తో భేటీ తర్వాత ఏపీ సీఎం జగన్‌ రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇరిగేషన్‌ శాఖ వెంటనే కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. అయినా కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు కేసీఆర్ సలహాతోనే జగన్‌ రాయలసీమ ఎత్తిపోతలను తలపెట్టారని.. ప్రగతి భవన్‌లోనే దీనికి స్కెచ్‌ గీశారని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ, శ్రీశైలం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ విస్తరణ మాత్రమే కాదు.. అప్పట్లోనే జగన్‌ తలపెట్టిన పోలవరం - బనకచర్ల లింక్‌ ప్రాజెక్టులను తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ వ్యతిరేకించారు. అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కు స్వయంగా లేఖ రాశారు. ఏపీ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ 2020 మే నెల నుంచి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలను అఫీషియల్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రస్తావిస్తోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ విమర్శలకు వచ్చే వరకు మాత్రం కేసీఆర్‌ పై అబద్ధపు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. రేవంత్‌ రెడ్డితో చంద్రబాబు ప్రజాభవన్‌ లో భేటీ అయిన తర్వాతనే గోదావరి - బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై ఏపీ సీఎం ప్రకటన చేశారు. రేవంత్‌ రెడ్డి గురుదక్షిణగా గోదావరి - బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. అందుకే ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును తలపెట్టిన తర్వాత కూడా రేవంత్‌ మౌనంగా ఉన్నారు.. పత్రికల్లో వార్తలు వచ్చిన తర్వాత ఏపీ ప్రాజెక్టుపై కేంద్రానికి, గోదావరి, కృష్ణా బోర్డులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారే తప్పా స్వయంగా తానే ప్రధాన మంత్రికి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖలు రాయలేదు. చంద్రబాబు తలపెట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రం పెద్దలను కలిసి ఫిర్యాదు కూడా చేయలేదు. రేవంత్‌ సమ్మతితోనే చంద్రబాబు గోదావరి - బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు చేపట్టారని.. ప్రజాభవన్‌ లోనే దీనికి బీజం పడిందని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలేం కావాలి!?

First Published:  21 Feb 2025 5:43 PM IST
Next Story